ఐఏఎస్‌ల కమిటీ.. తాత్సారానికే

ABN , First Publish Date - 2022-01-19T07:48:07+05:30 IST

రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పట్లో వెలువడే అవకాశం లేదా? ఖాళీ పోస్టులను ఇప్పట్లో భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదా? మరికొంతకాలంపాటు సాగదీయాలని యోచిస్తోందా? అంటే.

ఐఏఎస్‌ల కమిటీ.. తాత్సారానికే

  • ఉద్యోగ ఖాళీల భర్తీని సాగదీసే యోచన!
  • కమిటీ నివేదికకు గడువు విధించని సర్కారు
  • నివేదిక ఇచ్చేదాకా నోటిఫికేషన్లు లేనట్లే
  • ఖాళీలపై సర్కారుకు ఇప్పటికే ప్రాథమిక 
  • అవగాహన ఉన్నా మళ్లీ వివరాలంటూ కమిటీ
  • నిరుద్యోగుల్లో పెరిగిన నిరాశా నిస్పృహలు
  • కమిటీని పాలన సంస్కరణలకు పరిమితం
  • చేస్తే సరిపోయేదన్న అభిప్రాయాలు


హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పట్లో వెలువడే అవకాశం లేదా? ఖాళీ పోస్టులను ఇప్పట్లో భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదా? మరికొంతకాలంపాటు సాగదీయాలని యోచిస్తోందా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే పలుమార్లు పలురకాలుగా కాలయాపన చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. తాజాగా ‘పరిపాలన సంస్కరణల కమిటీ’ పేరుతో మరోసారి జాప్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తే.. ఆర్థిక భారం పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రతిసారీ ఏదో ఒక సాకు చెబుతూ నిరుద్యోగుల జీవితాలతో సర్కారు ఆటలాడుకుంటోందని అంటున్నారు. మొన్న ఉద్యోగ ఖాళీల వివరాలు సమగ్రంగా లేవని, పూర్తి వివరాలు సేకరించాలంటూ అధికారులను ఆదేశించిందని, ఆ తర్వాత ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాగానే భర్తీ చేస్తామని ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు విభజన ప్రక్రియ కొలిక్కి రావడంతో.. కమిటీ పేరిట మరో సాకును ముందుకు తెచ్చిందని విమర్శిస్తున్నారు. కమిటీ నివేదిక సమర్పించేందుకు ఎటువంటి గడువునూ విధించకపోవడం కూడా ఇందులో భాగమేనని పేర్కొంటున్నారు. నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ‘పరిపాలనా సంస్కరణల కమిటీ’ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని స్థాయుల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.శేషాద్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యను సభ్యులుగా చేర్చారు. 


రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, మొత్తం 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేయగా 38,542 మంది ఆయా స్థానాల్లో చేరిపోయారని సర్కారు ప్రకటించింది. సర్దుబాటు నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన చర్యలు తీసుకోవడం, జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ఇంకా మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, నివేదిక అందించాలని ఐఏఎ్‌సల కమిటీని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఆర్డీవోలు, వీఆర్వోలు, వీఆర్‌ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త జిల్లాల్లో, కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఏయే శాఖలకు పని ఒత్తిడి ఎంత ఉందో అంచనా వేసి, దానికి అనుగుణంగా ఇంకా కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించాలని సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్యం, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల ద్వారా ఇంకా మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో తగు సూచనలు చేయాలని సీఎం ఆదేశించారు. కానీ, కమిటీకి ఎలాంటి గడువును నిర్దేశించలేదు. ఎప్పటిలోగా నివేదిక ఇవ్వాలన్న విషయాన్ని పేర్కొనలేదు. దీంతో కమిటీ ఎప్పటివరకు అధ్యయనం చేస్తుందో, ఎప్పుడు సిఫారసులు చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే నోటిఫికేషన్లు వెలువడతాయని తెలుస్తోంది. అంటే.. కమిటీ నివేదిక ఇచ్చేవరకు నోటిఫికేషన్లు రావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


ఖాళీలపై ఇప్పటికే అంచనా ఉన్నా..

వాస్తవానికి ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చింది. సీఎం కేసీఆర్‌ కూడా 70-80 వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ)ల ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు కుస్తీ పట్టి రాష్ట్రంలో 67,128 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. ఈ సంఖ్య అటూ ఇటూగా కాస్త పెరిగే అవకాశాలుంటాయి. కానీ, ఇప్పటివరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మళ్లీ కమిటీని తెరపైకి తేవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు ఉద్యోగాలు, విద్యుత్తు శాఖలో ఆర్టిజన్‌ పోస్టుల వంటివి తప్ప.. ఇతర ఏ శాఖలోనూ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్లు వెలువడలేదు. మరోవైపు రాష్ట్రంలోని 29 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల వేచి చూస్తున్నారు. తాజాగా ఏర్పాటైన కమిటీ ఒకవేళ నివేదికను త్వరగా ఇచ్చినా.. ప్రభుత్వం మళ్లీ ఏదో సాకును ముందుకు తెచ్చినా ఆశ్చర్యపోనక్కర లేదని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వెలువరించి, ఓట్లు దండుకునే ఆలోచన తప్ప.. నిరుద్యోగులకు మేలు చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఓ విద్యార్థి నాయకుడు విమర్శించారు. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వెలువడినా... మళ్లీ కోర్టు చిక్కుల్లో ఇరుక్కునేలా నోటిఫికేషన్లను తయారు చేస్తారని, ఇది ప్రభుత్వానికి షరా మామూలేనని అన్నారు. కమిటీని పరిపాలనా సంస్కరణలకే పరిమితం చేస్తే సరిపోయేదని, ఉద్యోగ ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల సృష్టి వంటి అంశాలను కమిటీ విధివిధానాల్లో భాగం చేయడం నోటిఫికేషన్ల జారీలో తాత్సారం చేయడానికేనన్న ఆరోపిస్తున్నారు. మొదట రెండు మూడు నోటిఫికేషన్లు జారీ చేసి, తర్వాత ఖాళీల వివరాలను తేల్చుకోవచ్చని అంటున్నారు. 

Updated Date - 2022-01-19T07:48:07+05:30 IST