వ్యవసాయంలో అ..ఆ..లు తెలియవు!

Sep 18 2021 @ 00:24AM
‘రైతు కోసం తెలుగుదేశం’ సదస్సులో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

 అతను వ్యవసాయ శాఖా మంత్రా.. ఇది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం  

 రూ.4 వేల కోట్లతో ధరల స్థిరీకణ నిధి ఏమైంది?

 పంటల బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి 

 జగన్‌ పిచ్చి పనులు చేస్తున్నాడు కాబట్టే తుగ్లక్‌ అంటున్నాం

రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ అధికారంలోకి రావాలి 

 ‘రైతు కోసం తెలుగుదేశం’ సదస్సులో అయ్యన్న  

నర్సీపట్నం, సెప్టెంబరు 17 : వ్యవసాయంలో అ...ఆలు తెలియని కన్నబాబు ఆ శాఖకు మంత్రిగా పనిచేయడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్య మని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ‘రైతు కోసం తెలుగుదేశం’ సదస్సులో మాట్లాడారు.  రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని  విమర్శించారు. రూ.4వేల కోట్లతో ధరల స్థిరీకణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చారని, రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణ పనులు 72 శాతం పూరిచేస్తే, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక 0.89 శాతం  మాత్రమే పనులు చేయగలిగారన్నారు. పంటలకు గిట్టుబాబు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.    టీడీపీ ప్రభుత్వంలో రూ.14 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. ప్రస్తుతం రైతు రుణ మాఫీ పథకాన్ని రద్దు చేసి, కేంద్రం నిధులతో రైతుభరోసా పథకం అమలు చేస్తూ రైతులను మోసం చేయడం లేదా అని ప్రశ్నించారు. తన నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు. దీనిని తట్టుకోలేక ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించిన వారిపై పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి పిచ్చి పనులు చేస్తున్నాడు కాబట్టి పిచ్చి తుగ్లక్‌ అంటున్నామని, అందులో తప్పే ముందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, పిల్లల భవిష్యత్‌ కోసం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి వ్యాపారం చేస్తున్నానని అనకాపల్లి ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ తనను ఉద్దేశించి ఆరోపించారని, ఈ ప్రాంతంలో గంజాయి వ్యాపారులు ఎవరో పోలీసులను అడిగితే తెలిసి పోతుందన్నారు. గంజాయి వ్యాపారులంతా మీ పార్టీలోనే ఉన్నారన్న విషయం మరిచిపోకూడదని అన్నారు.  కొంత మంది రైతులు సభలో మాట్లాడారు. అనంతరం అయ్యన్న చిన్నకుమారుడు రాజేశ్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించగా, పోలీసులు అనుమతించలేదు. దీంతో కొంత మంది ముఖ్య నాయకులతో వెళ్లి రాజేశ్‌ సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే అనిత, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి సుకల రమణమ్మ, నాయకులు కరక సత్యనారాయణ, అబ్బారావు, లాలం కాశినాయుడు, గవిరెడ్డి వెంకటరమణ, సింగంపల్లి సన్యాసిదేముడు, నేతల విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.