Shikar Dhavan : నా దృష్టంతా 2023 వన్డే వరల్డ్ కప్‌పైనే : శిఖర్ ధవన్

ABN , First Publish Date - 2022-08-13T00:26:16+05:30 IST

వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌-2023 పైనే తన దృష్టి కేంద్రీకృతమైందని టీమిండియా వన్డే బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవన్ చెప్పాడు.

Shikar Dhavan : నా దృష్టంతా 2023 వన్డే వరల్డ్ కప్‌పైనే : శిఖర్ ధవన్

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌-2023 (World Cup) పైనే తన దృష్టంతా  కేంద్రీకృతమైందని టీమిండియా వన్డే బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవన్ (Shikar Dhavan) చెప్పాడు. ఐసీసీ(ICC) ఈవెంట్స్‌లో ఆడడాన్ని తాను ఇష్టపడతానని చెప్పాడు. అందుకోసం భారత్ తరపున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి రాణించాల్సి ఉందని తెలిపాడు. వరల్డ్ కప్‌లోగా జరిగే ఐపీఎల్, దేశవాళీ వన్డే, టీ20 క్రికెట్ మ్యాచ్‌లు ఆడి ఫిట్‌నెస్‌తో సిద్ధంగా ఉండడమే తన లక్ష్యమన్నాడు. జింబాబ్వే టూర్‌కి జట్టుని ప్రకటించడానికి ముందు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శిఖర్ ధవన్ ఈ విషయాన్ని చెప్పాడు. కాగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకి కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధవన్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అంతకుముందు స్వదేశంలో వెస్టిండీస్‌పై జరిగిన 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌కు శిఖర్ ధవన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక 2023 వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.


ఐసీసీ 50 ఓవర్ల టోర్నమెంట్స్‌లో శిఖర్ ధవన్ వ్యక్తిగత రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. వరల్డ్ కప్స్‌లో ధవన్ మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా (2015, 2019 ఎడిషన్లు) 53.70 సగటుతో 537 పరుగులు చేశాడు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కీలక పాత్ర పోషించాడు.


జింబాబ్వే టూర్‌కు టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌

జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు సీనియర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించనున్నాడు. రాహుల్‌ ఫిట్‌గా ఉన్నట్టు బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ ధ్రువీకరించడంతో ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన సెలెక్టర్లు.. రాహుల్‌కు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో తొలుత సారథిగా ప్రకటించిన శిఖర్‌ ధవన్‌.. వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. శస్త్రచికిత్స తర్వాత కోలుకొన్న రాహుల్‌ను వెస్టిండీస్‌ టూర్‌కు ఎంపిక చేశారు. కానీ, కరోనా సోకడంతో ఆడే అవకాశం దక్కలేదు. అయితే, ఆసియా కప్‌ కోసం రాహుల్‌ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించాలనే ఉద్దేశంతో జింబాబ్వే టూర్‌కు అతడిని పక్కనబెట్టారు. కాగా, రాహుల్‌ టీమ్‌లోకి రావడంతో.. ఓపెనర్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌కు తుది జట్టులో చోటు కష్టమే..! ఈ నెల 18 నుంచి హరారేలో మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. 

Updated Date - 2022-08-13T00:26:16+05:30 IST