కాంగ్రెస్‌లో ఉండను.. బీజేపీలో చేరను: తేల్చేసిన అమరీందర్‌సింగ్

ABN , First Publish Date - 2021-09-30T20:57:20+05:30 IST

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పంజాబ్ కాంగ్రెస్‌లో కల్లోలం రేపిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇక ఎంతమాత్రమూ కాంగ్రెస్‌లో

కాంగ్రెస్‌లో ఉండను.. బీజేపీలో చేరను: తేల్చేసిన అమరీందర్‌సింగ్

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పంజాబ్ కాంగ్రెస్‌లో కల్లోలం రేపిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇక ఎంతమాత్రమూ కాంగ్రెస్‌లో కొనసాగబోనని తేల్చి చెప్పారు. గత కొంతకాలంగా పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలు చాలని, ఇక వాటిని తాను భరించలేనంటూ కుండబద్దలుగొట్టారు. అంతేకాదు, బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపైనా స్పందించారు.


కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నిన్న (బుధవారం) కలిసిన తర్వాత ఈ ఊహాగానాలకు మరింత ఊపు వచ్చింది. తాజాగా, ఈ రోజు ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సమావేశమయ్యారు. బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించిన అమరీందర్.. రైతు సమస్యలపై మాట్లాడేందుకే అమిత్‌షాను కలిసినట్టు స్పష్టం చేశారు. 


నవజోత్ సింగ్ సిద్ధూతో గత కొంతకాలంగా ఉన్న విభేదాలు మరింత ముదరడంతో అమరీందర్ ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే సిద్ధూపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్ధూను ఎట్టిపరిస్థితుల్లోనూ పంజాబ్ ముఖ్యమంత్రిని కానివ్వబోనని తేల్చి చెప్పారు.


పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆ దేశ మిలటరీ చీఫ్‌తో సిద్ధూకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సిద్ధూ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అల్లకల్లోలం ఖాయమని హెచ్చరించారు. కాగా, షాతో సమావేశమైన అమరీందర్ అంతర్గత భద్రతా విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-09-30T20:57:20+05:30 IST