నాడు ఆదర్శం.. నేడు అధ్వానం

ABN , First Publish Date - 2022-05-24T06:08:06+05:30 IST

ఆలూరు మేజరు పంచాయతీ.. నియోజకవర్గ కేంద్రం.

నాడు ఆదర్శం.. నేడు అధ్వానం
కోసిగిలో బురదమయమైన రహదారి

  1. పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం
  2. పంచాయతీల నిధుల దారి మళ్లింపు
  3. నాటి ఉత్తమ పంచాయతీల్లోనూ దారుణ పరిస్థితులు
  4. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం
  5. తాగునీటికి కటకట
  6. డ్రైనేజీలు లేక రోడ్లపైనే మురుగు నీరు 
  7.   టీడీపీ ప్రభుత్వంలో ఆదర్శ గ్రామాలు.. నేడు అడుగడుగునా కష్టాలు
  8.  ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు



ఆలూరు మేజరు పంచాయతీ.. నియోజకవర్గ కేంద్రం. 20 వేల జనాభా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.20 కోట్లతో సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లు, డ్రైనేజీలు.. వంటి అభివృద్ధి పనులు చేశారు. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో ఒక్క పైసా విడుదల చేయలేదు. పంచాయతీ నిధులతో కాస్తోకూస్తో డ్రైనేజీ, పైపులైన్లు పనులు చేశారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘ నిధులను రూ.20 లక్షలు ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో పారిశుధ్యం, తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. బోర్లు మరమ్మతులు చేయాలంటే అప్పు చేయాల్సి వస్తోందని సర్పంచ ఆవేదన. ఆలూరు ఒక్కటే  కాదు.. ఉమ్మడి జిల్లాల్లో 973 గ్రామ పంచాయతీలదీ ఇదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు దారి మళ్లించడంతో నిధులు లేక పల్లెసీమల్లో ప్రగతి పడేకేసింది. నాటి ఆదర్శ గ్రామాల్లోనూ సమస్యలు తిష్ఠ వేశాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో పారిశుధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సీజనల్‌ వ్యాధులతో జనం విలవిల్లాడాల్సి వస్తుందని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. 


           (కర్నూలు-   ఆంధ్రజ్యోతి) 


జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో ప్రగతి పడకేసింది. పారిశుద్ధ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వర్షాకాలంలోనైతే కాలు బయట పెట్టలేని  దుస్థితి. ఉమ్మడి జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 30 మేజర్‌ పంచాయతీలు. పల్లెసీమల్లో ప్రగతి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి పనులకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘ నిధులు నేరుగా పంచాయతీలకే ఇస్తోంది. 2019-20లో 14వ ఆర్థిక సంఘ నిధులు రూ.99 కోట్లు, 2020-21లో 15వ ఆర్థిక సంఘ నిధులు రెండు విడతలు రూ.152 కోట్లు, 2021-22లో 15వ ఆర్థిక సంఘ తొలి విడుత నిధులు రూ.52 కోట్లు కలిపి రూ.303 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పంచాయతీ ఖాతాల్లో ఆర్థిక సంఘం నిధులు చూసి పారిశుధ్యం, తాగునీటి పైపులైన్లు, డ్రైనేజీలు.. వంటి పనులు చేపట్టాలని సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే ఖాతాలు ఖాళీ అయ్యాయి. సర్పంచులకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం నిధులు దారి మళ్లించడంపై వారు ఆందోళన చెందుతున్నారు.

ఫ వ్యాధులు ప్రబలే ప్రమాదం

గత టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కన్వర్జేషన, ఆర్థిక సంఘం వంటి నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ వంటి పనులు చేశారు. ప్రతి పంచాయతీలో జనాభాను బట్టి కనీసం రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు వివిధ పనులు చేశారు. మేజరు పంచాయతీల్లో రూ.కోట్లలో ప్రగతి పనులు చేపట్టారు. అభివృద్ధి, పారిశుధ్యం నిర్వహణలో అనేక గ్రామాలు ఆదర్శ పంచాయతీలుగా అవార్డులు అందుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిధులు లేక గ్రామ సీమల్లో అభివృద్ధి అటకెక్కింది. పారిశుధ్య పనులకు నిధులు లేకపోవడంతో పల్లెలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. వానాకాలం ప్రారంభమైంది. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లు దుర్గంధభరితంగా మారుతున్నాయి. దోమలకు నిలయంగా మారుతున్నాయి. నిర్లక్ష్యం చేస్తే డెంగీ, మలేరియా, గున్యా, విష జ్వారాలు, డయేరియా, అతిసారం ప్రబలే ప్రమాదం ఉంది.

