ఎండల్లో ఐస్‌ అవ్వండిలా..

ABN , First Publish Date - 2021-04-24T06:54:57+05:30 IST

ఎండలు మండిపోతున్న వేళ చల్లని ఐస్‌క్రీమ్‌ల మీదకు మనసు లాగుతూ ఉంటుంది. అయితే ఐస్‌క్రీమ్‌ను బయట కొనే బదులు రకరకాల పండ్లతో ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

ఎండల్లో ఐస్‌ అవ్వండిలా..

ఎండలు మండిపోతున్న వేళ చల్లని ఐస్‌క్రీమ్‌ల మీదకు మనసు లాగుతూ ఉంటుంది. అయితే ఐస్‌క్రీమ్‌ను బయట కొనే బదులు రకరకాల పండ్లతో ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అవకాడో, మామిడి, వాటర్‌మెలన్‌, డ్రాగన్‌ఫ్రూట్‌, అరటిపండ్లు, స్ట్రాబెర్రీ...వంటి పండ్లతో నోరూరించే ఐస్‌క్రీమ్‌లు చేసుకోవచ్చు.  ఈ వారం ఆ చల్లటి రుచులను మీరూ ఆస్వాదించండి. 


వాటర్‌మెలన్‌

కావలసినవి :

వాటర్‌మెలన్‌ జ్యూస్‌ - ఒకటిన్నర కప్పు, ఫ్రెష్‌ క్రీమ్‌ - 400ఎంఎల్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, తియ్యటి కండెన్స్‌డ్‌ మిల్క్‌ - ఒక కప్పు.

తయారీ విధానం:

- వాటర్‌మెలన్‌ను కట్‌ చేసి మిక్సీలో వేసి జ్యూస్‌ చేసుకోవాలి. తరువాత జాలీతో వడగట్టి పక్కన పెట్టుకోవాలి. 

- ఒక బౌల్‌లో క్రీమ్‌ తీసుకుని బీటర్‌తో సాఫ్ట్‌గా అయ్యేలా చేసుకోవాలి. తరువాత  వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ కలపాలి.

- ఇప్పుడు కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి కలియబెట్టాలి.

- తరువాత వాటర్‌మెలన్‌ జ్యూస్‌ను కలపాలి. ఐస్‌క్రీమ్‌ మిక్సర్‌లోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పదిగంటలపాటు పెట్టాలి. అంతే... వాటర్‌మెలన్‌ ఐస్‌క్రీమ్‌ రెడీ.


అప్రికాట్‌

కావలసినవి :

అప్రికాట్‌లు - నాలుగు (ఎండినవి), పెరుగు - ఒక కప్పు, జున్ను - అరకప్పు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - తగినంత.

తయారీ విధానం:

- స్టవ్‌పై ఒక పాన్‌పెట్టి కొన్ని నీళ్లు పోసి అప్రికాట్‌లు వేసి 20 నిమిషాల పాటు చిన్నమంటపై మరిగించాలి. 

- చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి.

- తరువాత అందులో పెరుగు, జున్ను, నిమ్మరసం, తగినంత పంచదార వేసి బాగా కలియబెట్టాలి. 

- మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా సర్వ్‌ చేసుకోవాలి.


మ్యాంగో

కావలసినవి :

పాలు - ఒక కప్పు, క్రీమ్‌ - మూడు కప్పులు, మ్యాంగో ప్యూరీ - ఒక కప్పు, మామిడికాయ ముక్కలు - ఒక కప్పు,  కస్టర్డ్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - తగినంత.

తయారీ విధానం:

- ఒక పాత్రలో పావు కప్పు పాలు తీసుకుని అందులో కస్టర్డ్‌ పౌడర్‌ వేసి కలపాలి. 

- మిగిలిన పాలు పంచదార వేసి వేడి చేయాలి. పాలు మరుగుతున్న సమయంలో కస్టర్డ్‌ పొడి కలిపిన పాలు పోసి చిన్నమంటపై మరికాసేపు మరిగించాలి.

- గది ఉష్ణోగ్రతకు చల్లారిన తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడికాయ ముక్కలు, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపాలి.

- ఈ మిశ్రమాన్ని కంటెయినర్‌లోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. 

- తరువాత హ్యాండ్‌ బీటర్‌తో కలిపి, మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి.

- చల్లని మ్యాంగో ఐస్‌క్రీమ్‌ను పిల్లలతో పాటు పెద్దలు ఇష్టంగా తింటారు.


