మాస్టారి రుణం తీర్చుకున్న బ్యాంకు అధిపతి

ABN , First Publish Date - 2020-10-25T21:37:00+05:30 IST

ఉద్యోగంలో పీకల్లోతు మునిగిపోతే కన్న తల్లిదండ్రుల్ని పలకరించేందుకు టైమ్‌ లేదంటారు. ఇక, రాత్రింబవళ్లు ఒత్తిళ్ల మధ్య పరిగెత్తాల్సిన వ్యాపారం చేస్తే..? తమను తామే మరిచిపోతారు....

మాస్టారి రుణం తీర్చుకున్న బ్యాంకు అధిపతి

ఉద్యోగంలో పీకల్లోతు మునిగిపోతే కన్న తల్లిదండ్రుల్ని పలకరించేందుకు టైమ్‌ లేదంటారు. ఇక, రాత్రింబవళ్లు ఒత్తిళ్ల మధ్య పరిగెత్తాల్సిన వ్యాపారం చేస్తే..? తమను తామే మరిచిపోతారు. వందల కోట్లకు పడగలెత్తిన ఈ బ్యాంకు అధిపతి.. ఎప్పుడో చిన్నప్పుడు రైలు ఛార్జీల కోసం ఐదొందలు ఇచ్చిన అయ్యవారి కోసం జీవితమంతా తపించాడు. ఊరూరా వెదికాడు.. ఆఖరికి ఆయన ఆచూకీ కనుక్కున్నాడు. ఒక బ్యాంకును స్థాపించిన దానికంటే.. మాస్టారి రుణం తీర్చుకున్నానన్న సంతోషంతో ఆయన కడుపు నిండిపోయింది. ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడైన వి.వైద్యనాథన్‌ వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఇదొక్క సంఘటన చాటు..  


నవంబర్‌ 1999, ముంబై ఐసిఐసిఐ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం...

కేవీ కామత్‌ (ఐసిఐసిఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌) : ‘ఏమ్మా శిఖా, మన బ్యాంక్‌ లోన్‌ విభాగానికి హెడ్‌గా ఇంకా ఎవరూ దొరకలేదా? ఎంత త్వరగా ఆ పోస్టు భర్తీ అయితే అంత వేగంగా మనం బీమా వ్యాపారం ప్రారంభించవచ్చు..’

శిఖా శర్మ (లోన్‌ విభాగాధిపతి) : ‘సిటీ బ్యాంక్‌లో వైద్యనాథన్‌ అని ఆ బ్యాంక్‌ వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాడు సార్‌. ఎన్నిసార్లు నచ్చజెప్పినా వచ్చేందుకు ఒప్పుకోవడం లేదు.. నాకు ఒక వారం గడువు ఇవ్వండి.. మళ్లీ ప్రయత్నిస్తా...’


బిట్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు వైద్యనాథన్‌ (వైదీ). క్యాంపస్‌ ఇంటర్వ్యూలో సిటీబ్యాంక్‌ ఉద్యోగం దొరికింది. క్రెడిట్‌కార్డులను అమ్మడం, కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసే వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం వైద్యనాథన్‌ విధులు. కొన్నాళ్లకు రిటైల్‌ బ్యాంకింగ్‌లో మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించింది సిటీబ్యాంక్‌. ఎనిమిదేళ్లలో వాహన రుణ విభాగాన్ని అగ్రస్థానంలో నిలిపాడు. మరోవైపు ఐసిఐసిఐ బ్యాంకు దేశంలోనే తొలిసారి (1996) ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టి.. ఆ విజయపరంపరతో తమ రిటైల్‌, లోన్‌ విభాగాలను పటిష్టం చేయాలనుకుంది. అప్పటి వరకు ఆ బ్యాంకు పర్సనల్‌ లోన్‌ విభాగానికి అధిపతిగా ఉన్న శిఖాశర్మను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ ఇన్స్యూరెన్సుకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించి, బీమాలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోందా బ్యాంకు. సిటీ బ్యాంకు ధాటికి అడ్డుకట్ట వేయాలంటే.. వైద్యనాథన్‌ను తమ బ్యాంకు లోన్‌ విభాగాధిపతిగా నియమించి.. తన స్థానం భర్తీ చేయాలన్నది శిఖా ఆలోచన. అందుకే ఆరు నెలలుగా వైద్యనాథన్‌ను బతిమాలుతోంది.


