ఈ లక్షణాలు గమనించారా?

ABN , First Publish Date - 2021-05-12T17:45:51+05:30 IST

ఇంటి పనుల్లో తలమునకలై ఉండే మహిళలు కాస్త నలతగా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. ఉద్యోగినులైతే ఇంటి పనీ, ఆఫీసు పనీ చక్కబెట్టుకోవడంలో తీరికలేకుండా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా.

ఈ లక్షణాలు గమనించారా?

ఇంటి పనుల్లో తలమునకలై ఉండే మహిళలు కాస్త నలతగా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. ఉద్యోగినులైతే ఇంటి పనీ, ఆఫీసు పనీ చక్కబెట్టుకోవడంలో తీరికలేకుండా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా... అదే తగ్గిపోతుందనో, ఏమీ కాదనో నిర్లక్ష్యం చేస్తారు. ఈ ధోరణే చివరకు తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది. నిజానికి, భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉన్న సమస్యలకు హెచ్చరికల్లా... శరీరంలో ముందు నుంచే కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే ముప్పును నివారించుకోవచ్చు. 


బరువులో మార్పు వస్తోందా?: హఠాత్తుగా బరువు తగ్గిపోతుంటే దాని వెనుక ఆందోళన చెందాల్సిన కారణం ఏదో ఉంటుంది. అలాగే, బరువు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటే... అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో అసాధారణమైన మార్పులు కారణం కావచ్చు. బరువులో ఇలాంటి మార్పులు హైపర్‌ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, హార్మోన్లలో సమతుల్యత దెబ్బతినడం లాంటివాటికి దారి తీయవచ్చు.


జుట్టు విపరీతంగా రాలుతోందా?: రోజుకు యాభై నుంచి వంద కేశాలు రాలిపోవడం సాధారణం. కానీ చాలా ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటే అశ్రద్ధ చెయ్యకండి. ఆటోఇమ్యూన్‌ డిజార్డర్లు, థైరాయిడ్‌ సమస్యలు, కీలకమైన విటమిన్‌ లోపాలకు ఇది సంకేతం కావచ్చు.


అలసటగా, నీరసంగా అనిపిస్తోందా?: రోజంతా తీరికలేకుండా పని చేసినప్పుడు అలసటగా, నీరసంగా అనిపించడం సహజం. ప్రధానంగా మహిళలు ఎక్కువగా నిర్లక్ష్యం చేసే విషయం కూడా ఇదే. కాస్త విశ్రాంతి తీసుకుంటే సర్దుకుంటుందని అనుకుంటారు. కానీ, తగినంత సేపు నిద్రపోయినా... అలసటగా అనిపిస్తే సందేహించాల్సిందే. రక్తహీనత, గుండె, కాలేయం, మూత్రపిండాల సమస్యలు... ఇలా ఎన్నో అనారోగ్యాలకు ఇది సూచన కావచ్చు. వెంటనే వైద్యుల్ని సంప్రతించండి.


పాలిండ్లలో మార్పులు: పాలిండ్ల వాపు, గడ్డలు, దురద, ఎర్రబారడం లాంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. ఇవి బ్రెస్ట్‌ కేన్సర్‌ లక్షణాలు కావచ్చు. వెంటనే స్ర్కీనింగ్‌ చేయించుకొని, అనుమానాన్ని నివృత్తి చేసుకోండి. మొదట్లోనే గుర్తించడం వల్ల బ్రెస్ట్‌ కేన్సర్‌ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ అది కేన్సర్‌ కాకపోయినా, సమస్యేమిటనేది వైద్యులు గుర్తించి, చికిత్స చెయ్యడానికి వీలుంటుంది.


ఋతుక్రమం సక్రమంగా లేదా?: మహిళలు ఎక్కువగా నిర్లక్ష్యం చేసే విషయాల్లో ఇదొకటి. థైరాయిడ్‌ డిజార్డర్స్‌, గర్భకోశ సమస్యలకు ఇది సంకేతం కావచ్చు. కాబట్టి ఋతుక్రమంలో తేడాలు చోటు చేసుకుంటే వెంటనే వైద్యుల్ని కలవండి.


ఇవి కూడా గమనించండి: మూత్రం రంగు మారడం, దుర్వాసన, పొట్ట నొప్పి, పీకుతున్నట్టు ఉండడం, ఊపిరి సరిగ్గా అందకపోవడం, మగత, తరచూ తలనొప్పి... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సలహా తీసుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకండి. 


Updated Date - 2021-05-12T17:45:51+05:30 IST