నేనూ కొన్ని తప్పులు చేశా!

Nov 30 2021 @ 01:14AM

‘‘నా లక్కీ నెంబర్‌ 5. ఇది 2021వ సంవత్సరం. మొత్తం కూడినా ఐదే. అందుకే ఈ యేడాది నాకు బాగా కలిసొచ్చింద’’న్నారు పూర్ణ. 2021లో పూర్ణ విజృంభిస్తోంది. వరుసగా సినిమాలు చేస్తోంది. ఓటీటీ ఆఫర్లూ ఒప్పుకుంటోంది. ఇటీవల విడుదలైన ‘దృశ్యం 2’లో ఓ కీలకమైన పాత్ర పోషించింది. ‘అఖండ’లోనూ తాను కనిపించనుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. డిసెంబరు 2న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ ‘‘బోయపాటి శ్రీనుగారి సినిమాల్లో స్త్రీ పాత్రలు చాలా శక్తిమంతంగా ఉంటాయి. నాకూ అలాంటి పాత్రే దక్కింది. కానీ బాలా సార్‌ ముందు నిలబడి డైలాగులు చెప్పగలనా? అనిపించింది. కానీ.. బాలా సార్‌ అందించిన ప్రోత్సాహంతో ఆ భయం పోయింది. ఈ సినిమాలో మూడంటే మూడు సన్నివేశాల్లో కనిపిస్తా. కానీ... వాటి గురించి అందరూ మాట్లాడుకుంటారు. అంత గొప్పగా ఆయా సన్నివేశాల్ని తెరకెక్కించారు. అఘోరాగా బాలా సార్‌ని చూసి ఆశ్చర్యపోయా. ఆ గెటప్‌లో ఓ దేవుడ్ని చూసినట్టు అనిపించింది’’ అన్నారు. తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ ‘‘డబ్బులు కావాలంటే వచ్చిన ప్రతీ అవకాశం ఒప్పుకోవచ్చు. కానీ నేను అలా చేయలేదు. కెరీర్‌ సుదీర్ఘంగా సాగాలంటే మంచి పాత్రలు ఎంచుకోవాల్సిందే. ఈ విషయంలో నేను కొన్ని తప్పులు చేశాను. కానీ వాటి నుంచి చాలా నేర్చుకున్నా. ‘అఖండ’తో పాటుగా నేను నటించిన కొన్ని తమిళ, కన్నడ చిత్రాలూ త్వరలోనే విడుదల అవుతున్నాయి’’ అని చెప్పుకొచ్చారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.