ఎందెందు వెదకి చూసిన, అందందే కలదు హిందీ!

ABN , First Publish Date - 2022-09-22T06:52:04+05:30 IST

సెప్టెంబర్ వచ్చిందంటే సీజన్ వచ్చినట్టే, పద్నాలుగున హిందీ దివస్, పదిహేడున హైదరాబాద్ స్వాధీనం, మోదీ పుట్టినరోజు. నెహ్రూ మొదలుపెట్టిన పనులు ఇంకేమన్నా అమిత్ షా చేస్తున్నారో లేదో తెలియదు...

ఎందెందు వెదకి చూసిన, అందందే కలదు హిందీ!

సెప్టెంబర్ వచ్చిందంటే సీజన్ వచ్చినట్టే, పద్నాలుగున హిందీ దివస్, పదిహేడున హైదరాబాద్ స్వాధీనం, మోదీ పుట్టినరోజు. నెహ్రూ మొదలుపెట్టిన పనులు ఇంకేమన్నా అమిత్ షా చేస్తున్నారో లేదో తెలియదు కానీ, హిందీ దివస్ మాత్రం ఢంకా బజాయించి మరీ చేస్తారు. ఈ సారి కూడా పద్నాలుగు నాడు, యథావిధిగా, అమిత్ షా, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అన్నట్టుగా, హిందీతో పాటు అన్ని భాషలనూ సమానంగా అవునో కాదో కానీ, సమాంతరంగా అభివృద్ధి చేస్తానన్నారు. సూదిలో దారం లాగా దేశాన్ని హిందీ కలిపి కుడుతుందని కూడా చెప్పారు. ఈ ‘హేపీ హిందీ దివస్’ విన్నప్పుడు హిందీ రాష్ట్రాల వారికి బాగానే ఉంటుంది కానీ, ఇతరులకు మాత్రం గుండె మండి పోతుంది. తెలుగు భాషా దినోత్సవం నాడు కేంద్రం నుంచి ఇటువంటి శుభాకాంక్షలు ఎప్పుడూ విన్న పాపాన పోము. 


దేవనాగరి లిపితో హిందీ భాషను అధికారభాషగా గుర్తిస్తూ రాజ్యాంగ సభ 1949 సెప్టెంబర్ 14న ప్రకటన చేసింది. రాజ్యాంగంలో 343 ఆర్టికల్‌లో ఈ విషయాన్ని చేర్చారు. అంతే కాదు, మరో పదిహేను సంవత్సరాల దాకా ఇంగ్లీషు కొనసాగుతుందని చెప్పారు. వివిధ భాషావర్గాల ఆందోళనల వల్ల రూపొందిన అధికార భాషల చట్టం, ఆ పదిహేనుసంవత్సరాలు అయ్యాక అమలులోకి వచ్చి, ఇంగ్లీషు వాడకాన్ని కొనసాగించింది. కాబట్టి, ఇప్పుడు హిందీ ఏకైక జాతీయస్థాయి అధికార భాష కాదు, హిందీ కంటె అధికంగాను, విస్తృతంగానూ ఇంగ్లీషే అన్ని అనుసంధాన అవసరాలకు ఉపయుక్తం అవుతున్నది. అమిత్ షా హిందీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా, అదొక్కటే అధికారభాష అన్నట్టుగా ధ్వనిస్తూ ఉంటారు. రాజ్యాంగం ప్రకారం మొత్తం 22 అధికారభాషలున్నాయి, వాటి మధ్య ప్రత్యేకమైన తారతమ్యం లేదు, పార్లమెంటు, కేంద్రప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలను, రాష్ర్టాలతో ఉత్తరప్రత్యుత్తరాలను హిందీ, ఇంగ్లీషులో నిర్వహించవచ్చునని తప్ప.