 ప్రభుత్వం మేల్కొనాలి: 

 ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను తక్షణమే పంచాయతీలకు విడుదల చేయాలి. వర్షాకాలం ప్రారంభం కావడంతో వీధుల్లో ముగురు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలి. ప్రత్యేక డ్రైవ్‌ పెట్టి మురుగు కాల్వలు శుభ్రం చేయాలి. తాగునీటి పైపులు మరమ్మతులు చేయాలి. మురుగు గుంటల్లో దోమలు వృద్ధి చెందకుండా కిరోసిన, వేపనూనె పిచికారి చేయాలి. వారం వారం క్రమం తప్పక డ్రైనేజీలు శుభ్రం చేసేలా పారిశుధ్య ప్రణాళిక రూపొందించాలి. 

 డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం 

  పంచాయతీ : ఆలూరు       (మేజరు పంచాయతీ)

ఫ జనాభా : 19,650

ఫ నివాసాలు : 4,264

  నాడు (టీడీపీ ప్రభుత్వం): రూరల్‌ అర్బన కింద రూ.12 కోట్లతో సీసీ రోడ్ల పనులు చేపట్టారు. పంచాయతీ నిధులు రూ.31 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు చేశారు. ఇలా సుమారుగా రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి రూ.11 కోట్లు మంజూరు చేస్తే ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు మొదలు కాలేదు. 

  నేడు : వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు మొదలు కాలేదు. వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎన్జీవోస్‌, ఉపాధ్యాయ కాలనీలు, సిద్ధేశ్వర కాలనీ, ఆరికెర రోడ్డు, రైతు భరోసా కేంద్రం దగ్గర్లోని కాలనీల్లో రోడ్లు అధ ్వానంగా ఉన్నాయి. వర్షపు నీరు నిలిచి దుర్గంధభరితంగా మారుతున్నాయి. 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు దారి మళ్లించడంతో పంచాయతీ నిర్వహణకు రూ.3 లక్షలు అప్పు చేశామని సర్పంచ అరుణాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. 


 కోసిగిలో దుర్గంధం 

ఫ పంచాయతీ : కోసిగి      (మేజరు పంచాయతీ)

ఫ జానాభా : 24,636

 ఫ నివాసాలు           : 4,200

ఫ నాడు : పులికనుమ జలాశయం దగ్గర బోర్లు, పైపులైన నిర్మించి తాగునీరు సరఫరా చేశారు. బస్టాండ్‌ నుంచి రంగప్ప గట్టు వరకు సీసీ రోడ్డు, 1.20 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓహెచఆర్‌ ట్యాంకు, ముప్పాతిక శాతం వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఉత్తమ పంచాయతీ అవార్డును నాటి సర్పంచ ముత్తురెడ్డి అందుకున్నారు.

  నేడు: ఈ మూడేళ్లలో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. బీసీ కాలనీ, వాల్మీకి నగర్‌లో సీసీ డ్రైనేజీ, రోడ్లు లేక వర్షం వస్తే మురుగునీరు రోడ్లపై చేరుతోంది. దుర్గం ధం వెదజల్లుతోంది. రోగాల బారిన పడతామని జనం భయ పడుతున్నారు. పందుల బెడదతో అవస్థలు తప్పడం లేదు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.26 కోట్లు ప్రభుత్వం దారి మళ్లించడంతో అభివృద్ధి అటకెక్కింది. ఈ ప్రభుత్వంలో ఒక్క పైసా నిధులు రాలేదని అధికారులే అంటున్నారు. 



లోపించిన పారిశుధ్యం 

ఫ పంచాయతీ : కోతిరాళ్ల, పత్తికొండ మండలం (నిర్మల పురష్కార్‌

  పంచాయతీ -2018-19)

ఫ జానాభా : 2,050

ఫ నివాసాలు : 450

  నాడు : రూ.కోటి నిధులతో సీసీ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన పనులు చేశారు. పారిశుధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. మజరా గ్రామం కనకదిన్నెలో మొత్తం సీసీ రోడ్లు, 

డ్రైనేజీ వేశారు. తాగునీటి సమస్యలు లేకుండా చేశారు. కేంద్ర పభుత్వం 2018-19లో నిర్మల్‌ పురస్కారానికి ఎంపిక చేసింది.  

