మీ ప్రవర్తన బాధించింది : సోనియాకు కెప్టెన్ సింగ్ లేఖ

ABN , First Publish Date - 2021-11-02T23:25:06+05:30 IST

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్

మీ ప్రవర్తన బాధించింది : సోనియాకు కెప్టెన్ సింగ్ లేఖ

చండీగఢ్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏడు పేజీల ఈ లేఖలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ప్రవర్తించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. 


‘‘మీరు, మీ పిల్లలు ప్రవర్తించిన తీరు నిజంగా నన్ను తీవ్రంగా బాధించింది. మీ పిల్లలను నేను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నాను. వారి తండ్రిని నాకు 1954  నుంచి అంటే 67 ఏళ్ళ నుంచి తెలుసు. బడిలో చదువుకున్న రోజుల నుంచి తెలుసు. అందువల్ల నా పిల్లలను ప్రేమించినంతగా వారిని ప్రేమిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 


కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూపై కూడా ఈ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సిద్ధూ పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారని, పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ను, ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను బహిరంగంగానే ఆలింగనం చేసుకున్నారని గుర్తు చేశారు. తాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారని పేర్కొన్నారు. పంజాబ్‌తోపాటు దేశ ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. 


పంజాబ్ కాంగ్రెస్‌ శాఖలో ముఖ్య నేతల మధ్య అంతర్గత కలహాలు చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూను పీసీసీ చీఫ్‌గా ఆ పార్టీ అధిష్ఠానం జూలైలో నియమించింది. అప్పటికీ నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో, కెప్టెన్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సెప్టెంబరులో ఆదేశించింది. ఆయన రాజీనామా అనంతరం ముఖ్యమంత్రి పదవికి చరణ్‌జిత్ సింగ్ చన్నిని ఎంపిక చేశారు. చన్ని, సిద్ధూ మధ్య కూడా విభేదాలు కనిపిస్తున్నాయి. చన్ని ఎన్నికల ముందు ప్రజాకర్షక తాయిలాలు ప్రకటిస్తున్నారని సిద్ధూ తాజాగా ఆరోపించారు. 


Updated Date - 2021-11-02T23:25:06+05:30 IST