నేను డైలాగులు కాదు... మాటలు రాస్తా!

ABN , First Publish Date - 2022-09-25T06:47:08+05:30 IST

సోషల్‌ మీడియా పెరిగిపోయాక.. ప్రతి ఒక్కరిలోనూ ఓ రచయిత పుట్టుకొస్తున్నాడు.

నేను డైలాగులు కాదు... మాటలు రాస్తా!

‘చందమామ’లో మాటలు ఒకలా వినిపిస్తాయి.‘ఓ బేబీ’లో ఆ సౌండ్‌ వేరు. ‘మహాత్మ’లో మరో లెక్క. ‘అలా మొదలైంది’ ‘నేనే రాజు నేనే మంత్రి’,‘కల్యాణ వైభోగమే’... ఒకదానితో మరోటి పోలిక లేదు. ఏ జోనర్‌కీ ‘మాట’ రానివ్వలేదు. అదీ.. లక్ష్మీ భూపాల అంటే. టాలీవుడ్‌లో ఈమధ్య ఇంకాస్త గట్టిగా వినిపిస్తున్న రచయిత పేరు.. లక్ష్మీ భూపాల. ఇప్పుడు నిర్మాతగానూ మారారు. చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’కి ఈయనే సంభాషణలు అందించారు. ఈ నేపథ్యంలో ‘నవ్య’తో ఈ ‘భూపాల’ రాగం.


సోషల్‌ మీడియా పెరిగిపోయాక.. ప్రతి ఒక్కరిలోనూ ఓ రచయిత పుట్టుకొస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మాటలు రాయడం, రాసి మెప్పించడం రచయితలకు సవాలే కదా?

సోషల్‌ మీడియా రాతలకూ, సినిమా సంభాషణలకూ చాలా తేడా ఉంది. ఫేస్‌ బుక్‌లో మీకు ఇష్టమైంది, మీకు నచ్చింది రాసుకోవొచ్చు. సినిమా అలా కాదు. కథకేం కావాలో అదే రాయాలి. మీ విజ్ఞాన ప్రదర్శన సినిమాకు అవసరం లేదు. సినిమా బలమైన మాధ్యమం. ఓ సమూహాన్ని మెప్పించాలి. అందుకు కామన్‌ సెన్స్‌ అవసరం.

వాడుక భాష వేరు.. పత్రికాభాష, సినిమా భాష వేరు. ఇప్పుడు మొత్తం ఏకమైపోయాయి. ఇది ఏరకమైన ట్రెండ్‌?

ఒకప్పుడు హీరో అంటే రాముడిలా చూపించేవారు. సకల గుణ సంపన్నుడే మన కథానాయకుడు అయ్యేవాడు. దానికి తగ్గేట్టే సంభాషణలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. వాడెంత ఎదవైతే.. అంత హీరోయిజం పండుతుందని భ్రమపడుతున్నారు. ఇది వరకు సినిమా డైలాగులే ఆ తరవాత వాడుకలోకి వచ్చేవి. ‘ఎంకమ్మ’, ‘బాక్సు బద్దలైపోద్ది, ‘ఆమ్యామ్యా..’  సినిమాల్లోంచి పుట్టుకొచ్చి జనం మాటల్లో కలిసిపోయాయి. ఇప్పుడు జనం మాట్లాడుకొనే మాటలే సినిమాల్లో వినిపిస్తున్నాయి. నావరకూ నేను ‘డైలాగులు’ రాయాలి అనుకోను. కేవలం మాటలు మాత్రమే రాస్తా.


డైలాగులకూ, మాటలకూ తేడా ఉందా..?

ఉంది. ‘డైలాగు’ అనేది సినిమా మీటర్‌లో సాగుతుంది. ప్రాసలూ, పంచ్‌లూ.. అవే డైలాగులు అనుకొంటున్నారు. మాటలు.. వేరు. అవి కథలోంచి, పాత్రల్లోంచి పుట్టుకురావాలి. సినిమా ఎలా ఉన్నా.. నా డైలాగులే గుర్తున్నాయంటే నేను ఫెయిల్‌ అయినట్టే. ‘ఆ సినిమాలో మంచి డైలాగులు రాశారండీ.. ఒక్కటీ గుర్తుకు లేదు..’ అని ఓ పాత్రికేయుడు నాతో అన్నాడు. నిజంగా అది గొప్ప ప్రశంసగా తీసుకొంటా. 


మీకు సౌలభ్యంగా ఉండే జోనర్‌ ఏది? 