ఫ నేడు : మూడేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో నిధులు లేక.. అప్పులు చేసే అవకాశం లేకపోవడంతో పారిశుధ్యం పడకేసింది. అనేక కాలనీల్లో దాహంతో జనం అల్లాడుతున్నారు.


కుంట నీరే గతి

ఫ పంచాయతీ : ఆర్‌.ఖానాపురం, గూడూరు మండలం (ఆదర్శ పంచాయతీ)

ఫ జనాభా : 977

ఫ నివాసాలు : 255

 నాడు (టీడీపీ ప్రభుత్వం): రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి పనులు చేశారు. ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. పారిశుధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఆదర్శ పంచాయతీగా ఎంపికైంది.

  నేడు : అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాలేదు. శాశ్వత రక్షిత మంచినీటి పథకం లేకపోవడం వల్ల కుంట నీరే శరణ్యం. సుంకేసుల నుంచి పైపులైన ద్వారా వచ్చే నీటిని కుంటలో వదిలి.. ఓహెచఆర్‌ ట్యాంకుకు ఎక్కించి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అతిసారం, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని గ్రామస్థుల ఆందోళన. గూడూరు నుంచి క్యాన రూ.15 వంతున కొనుగోలు చేస్తున్నారు. 

 రక్షిత మంఫ అన్యాయంగా పంచాయతీ నిధులు మళ్లించారు చినీరు అందించాలి 

మా గ్రామానికి కుంట నీరే ఆధారం. సుంకేసుల నుంచి పైపులైన ద్వారా తుంగభద్ర నీటిని ఆ కుంటలోకి వదులుతున్నారు. ఆ నీటినే ట్యాంకుకు ఎక్కించి సరఫరా చేస్తున్నారు. దీన్ని తాగలేక గూడూరు నుంచి క్యాన రూ.15 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. శాశ్వత తాగునీటి పథకం ఏర్పాటు చేసి సురక్షిత నీరు అందించాలి. 

- బి.సుమనబాబు,  ఆర్‌.ఖానాపురం, గూడూరు మండలం


  దుర్గంధాన్ని భరించలేకున్నాం 

మా కాలనీలో మురుగు కాల్వలు అధ్వానంగా ఉన్నాయి. మరుగునీరంతా రోడ్లుపైకి చేరుతోంది. వర్షం వస్తే మరీ అధ్వానంగా ఉంటుంది. కాలువలు శుభ్రం చేయకపోవడం వల దుర్గంధం వస్తోంది. భరించలేక మేమే కాలువలు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం డ్రైనేజీలు నిర్మించాలి. 

- సిద్దమ్మ, కోటవీధి, ఆలూరు 

  అన్యాయంగా పంచాయతీ నిధులు మళ్లించారు 

పంచాయతీలకు కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఉమ్మడి జిల్లాలో రూ.303 కోట్లు ఖాతాల్లో ఖాళీ చేశారు. సర్పంచులకు కనీస సమాచారం ఇవ్వకుండా... తీర్మానం లేకుండా నిధులు మళ్లిండం అన్యాయం. రాష్ట్రంలో రూ.7,660 కోట్లు దారి మళ్లాయి. పారిశుద్ధ్య పనులకు నిధులు లేవు, తాగునీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. చిన్న చిన్న పంచాయతీల్లో ప్రజలకు సమాధానం చెప్పలేక సర్పంచులు కొందరు ఊళ్లకు వెళ్లడం లేదు. వర్షాకాలం రావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కనీసం బ్లీచింగ్‌ పౌడర్‌ కొనేందుకు కూడా ఖాతాల్లో డబ్బు లేదు. ఇదే విషయంపై రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందనకు ఫిర్యాదు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి నిధులు విడుదల చేయాలి. 

 - బిర్రు ప్రతాప్‌రెడ్డి, ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్స్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు



Updated Date - 2022-05-24T06:08:06+05:30 IST