మూత దిశగా ‘ఆదర్శ’ హాస్టళ్లు

Dec 7 2021 @ 23:34PM
ఖాజీపేటలో మూతబడిన మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌

ఐదు ఆదర్శపాఠశాలల హాస్టళ్లు మూసివేయడంతో ఇళ్లకు విద్యార్థినులు

ఐదారు నెలలుగా సరుకుల సరఫరా కాంట్రాక్టర్లకు అందని బిల్లులు

అప్పు చేసి సరఫరా చేయలేమని చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

విద్యార్థినులను ఇళ్లకు పంపించిన పాఠశాల సిబ్బంది

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి


(కడప-ఆంధ్రజ్యోతి): ఖాజీపేట ప్రభుత్వ ఆదర్శ పాఠశాల హాస్టల్‌లో 70 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఆగస్టు 16న పాఠశాల, హాస్టల్‌ ప్రారంభించారు. హాస్టళ్లకు నిత్యవసర సరుకుల సరఫరా కాంట్రాక్ట్‌ను కడపకు చెందిన ఓ కాంట్రాక్టరు దక్కించుకున్నారు. పాఠశాలల పునఃప్రారంభం నుంచి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోగా.. ఏప్రిల్‌ బిల్లులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అప్పు చేసి సరుకులు సరఫరా చేయలేం అంటూ కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. ఫలితంగా ఈ నెల ఒకటో తారీఖునే హాస్టల్‌ మూసివేయడంతో విద్యార్థులు ఊళ్లకు వెళ్లిపోయారు. ఖాజీపేట మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ ఒక్కటే కాదు.. జిల్లాలో ఐదు మోడల్‌ స్కూల్‌ హాస్టళ్లు మూతపడ్డాయి. హాస్టళ్లు మూతపడడంతో విద్యార్థినులు ఊళ్ల నుంచి బస్సులు, ఆటోల్లో పాఠశాలలకు రావాల్సి వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలకు ఏప్రిల్‌ నుంచి బిల్లులు మంజూరు కాలేదని అఽధికారులే పేర్కొంటున్నారు. అప్పులు చేసి నాణ్యమైన ఆహారం ఇవ్వలేమని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. 

కడప జిల్లాలో ఆదర్శ పాఠశాలలు 11 ఉన్నాయి. తొమ్మిది పాఠశాలలకు హాస్టళ్లు ఉన్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గిన తరవాత ఆగస్టు 16న పాఠశాలలు, హాస్టళ్లు పునఃప్రారంభించారు. 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్‌ చదివే బాలికలు వంద మంది వరకు హస్టల్‌లో ఉంటూ చదువుకునే అవకాశం కల్పించారు. ఒక్కో విద్యార్థినికి ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి భోజనం సహా రోజూ గుడ్డు, అరటి పండు లేదా ఏదైనా ఒక పండు, ఆదివారం చికెన్‌ ఇవ్వాలి. ఇందుకోసం ఒక్కో విద్యార్థినికి రోజుకు రూ.50 ప్రకారం నెలకు రూ.1,500 ప్రభుత్వం ఇస్తుంది. నిత్యవరస సరుకుల సరఫరా కోసం జాయింట్‌ కలెక్టరు ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించి తక్కువ ధరలకు టెండరు వేసిన వారికే కాంట్రాక్ట్‌ ఇస్తారు. ఆ కాంట్రాక్టరే మెనూ ప్రకారం నిత్యవసర సరుకులు సరఫరా చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఆగస్టు నెల నుంచి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయలేదు. గత విద్యా సంవత్సరంలో ఏప్రిల్‌ నెల బిల్లులు బకాయి ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వం బిల్లులు ఇస్తే తప్ప.. అప్పులు చేసి నిత్యవసర సరుకులు సరఫరా చేయలేమని కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. ఈ వ్యవహారాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఖాజీపేట మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ను మూసివేశారు. ఆ హాస్టలులో ఉంటూ చదువుకుంటున్న 70 మంది విద్యార్థినులను ఇళ్లకు పంపించేశారు. దీంతో బస్సులు, ఆటోలలో గ్రామాల నుంచి పాఠశాలకు హాజరు అవ్వాల్సి రావడంతో విద్యార్థినులు పడుతున్న అవస్థలు ఎన్నో. పుల్లంపేట హాస్టల్‌లో 60 మంది, చిన్నమండెం హాస్టల్‌లో 58 మంది ఉంటున్నారు. అవి కూడా బిల్లులు రాక.. కాంట్రాక్టర్‌ సరుకులు సరఫరా చేయకపోవడంతో తాత్కాలికంగా మూసివేశారు. వల్లూరు మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌లో వంద మంది బాలికలు ఉంటున్నారు. గత విద్యా సంవత్సరం ఏప్రిల్‌ బిల్లులే రాకపోవడంతో ఆగస్టు నుంచే హాస్టల్‌ను తెరవలేదు. దీంతో వివిధ గ్రామాల నుంచి పాఠశాలకు బస్సులు, ఆటోల్లో రావాల్సి ఉంటుంది. సకాలంలో రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లాలో మాత్రమే కాదు.. రాష్ట్రంలో 165 మోడల్స్‌ స్కూల్స్‌ హాస్టళ్లది ఇదే పరిస్థితి అని పాఠశాలల నిర్వాహకులు వాపోతున్నారు.


