కోవాగ్జిన్‌ సమర్థతపై ఐసీఎంఆర్ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2021-04-21T20:28:53+05:30 IST

దేశీయంగా అభివృద్ధిపరిచిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తోందని

కోవాగ్జిన్‌ సమర్థతపై ఐసీఎంఆర్ సంచలన ప్రకటన

న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధిపరిచిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని, సార్స్-కోవ్-2కు చెందిన వేర్వేరు రూపాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపింది. 


కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మన దేశంలో కోవిడ్-19 చికిత్సలో అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరొక 60 దేశాల్లో కోవాగ్జిన్ వినియోగానికి అనుమతుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. 


ఐసీఎంఆర్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 (సార్స్-కోవ్-2)కు చెందిన వివిధ రూపాలను కోవాగ్జిన్ ధ్వంసం చేసినట్లు ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను కూడా సమర్థవంతంగా నాశనం చేసినట్లు వెల్లడైంది. 


యూకే వేరియెంట్, బ్రెజిల్ వేరియెంట్‌లపై కోవాగ్జిన్ సామర్థ్యాన్ని ఐసీఎంఆర్-ఎన్ఐవీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) వివరించాయి. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ బి.1.617 సార్స్-కోవ్-2ను మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపాయి. దీనిని వేరుపరచి, వర్గీకరించడంలో విజయం సాధించినట్లు తెలిపాయి. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను నాశనం చేయడంలో కూడా కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని గుర్తించినట్లు వివరించాయి. 


Updated Date - 2021-04-21T20:28:53+05:30 IST