రాజీనామా వెనక్కి తీసుకున్నాను కానీ.. : సిద్ధూ

ABN , First Publish Date - 2021-11-05T22:30:57+05:30 IST

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌ పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నట్టు..

రాజీనామా వెనక్కి తీసుకున్నాను కానీ.. : సిద్ధూ

చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌ పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నట్టు కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సారథ్యంలో పంజాబ్ కొత్త క్యాబినెట్ శాఖల కేటాయింపు అనంతరం గత సెప్టెంబర్ 28న పీపీసీసీ పదవికి సిద్ధూ రాజీనామా చేసారు. ఆ రాజీనామాను ఉపసంహరించుకున్నట్టు సిద్ధూ శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలిసారి వెల్లడించారు. అయితే కొత్త అడ్వకేట్ జనరల్ నియామకం తర్వాతే తాను తిరిగి విధుల్లోకి వస్తానని చెప్పారు.


''ఇది వ్యక్తిగత ఇగోలకు సంబంధించిన విషయం కాదు. రాజీనామాను వెనక్కి తీసుకున్నాను. అయితే కొత్త అడ్వకేట్ జనరల్ నియామకం జరిగి, కొత్త ప్యానల్ వచ్చిన తర్వాతే విధుల్లోకి వస్తానని చాలా స్పష్టంగా చెప్పాను''అని సిద్ధూ తెలిపారు.


సిద్ధూ తన రాజీనామాను అప్పట్లో ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖలో ''రాజీపడితే మనిషి వ్యక్తిత్వం కోల్పోతాడు. పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ సంక్షేమ ఎజెండా విషయంలోనూ నేను ఎన్నడూ రాజీపడేది లేదు. ఆ దృష్ట్యా పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సేవలు కొనసాగిస్తాను'' అని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-05T22:30:57+05:30 IST