జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం .. వచ్చే వారం విచారణ నివేదిక

ABN , First Publish Date - 2022-01-02T01:43:09+05:30 IST

త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది మృతికి కారణమైన డిసెంబరు 8 నాటి

జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం .. వచ్చే వారం విచారణ నివేదిక

న్యూఢిల్లీ: త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది మృతికి కారణమైన డిసెంబరు 8 నాటి హెలికాప్టర్ దుర్ఘటనపై ట్రై-సర్వీస్ దర్యాప్తు దాదాపు పూర్తయింది. ఇందుకు సంబంధించిన నివేదికను వచ్చే వారం వాయుసేన హెడ్‌క్వార్టర్స్‌కు సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎయిర్ మార్షల్ మానవేంద్రసింగ్ నేతృత్వంలోని బృందం ఈ ఘటనపై విచారణ చేపట్టింది.


ప్రమాదానికి అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్న అన్ని అంశాలను పరిశీలించింది. అంటే ఈ ఘటనలో మానవ తప్పిదం ఏమైనా ఉందా? లేదంటే వాతావరణం అనుకూలించని కారణంగా హెలికాప్టర్ కూలిందా? ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్నప్పుడు సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? అన్న అంశాలను పరిశీలించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. విచారణలో నిర్దేశించిన నియమాలు, విధానాలను దర్యాప్తు బృందం అనుసరించిందని నిర్ధారించేందుకు చట్టపరమైన పరిశీలన జరుగుతున్నట్టు పేర్కొన్నాయి.


కాగా, పరిస్థితులపై పైలట్లకు అవగాహన లేకపోవడం వల్ల, పరిసరాలు కనిపించకపోవడం వల్ల గణనీయమైన సంఖ్యలో విమాన ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు పరిస్థితులపై అవగాహన కోల్పోవడానికి సహకరించని వాతావరణం కూడా ఒక కారణం అవుతుందని చెబుతున్నారు.


దాదాపు పూర్తయిన ఈ నివేదికను చీఫ్ ఆఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరికి మరో వారం రోజుల్లో సమర్పించే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

Updated Date - 2022-01-02T01:43:09+05:30 IST