ప్రమాద ప్రదేశాలను గుర్తించండి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-21T05:19:53+05:30 IST

జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు హాట్‌ స్పాట్‌లను గుర్తించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రమాద ప్రదేశాలను గుర్తించండి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌

నంద్యాల టౌన్‌, మే 20: జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు హాట్‌ స్పాట్‌లను గుర్తించి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ సెంటినరీ భవనంలో రహదారి భద్రత - ప్రమాదాల నివారణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణంలోని వై జంక్షన్‌, బొమ్మలసత్రం, నూనెపల్లె తదితర ముఖ్య కూడలి ప్రదేశాల్లో ప్రమాదాలను నియంత్రించేందుకు కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ ఇచ్చే నివేదిక మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌, ట్రాఫిక్‌, పోలీసు అధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు గురైన రహదారులను గుర్తించి కౌన్సిల్‌ తీర్మానం చేసి సంబంధికులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ రోడ్లపై గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫీల్డ్‌ మెకానిజం ఏర్పాటు చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు జరుగకుండా అవసరమైన చోట స్పీడ్‌ బ్రేకర్లు, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జాతీయ రహదారికి గ్రామాల నుంచి కలిసే అనుసంధాన రోడ్లకు ఇరువైపులా అవసరం ఉన్న చోట స్పీడ్‌ బ్రేకర్లు వేయడంతో పాటు భద్రత చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రమాదకర స్థలాల్లో 108 వాహనాలు, వాటి పరిసర పీహెచ్‌సీలలో వైద్య సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు. జాతీయ రహదారులపై అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకు పోలీసు, రవాణా, జాతీయ రహదారుల శాఖల అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీ రామాంజి నాయక్‌, జిల్లా రవాణాధికారి కృష్ణారావు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటకృష్ణ, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, పీఆర్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్టీవో కార్యాలయ అధికారులు, అన్ని డివిజన్ల డీఎస్పీలు, ట్రాఫిక్‌ పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T05:19:53+05:30 IST