ఫలానా జోనర్‌ అని ఏం లేదు. నాకు ఏ జోనర్‌ కథ ఇస్తే.. అందులో కూర్చుంటా. ఆ కథని ఆకళింపు చేసుకొని సంభాషణలు అందిస్తా. ‘చందమామ’ వచ్చాక... ఈ టైపు సినిమాలే బాగా రాస్తాడేమో అనుకొన్నారు. కానీ దాన్ని ‘మహాత్మ’లో బ్రేక్‌ చేశా. ఒక్కో సినిమా ఒక్కో అనుభవాన్ని అందించింది. ఒక్కో సినిమాకీ ఒక్కో తరహాగా రాసుకుంటూ వెళ్లడం వల్లే... నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. త్వరలో రాబోతున్న ‘గాడ్‌ ఫాదర్‌’లో ఈ మీటర్‌ మరోలా ఉంటుంది.

చిరంజీవి లాంటి స్టార్‌ హీరోతో సినిమా అనగానే మీ మదిలో మెదిలిన భావాలేంటి?

బేసిగ్గా... హీరో వర్షిప్‌ అనే పదానికి నేను దూరం. కానీ ‘పున్నమి నాగు’ చూశాక నాకు మతిపోయింది. ‘ఈ హీరో ఏంటి? ఇలా చేస్తున్నాడు’ అనుకొన్నా. ఆయన చేసిన కమర్షియల్‌ సినిమాలకంటే.. ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’, ‘రుద్రవీణ’ సినిమాలంటేనే నాకిష్టం. స్ర్కీన్‌పై ఓ సన్నివేశంలో నటిస్తూ, థియేటర్‌ మొత్తంతో ఇంట్రాక్ట్‌ అయ్యే ఒకే ఒక్క హీరో.. చిరంజీవి గారే. స్టెప్పు వేస్తూనో, డైలాగ్‌ చెబుతూనో, థియేటర్లో ఆడియన్స్‌ వైపు చూస్తూ ఓ లుక్‌ ఇస్తారు.. అలా.. థియేటర్‌ మొత్తాన్ని కమాండ్‌లోకి తెచ్చుకోవడం ఆయనకే సాఽధ్యం. ‘గాడ్‌ ఫాదర్‌’లో నా సంభాషణల్ని ఆయన నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లారు. 

దర్శకులే కథ, మాటలు రాసేసుకోవడంతో రచయిత ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతోందని భావిస్తున్నారా?

చాలామంది దర్శకులు కథని అల్లుకొన్నప్పుడే కొన్ని ‘కీ’ డైలాగులూ అనుకొంటారు. నిర్మాతల్ని మెప్పించడానికి ఆ డైలాగులే స్ర్కిప్టు నేరేషన్‌లో చెప్తారు. నిర్మాత ‘మాటలు బాగానే ఉన్నాయ్‌ కదా.. నువ్వే రాసేయ్‌’ అంటాడు. కొన్నిసార్లు రచయితకు బడ్జెట్‌ కేటాయించలేకపోవడం వల్ల దర్శకుడే ఆ బాధ్యతని నెత్తిమీద వేసుకోవాల్సి ఉంటుంది. హీరోలు, నిర్మాతలు కూడా కథలు, మాటలూ రాసేస్తున్నారు. వాళ్లు రాయకూడదని కాదు గానీ, రచన అనేది ప్రత్యేక విభాగంలా చూడాల్సిన అవసరం ఉంది. దర్శకుడి ఆలోచనని మరో స్థాయికి తీసుకెళ్లేది సంభాషణ రచయితే. దర్శకులకు కూడా తెలియని కోణాల్ని పట్టుకోవాలి రచయిత. అది తన బాధ్యత. ఇంకొంతమంది ‘ఈ సినిమా అంతా నేనే రాసుకొంటా. మధ్యలో ఈ ఎమోషన్‌ సీన్‌ మాత్రం మీరు రాయండి చాలు’ అంటారు. అలాంటి వాళ్లని చూస్తే జాలి, నవ్వు ఒకేసారి కలుగుతాయి. ‘ఇంతా రాసుకొన్న వాడివి.. ఆ ఒక్కటీ నువ్వే ఎందుకు రాసుకోలేవు..’ అని చెప్పి వచ్చేస్తా. 

రచయితలకు ఇప్పుడు స్వర్ణయుగం అంటున్నారు ? 

