ఆదర్శ కమ్యూనిస్టు రామకోటయ్య : వీఎస్‌ఆర్‌

ABN , First Publish Date - 2022-01-23T06:18:37+05:30 IST

నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు పోరాడి కందుకూరు ప్రాంతంలో సీపీఎం అభివృద్ధికి కృషిచేసిన ఆదర్శ కమ్యూనిస్టు వల్లూరి రామకోటయ్య అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఆదర్శ కమ్యూనిస్టు రామకోటయ్య : వీఎస్‌ఆర్‌
మాట్లాడుతున్న వీ.శ్రీనివాసరావు

   కందుకూరు, జనవరి 22: నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు పోరాడి కందుకూరు ప్రాంతంలో సీపీఎం అభివృద్ధికి కృషిచేసిన ఆదర్శ కమ్యూనిస్టు వల్లూరి రామకోటయ్య అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇటీవల మృతిచెందిన రామకోటయ్య సంస్మరణ సభ పట్టణంలోని కోటారెడ్డి నగర్‌లో శనివారం ఆపార్టీ జిల్లా నాయకులు ముప్పరాజు కోటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సంస్మరణ సభకు రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావుతో పాటు పలువురు జిల్లా, స్థానిక నాయకులు హాజరై రామకోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీ.శ్రీనివాసరావు మాట్లాడుతూ సోవియట్‌ యూనియన్‌ కూలిపోయి ఇక కమ్యూనిస్టు పార్టీలకు మనుగడ లేదన్న అప నమ్మకం ఏర్పడిన రోజుల్లో కూడా రామకోటయ్య ఆటుపోట్లను తట్టుకుని ఎర్రజెండాను భుజాన మోసి పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేశాడని కొనియాడారు. నేడు ఆ పరిస్థితి లేదని, ప్రపంచమంతా పెట్టుబడిదారీ వ్యవస్థకు తిరుగులేదని భావించే పరిస్థితి తిరగబడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్నాయనేందుకు నిదర్శనంగా చిలీలో పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రజలు ఓడించి కమ్యూనిస్టులను అధికారంలోకి తెచ్చారన్నారు. పెట్టుబడిదారీ విధానాలపై ప్రజలు తిరగబడుతున్నారనేందుకు నిదర్శనమే మనదేశంలో రైతుల ఉద్యమమని, మోదీ మొండివాడు తాను చేసిన చట్టాలను ఉపసంహరించుకోడు అని ఎంతోమంది భావించారన్నారు. కానీ ఆయన చట్టాలను ఉపసంహరించుకోవటమేగాక రైతులకు క్షమాపణలు చెప్పక తప్పలేదని గుర్తుచేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థపై తిరుగుబాటు మొదలైతే వచ్చేది కమ్యూనిస్టులేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మువ్వా కొండయ్య,  అండ్రా మాల్యాద్రి, వై. సిద్ధయ్య, జాలా అంజయ్య, పూనాటి ఆంజనేయులు,  ఎస్‌డీ హనీఫ్‌, జీవీ.కొండారెడ్డి, జి.శ్రీనివాసులు, జివీబీ.కుమార్‌, జి. వెంకటేశ్వర్లు, ఎస్‌.కే.మున్వర్‌ సుల్తానా, గౌస్‌, వివిధ పార్టీల నాయకులు పోకూరి మాలకొండయ్య, గట్టమనేని చెంచురామయ్య,  కె. వీరారెడ్డి, గంగిరెడ్డి, పాలేటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T06:18:37+05:30 IST