ప్రజారంగంలోనూ, ప్రజాభిమతంలోనూ హిందీకి జాతీయ అనుసంధాన భాష ప్రతిపత్తి వచ్చి ఉంటే, అమిత్ షా అంతగా అంగలార్చవలసిన అవసరం లేదు. ‘‘నమ్మండి, హిందీ వల్ల మీకు ఇబ్బంది ఏమీ లేదు, స్థానిక భాషలకు హిందీకి మధ్య ఎటువంటి స్పర్థా లేదు, అనుసంధానానికి ఇంగ్లీషును వదిలి, హిందీని తీసుకోండి’’ అని షా, ఆయన ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఊరికే అభ్యర్థనలు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలోను, అధికార స్థాయిలోనూ కూడా తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. భాషా ప్రాంతీయవాదంతో అధికారానికి వచ్చిన పార్టీలు, ఇప్పుడు ఆ నాటి తమ భావోద్వేగాలను మరచిపోయాయి కాబట్టి, ప్రతిస్పందనలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కానీ, స్థానిక భాషలన్నిటి చాప కిందికీ నీరు చేరుతున్నది. కేంద్రమంత్రులు చాలా మంది ఇంగ్లీషు మాట్లాడడం మానేశారు. ప్రధానమంత్రి అరుదుగా తప్ప ఇంగ్లీషు ఉపయోగించరు. జాతీయరహదారులన్నిటి మీదా హిందీలోనే మైలురాళ్లు ఉంటాయి. కేంద్రప్రభుత్వ కార్యాలయాలతో కాల్స్ మాట్లాడవలసి వస్తే, హిందీ వచ్చి తీరాలి. ఎందుకంటే, అవతలవైపు మరో భాష రాదు. మాతృభాషే అధికారభాష అయి, ఉపాధి భాష అయితే, ఆ భాషావ్యవహర్తలకు కలిగే అదనపు అవకాశం ఎవరికైనా కడుపుమండిస్తుంది. వైవిధ్యాన్ని విస్మరించిన ఏ జాతీయవాదంలో అయినా, బాధితులు రకరకాల అల్పసంఖ్యాకవర్గాలే! 


హిందీ తప్ప మరొకటి రానివాళ్లు కూడా గౌరవస్థానాలలో, అధికార పీఠాలలో ఉంటుంటే, తెలుగు తప్ప మరొకటి రాకపోతే, అవమానాలా? తెలుగు తప్ప మరొక భాష రాకపోతే, అత్యవసర ద్వారం వద్ద కూర్చోకూడదా? మరి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే, అత్యవసర ద్వారం వద్ద కూర్చున్నవారికి తెలుగు రాకపోతే? విమానసిబ్బంది స్థానిక ప్రయాణీకులతో సంభాషించలేకపోతే? ప్రత్యక్ష సాక్షి అయిన అహ్మదాబాద్ ఐఐఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత చక్రవర్తి చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ, తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ ప్రశంసనీయమైనది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత, తెలుగు భాష ప్రాతిపదికగా, ప్రభుత్వంలోని ఒక ముఖ్యుడు స్పందించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాష గురించి, తెలుగు వారి అవమానాల గురించి స్పందించేవారే లేరనుకోండి, వారు పేర్లు మార్చుటలో నిమగ్నమై ఉన్నారు. అన్ని విమానకంపెనీల ఫ్లైయిట్ అటెండెంట్‌లు తాము హిందీ ఇంగ్లీషుతో పాటు, పంజాబీయో మరాఠీయో కూడా మాట్లాడగలమని చెబుతారు కానీ, తెలుగు కూడా వచ్చునని చెప్పడం ఒక్కసారి కూడా వినము. రెండు తెలుగు పట్టణాల మధ్య జరిగే విమానప్రయాణంలో కూడా ప్రయాణీకులకు సూచనలు, ప్రకటనలు తెలుగులో వినిపించవు. ఈ జాతీయ ఎయిర్‌లైన్స్ కంటె, ఎమిరేట్స్, ఖతార్ వంటి అంత ర్జాతీయవిమాన కంపెనీలు మేలు. కాలక్షేపం కోసం అందుబాటులో ఉంచే సినిమాలలో, సంగీతంలో తెలుగువి కూడా ఉంటాయి. హిందీని పెంచిపోషించే విధానాల ఫలితమే, ఈ ఇండిగో ఉదంతంలో వ్యక్తమైన దుర్మార్గం. సకల రంగాలలో అనుభవమవుతున్న వివక్షకు ఇదొక నమూనా కూడా.


ఈ భాష సమస్య అన్నది, భాషాసాహిత్యాల సేవకు సంబంధించిన వ్యవహారం కాదు. ప్రజల ప్రతిపత్తికి సంబంధించిన అంశం. హిందీ మన జాతీయ భాష కాదు, అని కన్నడ నటుడు సుదీప్ అనడంలో, ఎందుకు కాదు, అదే తన మాతృభాష, జాతీయ భాష అని అజయ్ దేవగన్ అనడంలో కానీ, రెండు భాషా సినీరంగాల స్పర్థ, ఆత్మగౌరవ ప్రకటనలు ఉన్నాయి. స్థానికభాషల ప్రతినిధుల ప్రకటనలో ఆత్మవిశ్వాసం కనిపిస్తే, జాతీయస్థాయి భాషగా అనుకునేవారి ప్రకటనల్లో అహంకారం ధ్వనిస్తుంది. అందరమూ సమానం అనే ఆహ్వానం ధృతరాష్ట్ర కౌగిలిని స్ఫురింపజేస్తుంది. అమిత్ షా దగ్గర నుంచి, అజయ్ దేవగన్ దాకా తరచు విస్మరిస్తున్నదేమిటంటే, హిందీ మన జాతీయ భాష (నేషనల్ లాంగ్వేజ్) కాదు. కేవలం అధికార భాష మాత్రమే. జాతీయస్థాయిలో వినియోగించగలిగే అధికారభాష. అంతే.


