యూకేకు షాక్.. తాను కొవిషీల్డ్ టీకాలు వేసుకున్నానన్న అబ్దుల్లా షాహిద్

ABN , First Publish Date - 2021-10-02T21:52:07+05:30 IST

భారత్‌లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాలను తాము గుర్తించబోమన్న నేపథ్యంలో

యూకేకు షాక్.. తాను కొవిషీల్డ్ టీకాలు వేసుకున్నానన్న అబ్దుల్లా షాహిద్

ఐరాస: భారత్‌లోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాలను తాము గుర్తించబోమని యూకే స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ టీకాను బ్రిటిష్-స్వీడిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది.


పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీనిని ఉత్పత్తి చేస్తోంది. శుక్రవారం నిర్వహించిన తొలి విలేకరుల సమావేశంలో అబ్దుల్లా మాట్లాడుతూ.. తాను భారత్‌లో తయారైన కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నానని పేర్కొన్నారు. అయితే, కొవిషీల్ట్‌ ఆమోదయోగ్యమైనదా? కాదా? అనేది ఎన్నిదేశాలు చెబుతాయో తనకు తెలియదని, కానీ చాలా దేశాలు కొవిషీల్డ్‌ను పొందాయని షాహిద్ తెలిపారు.  


ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, మరేదైనా సంస్థ కానీ కొవిడ్ వ్యాక్సిన్‌ను గుర్తించాలా? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. తానైతే కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నానని, తనకేం కాలేదని అన్నారు. అయినా, ఈ ప్రశ్న అడగాల్సింది తనను కాదన్నారు.


భారతదేశం దాదాపు 100 దేశాలకు 66 మిలియన్ వ్యాక్సిన్ డోసులను ఎగమతి చేసింది. ఇందులో వాణిజ్యపరమైన వాటితోపాటు ‘కొవాక్స్’ కార్యక్రమానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అబ్దుల్లా షాహిద్ సొంత దేశమైన మాల్దీవులు భారత్ నుంచి తొలి వ్యాక్సిన్లు అందుకుంది. ఈ ఏడాది జనవరిలో లక్ష డోసులను భారత్ పంపించింది. మొత్తంగా భారత్‌లో తయారైన 3.12 డోసులు మాల్దీవులకు అందాయి.  

Updated Date - 2021-10-02T21:52:07+05:30 IST