IAS officer Pooja Singhal: ఐఏఎస్ పూజా సింఘాల్ అరెస్ట్.. ఈమెను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే..

ABN , First Publish Date - 2022-05-12T00:44:14+05:30 IST

ఐఏఎస్ ఆఫీసర్ పూజా సింఘాల్‌ను మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అదుపులోకి తీసుకుంది. కొన్ని గంటల సుదీర్ఘ విచారణ తర్వాత..

IAS officer Pooja Singhal: ఐఏఎస్ పూజా సింఘాల్ అరెస్ట్.. ఈమెను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే..

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో మైనింగ్ శాఖ సెక్రటరీగా విధుల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ పూజా సింఘాల్‌ను మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అదుపులోకి తీసుకుంది. కొన్ని గంటల సుదీర్ఘ విచారణ తర్వాత ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. జార్ఖండ్‌లో MGNREGA నిధులను కోట్ల రూపాయల మేర దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. మనీ లాండరింగ్ కేసులో పూజా సింఘాల్‌ను ఈడీ విచారించింది. 


ఈ కేసులో ఇప్పటికే జార్ఖండ్ ప్రభుత్వ శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేసిన రామ్ బినోద్ ప్రసాద్ సిన్హాను 2020, జూన్ 17న ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఆ డబ్బును తన పేరుతో, తన కుటుంబ సభ్యుల పేరుతో పెట్టుబడి పెట్టాడన్నది రామ్ బినోద్ ప్రసాద్‌పై ఈడీ ప్రధాన అభియోగం. ప్రభుత్వ ప్రాజెక్ట్ అయిన MGNREGA నిధుల నిమిత్తం ఖుంటీ జిల్లాకు కేటాయించిన డబ్బును కాజేసి రామ్ బినోద్ ఇలా తన వ్యక్తిగత సంపాదన కోసం పెట్టుబడి పెట్టాడని ఈడీ తేల్చింది.



ఈడీ విచారణలో రామ్ బినోద్ అసలు నిజం కక్కేశాడు. ఈ నిధులు దారి మళ్లి తన దాకా రావడానికి జిల్లా అధికార యంత్రాంగానికి 5 శాతం కమీషన్ చెల్లించాలని ఈడీ ముందు ఒప్పుకున్నాడు. ఈ నిధులు గోల్‌మాల్ జరిగిన సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ పూజా సింఘాల్ ఛత్రా, ఖుంటీ, పాలాము జిల్లాలకు 2007, 2013 మధ్య కాలంలో జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేశారని ఈడీ తెలిపింది. పూజా సింఘాల్ ఆ సమయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. ఇదే కేసులో CA సుమన్ కుమార్‌ నివాసంలో సోదాలు జరపగా ఆయన ఇంటి పరిసరాల్లో రూ.17 కోట్ల డబ్బు లభ్యమైంది. ఈడీ ఆ డబ్బును సీజ్ చేసి అతనిని కస్టడీలోకి తీసుకుంది. పూజా సింఘాల్, ఆమె భర్త కలిసి కోటి 43 లక్షల వరకూ పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేశారని ఈడీ తెలిపింది.

Read more