పత్రికలు, టీవీ, సినిమాలు, కేంద్రప్రభుత్వ శాఖలలో ఏర్పరచిన హిందీ విభాగాలు వాటికి కోట్లకు కోట్ల కేటాయింపులు, వీటన్నిటి వల్ల హిందీ విస్తరణ బాగానే జరుగుతున్నది. కానీ, హిందీయేతర రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ విద్య, ఉపాధులను అన్వేషించేవారు అధికంగా ఉండడం, అందుకు అవసరమైన పునాది విద్యావనరులు కూడా ఆయా రాష్ట్రాలలో విస్తృతంగా ఉండడం కారణంగా, ఇంగ్లీషే ప్రధాన ఉపాధి సాధనంగా ఉంటున్నది. గ్లోబలైజేషన్ ప్రభావం కూడా తక్కువగా లేదు. స్వతంత్ర భారతదేశంలో ఇంగ్లీషుకు ఉన్న తటస్థ లక్షణం, దానిని అందరూ ఆమోదించడానికి కారణం. ఉత్తరాది, దక్షిణాదికి నడుమ ఉన్న సాంస్కృతిక, సామాజిక అగాధం, రాజకీయంగా కూడా ఉన్న ప్రత్యేకతలు, హిందీ వ్యాప్తిని నిరోధిస్తున్నాయి. అట్లాగని, మునుపటి కంటె పెరిగిన వ్యాప్తిని కాదనలేము. హిందీ భాషా ఉత్పత్తులకు, హిందీ కార్పొరేట్లకు అనువైన వాతావరణం పెరుగుతూ వస్తోంది. ఎట్లాగైనా, హిందీకి పూర్తిగా ఆమోదం పొందగలిగితే, తమ జాతీయతా ప్రాజెక్టు మరొక మలుపు తిరుగుతుందని అమిత్ షా ఆశిస్తున్నారు.


పోనీ, ఈ హిందీ వాదులకు ప్రజల హిందీ మీద గౌరవమా? లేదు. అనేక స్థానిక ప్రాకృత భాషలను చంపేస్తూ హిందీ విస్తరిస్తూ వస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఉనికిలో ఉన్న మాగధి, అవధి, వ్రజ, బుందేల్ ఖండీ వంటి అనేక స్థానిక భాషలు క్రమంగా హిందీలోకి జీర్ణమయ్యాయి. పోనీ, మాండలికాలను, చరిత్రను తనలో కలుపుకున్న హిందీని ఇష్ట పడతారా? లేదు, స్వచ్ఛ, సంస్కృత భూయిష్ఠ హిందీ కావాలి. గాంధీ కానీ, నెహ్రూ కానీ కోరుకున్న హిందుస్థానీ వద్దు. ఇప్పుడు ఈ శ్రేణులకు బాలీవుడ్ మీద బాగా కోపంగా ఉన్నది ఎందుకో తెలుసునా? అక్కడ భారతీయ కుటుంబ విలువలు, ధార్మిక విలువలు శుష్కించిపోయాయట, పైగా, అది హిందుస్థానీ ఎక్కువ వాడుతుంది కాబట్టి, దాని పేరు ఉర్దూవుడ్ అట. సాంస్కృతికంగా తమ సందేశాన్ని విస్తరింపజేయడానికి, హిందీ సినిమారంగం అడ్డుపడుతున్నదని, దాని నుంచి ఉర్దూను, ఆధునిక విలువలను తొలగించాలని సామాజిక మాధ్యమాలలో ఒక ఉద్యమమే నడుస్తున్నది. దక్షిణాది నుంచి ఇప్పుడు కొత్తగా మతం పుచ్చుకున్న పాన్ఇండియా సినిమాలు, తీవ్రజాతీయవాదులకు బాగా నచ్చుతున్నాయి. అయితే, హిందీ సినిమాలు తెలుగులోకి డబ్ అయినా, తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయినా, రెండు చోట్లా, తెలుగు ప్రత్యేకత మిగులుతూనే ఉన్నది, కొనసాగుతూనే ఉన్నది. ప్రాంతీయ పార్టీలను, సాంస్కృతిక వైవిధ్యాలను, అభిప్రాయ బాహుళ్యాన్ని తుడిచిపెట్టే ప్రాజెక్టులో భాగమే హిందీ విస్తరణ. ఒక భాషగా దాని మీద కోపం ఉండనక్కరలేదు. ఆధిపత్య భాషగా దాన్ని ఝళిపించే ‘షా’ల మీదనే అభ్యంతరం!


కె. శ్రీనివాస్

Updated Date - 2022-09-22T06:52:04+05:30 IST