వేటూరి, ఆత్రేయ... వీళ్లంతా స్వర్ణయుగ రచయితలు. వాళ్ల కోసం ఆఫీసుల ముందు పడిగాపులు కాచేవాళ్లు. వేటూరి నుంచి పాట ఎప్పుడొస్తే.. అప్పుడే షూటింగ్‌. నిర్మాతో, దర్శకుడో ఆఫీసులో అడుగుపెట్టగానే.. ‘రైటర్‌గారొచ్చారా? ఆయన ఏ మూడ్‌లో ఉన్నారు’ అని ఆరా తీసేవారు. అప్పట్లో అంత విలువ ఉండేది. ఇప్పుడు రైటర్‌ ఆఫీసుకొచ్చినా.. ‘రేపు కలుద్దాం’ అని పంపించేస్తున్నారు. రచయితలకు లక్షలూ, కోట్లూ గుమ్మరిస్తున్నారు అనుకొంటారు. ఒకరిద్దరికే అంత పారితోషికం ఉంటుంది. మిగిలినవాళ్లంతా అక్కడక్కడే తచ్చాడుతుంటారు.  

నిర్మాత అవ్వడం కూడా అనుకోకుండానే జరిగిందా?

చిత్రసీమని ఉద్ధరిస్తా, అందరికీ అవకాశాలు కల్పిస్తా అనే పెద్ద మాటలు చెప్పను. మంచి కాన్సెప్టులు, నేను బలంగా నమ్మిన కథలు వచ్చినప్పుడు వాటిని నేనే నిర్మించాలనే ఉద్దేశ్యంతో లక్ష్మీ భూపాల ప్రొడక్షన్స్‌ లో సినిమాల్ని తెరకెక్కిస్తా. 

మరి దర్శకత్వం..?

ఆ ఆలోచన కూడా ఉంది. అయితే అదెప్పుడో చెప్పలేను. రచయితగా మంచి సినిమాలు చేయాలి. ఎప్పుడో నా అభిరుచికి తగిన కథ దొరికినప్పుడు మెగాఫోన్‌ పడతా. నిర్మాత అయినా, దర్శకుడిగా మారినా, నా రచనా వ్యాసాంగం కొనసాగుతూనే ఉంటుంది. ‘ఇక చాల్లే భూపాలా..’ అని నాకే అనిపించినప్పుడు పెన్ను పక్కన పెడతా.


‘‘అదే వీణ.. అదే గిటారు.. కానీ సృశించేవారిని బట్టి ఆ సంగీతం, ఆ స్వరం మారిపోతుంటాయి. సినిమా రచన కూడా అంతే. ఎన్నో సినిమాలు చూసుంటాం. ఎన్నో పుస్తకాల్ని, జీవితాల్ని చదివి ఉంటాం. కానీ.. మన జ్ఞానాన్ని, మన అనుభవాన్ని ఎప్పుడు, ఏ రూపంలో పునఃసృష్టి చేస్తున్నాం అనే దాన్ని బట్టే మనం రాసే మాటకు ఓ విలువ ఏర్పడుతుంది. రచయిత పేపర్‌ పై పెన్ను పెట్టినప్పుడు ‘మాట’ పుడుతుంది. దాన్ని కెమెరా ముందు ప్రతిభావంతమైన నటీనటులు పలికినప్పుడు ప్రాణం వస్తుంది. దాని ప్రతిష్ట పెరుగుతుంది. తెలిసో.. తెలియకో నేనేం రాసినా ప్రేక్షకులు ఆదరించారు. అభిమానిస్తున్నారు. వాళ్లందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా’’


‘‘చందమామ సినిమా కోసం పని చేస్తున్నప్పుడు చాలా ఇన్‌వాల్వ్‌ అయిపోయా. అన్ని విషయాల్నీ దగ్గరుండి చూసుకోవాలన్న ఆత్రుత నాది. షూటింగ్‌ అయిపోయి వస్తున్నా.. ఓ పాట రాలేదు. ‘సార్‌.. ఆ పాట ఇంకా రాలేదేంటి’ అని కృష్ణవంశీగారిని తెగ విసిగించేసేవాడ్ని. ‘రాలేదు.. అయితే ఏంటి? నువ్వు రాస్తావా.. అంత మగాడివా’ అని నన్ను ఉసిగొల్పారు. ఆ పౌరుషంతో ‘చందమామ’లో పాట రాశా. అప్పటి నుంచీ మాటలతో పాటు పాటలూ రాయడం మొదలెట్టా. పాటైనా మాటైనా మనసులో ఏముందో అది పేపర్‌ పై పెట్టడానికే నా ప్రయత్నం’’

Updated Date - 2022-09-25T06:47:08+05:30 IST