నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు..

Jun 17 2021 @ 02:31AM

  • అవసరమైతే నేనే ఆగుతా..!..
  •  అధికారులకు సీజేఐ రమణ స్పష్టీకరణ..
  • చీఫ్‌ జస్టి్‌సను కలిసిన పలువురు ప్రముఖులు


హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): ‘నా కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు. ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అధికారులకు స్పష్టం చేశారు. అవసరమైతే ట్రాఫిక్‌ సిగ్నళ్ల దగ్గర తన వాహనం ఆగుతుందనీ చెప్పారు. హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న జస్టిస్‌ రమణ.. రాజ్‌భవన్‌లో సందర్శకులను కలుస్తున్నారు. రాత్రికి మాత్రం ఎస్‌ఆర్‌నగర్‌లోని తన నివాసంలోనే ఉంటున్నారు. అక్కడి నుంచి బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వస్తుంటే తన వాహనం వెళ్లడానికి వీలుగా పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేయడం ఆయన గమనించారు. తన కోసం ట్రాఫిక్‌ను నిలిపివేయవద్దని, అవసరం అనుకుంటే ట్రాఫిక్‌ సిగ్నళ్ల దగ్గర ఆగుతానని అధికారులకు స్పష్టం చేశారు.


మీ జిల్లాలో పంటలు ఎలా ఉన్నాయ్‌!

శాసనమండలి తాజా మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో పంటలు ఎలా పండుతున్నాయంటూ సుఖేందర్‌రెడ్డిని జస్టిస్‌ రమణ ఆరా తీశారు. వరి సాగులో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఎలా నిలిచిందని అడిగారు. గుత్తా స్పందిస్తూ.. సాగర్‌, ఏఎంఆర్‌, డిండి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతోందని, ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం నీటినీ పంట పొలాలకు అందిస్తుండడంతో పెద్దఎత్తున వరి సాగవుతోందని చెప్పారు.


‘ఏకీకృత’ కేసును పరిష్కరించండి

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తెలంగాణలో కనీస వేతనాలను అమలు చేయించాలని, ఏకీకృత సర్వీసు నిబంధనల కేసును సత్వరమే పరిష్కరించాలని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణను టీఎస్‌ యూటీఎఫ్‌ కోరింది. సంఘం ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, నేతలు రాజ్‌భవన్‌లో సీజేఐని కలిసి వినతిపత్రం సమర్పించారు. కనీస వేతనాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తానని సీజేఐ చెప్పారని వారు తెలిపారు. ఏకీకృత కేసునూ పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారన్నారు. కాగా, సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనల కేసును సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సీజేఐకి విజ్ఞప్తి చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్‌, కార్యదర్శులు ఈ మేరకు సీజేఐకి వినతిపత్రం అందించారు. 


సుప్రీం బెంచ్‌ను ఏర్పాటుచేయాలి: మల్లు రవి

హైదరాబాద్‌లో సుప్రీం బెంచ్‌ ఏర్పాటు చేయాలని  జస్టిస్‌ రమణకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచన.. తెలుగు నేలపై జస్టిస్‌ రమణకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు.


సీజేఐని కలిసిన ప్రముఖులు..

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణను బుధవారం పలువురు ప్రముఖులు కలిశారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆయన్ను  కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆర్టీఐ ఇన్‌చార్జి చీఫ్‌ కమిషనర్‌ బుద్దా మురళి, కమిషనర్లు కట్టా శేఖర్‌రెడ్డి, గుగులోత్‌ శంకర్‌ నాయక్‌, సయీద్‌ ఖలీలుల్లా, మైదా నారాయణరెడ్డి, డాక్టర్‌ మొహమ్మద్‌ అమీర్‌ కూడా జస్టిస్‌ రమణను కలిసి శుభాకాంక్షలు తెలిపాశారు. ఎమ్మెల్యే గాంధీ, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, తెలుగు రచయితల బృందం ప్రతినిధులు గోపి తదితరులు కలిశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ భాస్కర్‌రావు, జస్టిస్‌ బి.శేషశయనారెడ్డి, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, రిటె ౖర్డ్‌ జ్యుడీషియల్‌ అధికారుల సంఘం ప్రతినిధులు జస్టిస్‌ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా.. పేట శ్రీనివాసరెడ్డి రాసిన తిరుపతి కథలు పుస్తకాన్ని సీజేఐ బుధవారం ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ సీనియర్‌ సిటిజన్‌ ఆర్గనైజేషన్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పొదిల కనకరత్నం, ఉపాధ్యక్షుడు కె.వీరస్వామిలు జస్టిస్‌ రమణను కలిసి సత్కరించారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఎస్‌ఈ సీ పార్థసారథి, ఐఏఎస్‌ అధికారి దానకిషోర్‌, తదితరులు కూడా కలిశారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సీజేఐని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.