మీరేం చేస్తారో.. హాస్టళ్లను తెరవాల్సిందే

ఈ వ్యవహారాన్ని డీఈఓ పి.శైలజ, సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ ప్రభాకర్‌రెడ్డిల దృష్టికి మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపళ్లు తీసుకెళ్లారు. బిల్లులు రాలేదని కాంట్రాక్టరు నిత్యవరసర సరుకుల సరఫరా నిలిపివేశారని దీంతో తప్పని పరిస్థితుల్లో హాస్టళ్లు మూసివేశామని వివరించారు. మీరేం చేస్తారో తెలియదు.. కాంట్రాక్టర్‌ను ఒప్పించి సరుకులు తెప్పించుకోండి.. లేదా మరో కాంట్రాక్టరు ద్వారా తెప్పించండి.. అప్పటికీ కుదరకపోతే ప్రిన్సిపళ్లే సరుకులు తెప్పించి హాస్టళ్లు నడపాలంటూ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నారు.. మా డబ్బులు ఎప్పుడిస్తారు..? అంటూ అరువు ఇచ్చిన కిరాణా దుకాణాల యజమానులు ఫోన్లు చేస్తున్నారు. మరో వైపు కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ అప్పులు చేసి హాస్టళ్లు ఎలా నడపగలమని మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సిపళ్లు ఆందోళన చెందుతున్నారు.


కేజీబీవీలకు ఆరు నెలలుగా బకాయి

కడప జిల్లాలో 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు సరాసరి రూ.2.50 లక్షల ప్రకారం నెలకు రూ.72.5 లక్షలు నిత్యవసర సరుకుల సరఫరా కాంట్రాక్టరుకు చెల్లించాలి. ఏప్రిల్‌ నెల నుంచి బిల్లులు మంజూరు కాలేదని సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే బిల్లులు రాక మోడల్‌ స్కూల్స్‌ హాస్టళ్లు మూత పడుతున్నాయి. అదే పరిస్థితి కేజీబీవీలకు వస్తే.. వందల మంది బాలికలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణం బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొటున్నారు. 


బిల్లుల బకాయి వాస్తవమే 

- ప్రభాకర్‌రెడ్డి, పీఓ, సమగ్ర శిక్ష అభియాన్‌, కడప

మోడల్‌ స్కూల్‌ హాస్టళ్లకు నిత్యవసర సరుకుల బిల్లులు కాంట్రాక్టర్లకు బకాయి ఉన్నది వాస్తవమే. ఖాజీపేట మరో నాలుగు హాస్టళ్లు వివిధ కారణాలతో మూసివేశారు. ప్రిన్సిపల్స్‌తో మాట్లాడాం. ఒకటి రెండు రోజుల్లో హాస్టళ్లను ఓపెన్‌ చేసి విద్యార్థినులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. కేజీబీవీ పాఠశాలలకు కూడా ఏప్రిల్‌ నుంచి బిల్లులు బకాయి ఉన్నమాట నిజమే.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.