డ్రాగన్‌ ఫ్రూట్‌

కావలసినవి : డ్రాగన్‌ ఫ్రూట్స్‌ - రెండు, బాదం పాలు - ముప్పావు కప్పు, కొబ్బరిపాలు - ఒక కప్పు, పంచదార - తగినంత, వెనీలా - ఒక టీస్పూన్‌. 

తయారీ విధానం: డ్రాగన్‌ ఫ్రూట్స్‌, బాదంపాలు, కొబ్బరిపాలు, వెనీలా, తగినంత పంచదార వేసి మిక్సీలో బ్లెండ్‌ చేసుకోవాలి. 

- ఈ మిశ్రమాన్ని కంటెయినర్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. 

- చల్లని డ్రాగన్‌ ఫ్రూట్‌ ఐస్‌క్రీమ్‌ రెడీ.




అవకాడో

కావలసినవి : పాలు - అరలీటరు, పంచదార - తగినంత, అవకాడోలు - రెండు, క్రీమ్‌ - 200ఎంఎల్‌, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌.

తయారీ విధానం: ముందుగా పాలు బాగా మరిగించాలి. ఎక్కువ సమయం మరిగిన తరువాత చిక్కబడిన పాలలో పంచదార వేసి కరిగించాలి. 

- ఆ పాత్రను ఒక కవర్‌తో గాలి తగలకుండా మూసేసి గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి.

- అవకాడోల పొట్టు తీయాలి. గింజలు లేకుండా తీసేయాలి. 

- తరువాత ఒక పాత్రలోకి వాటిని తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టిన పాలు, క్రీమ్‌, నిమ్మరసం, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి బ్లెండర్‌ సహాయంతో బాగా కలపాలి.

- ఈ మిశ్రమాన్ని ఐస్‌క్రీమ్‌ మేకర్‌లోకి మార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. సాయంత్రం వేళ చల్ల చల్లగా అవకాడో ఐస్‌క్రీమ్‌ తింటుంటే భలేగా అనిపిస్తుంది. 


బనానా

కావలసినవి :

అరటిపండ్ల గుజ్జు - ఒక కప్పు, క్రీమ్‌ - ఒక కప్పు, పాలు - అరకప్పు, కోడిగుడ్డు - ఒకటి, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, బిస్కెట్లు - కొన్ని.

తయారీ విధానం:

- ఒక బౌల్‌లో అరటిపండ్ల గుజ్జు తీసుకుని అందులో నిమ్మరసం, వెనీలా, పందచార, పాలు, కోడిగుడ్డు వేసి కలపాలి.

- బిస్కెట్లను పొడిపొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి.

- క్రీమ్‌ పలుచగా అయ్యేలా బీటర్‌తో కలపాలి. తరువాత అరటిపండ్ల మిశ్రమం వేయాలి.

- ఒక గ్లాస్‌ బౌల్‌లో క్రీమ్‌ మిక్సర్‌ను ఒక లేయర్‌లా వేసి, పైన కుకీస్‌ వేయాలి. 

- ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా అందించాలి.


స్ట్రాబెర్రీస్‌

కావలసినవి :

స్ట్రాబెర్రీలు - 450గ్రాములు, పంచదార - తగినంత,  బాసిల్‌ - పావు  కప్పు, నిమ్మరసం - ఒక టీస్పూన్‌. 

తయారీ విధానం:

- స్ట్రాబెర్రీలను ముక్కలుగా కట్‌ చేసుకుని పంచదార కలపాలి. ఒక గంట పాటు పక్కన పెట్టాలి.

- తరువాత మిశ్రమాన్ని మిక్సీలో తీసుకుని బాసిల్‌, నిమ్మరసం వేసి బ్లెండ్‌ చేసుకోవాలి.

- దీన్ని ఒక గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టి తరువాత ఐస్‌క్రీమ్‌ మిషన్‌లో పెట్టుకోవాలి. 

- ఐస్‌క్రీమ్‌ మిషన్‌ లేనట్టయితే ఫ్రిజ్‌లో పెట్టుకుని ఐస్‌క్రిస్టల్స్‌ ఏర్పడకుండా ఉండేందుకు ప్రతీ అరగంటకోసారి కలుపుతూ ఉండాలి. చల్లగా సర్వ్‌ చేసుకుంటే స్ట్రాబెర్రీస్‌ ఐస్‌క్రీమ్‌ రుచిగా ఉంటుంది.

Updated Date - 2021-04-24T06:54:57+05:30 IST