రాజీనామా చేసినప్పుడల్లా జీతాన్ని పెంచి వైద్యనాథన్‌ను నిలువరిస్తోంది సిటీబ్యాంకు. చివరికి ఉద్యోగి స్టాక్‌ ఆప్షన్స్‌ కింద షేర్లు ఇస్తామని ఊరించి, ఒప్పించింది ఐసిఐసిఐ. దాంతో ఆయన వెళ్లక తప్పలేదు. వైదీ కొత్త బాధ్యతలు స్వీకరిస్తూనే.. 400 నుంచీ 800 పట్టణాలకు.. 1600 ఐసిఐసిఐ బ్యాంకు శాఖలను విస్తరించాడు. రిటైల్‌ బ్యాంకింగ్‌కు అధిపతి అయ్యాడు. ఆయన సంస్కరణలతో కస్టమర్ల సంఖ్య రెండున్నర కోట్లకు చేరుకుంది. అక్కడితో ఆగలేదు. చిన్న, మధ్య తరహా సంస్థల కోసం ప్రత్యేక బ్యాంకింగ్‌, గ్రామీణ బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని ప్రారంభించాడు. 38 ఏళ్లకే ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. ఈలోపు శిఖాశర్మ యాక్సిస్‌ బ్యాంక్‌కు ఎం.డి.గా వెళ్లిపోవడంతో.. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ ఇన్స్యూరెన్సుకు ఎండిగా సారథ్యం వహించాడు వైద్యనాథన్‌.





సొంతగా బ్యాంకు..

ఉద్యోగంలో ఎన్ని సాధించినా.. ఏదో కొరత. తను చేయాల్సిన ఒక ముఖ్యమైన పనొకటి మిగిలిపోయింది. ఒక రోజు ‘‘మీకు ‘గుర్దాయల్‌ సైనీ’ అనే వ్యక్తి ఆచూకీ లభిస్తే వెంటనే నాకు తెలియజేయండి. సైనీ ఇంటిపేరున్న ప్రతీ వ్యక్తినీ ఆరాతీయండి...’’ అంటూ దేశ వ్యాప్తంగా ఉన్న ఐసిఐసిఐ బ్యాంకులోని నలభైవేల మంది ఉద్యోగులకు ఓ సందేశాన్ని పంపించాడు. ఏళ్లపాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వ్యక్తి మాత్రం తారసపడలేదు. ఇదిలా ఉంటే - విజయానికి అలవాటు పడ్డ వ్యాపారవేత్త కుదురుగా, శాంతంగా నిద్రపోడు. నిరంతరం ప్రణాళికలు రచిస్తూ.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. లక్ష్యాన్ని పెద్దది చేసుకుంటూ వెళతాడు. ఆవిధంగా ఆలోచిస్తున్నప్పుడు.. సొంతంగా బ్యాంకు పెట్టాలన్న బలమైన కోరిక పుట్టింది.


ఒక రోజు (2010) హైదరాబాద్‌కు పని మీద విమానంలో వెళుతుంటే.. పక్క సీట్లో కూర్చున్న బిగ్‌బజార్‌ యజమాని కిషోర్‌ బియాని పలకరించాడు. అప్పటికే ‘ఫ్యూచర్‌ కాపిటల్‌’ పేరు మీద ఆయన ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుతుండగా ‘ఐసిఐసిఐని పదేళ్లలో ఎక్కడికో తీసుకెళ్లావు. నీలాంటి రథసారథిని మా ఫ్యూచర్‌ కాపిటల్‌ కోసం వెదుకుతున్నా..’ అన్నాడు బియాని. అలా వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పటికే సొంత బ్యాంకు పెట్టాలనుకున్న వైద్యనాథన్‌ తమ సంస్థలో ఉద్యోగిగా చేరడని బియానికి అర్థమైంది. ‘‘ఆర్బీఐ లైసెన్సు పొంది కొత్త బ్యాంకు ఏర్పాటు చేసే లోపల ఓ జీవిత కాలం దాటిపోతుంది. ఉద్యోగిగా కాదు. భాగస్వామిగా తీసుకుంటాను. సంస్థ నిర్వహణలో జోక్యం చేసుకోను. ఫ్యూచర్‌ కాపిటల్‌ నీదే అనుకో’’ అంటూ మొత్తానికి వైద్యనాథన్‌ను ఒప్పించాడు బియాని. 2000 లో ఐసిఐసిఐ బ్యాంక్‌లో అడుగుపెట్టినప్పుడు రూ.300 కోట్ల రుణ విభాగ సామర్థ్యాన్ని 2010లో లక్ష కోట్లకు తీసుకెళ్లాడు. 




మళ్లీ పట్టాలెక్కించాడు..

లోన్లు, షేర్‌ బ్రోకింగ్‌, ఫోరెక్స్‌ వంటి సేవలతో కిషోర్‌ బియానీ కొత్తగా ‘ఫ్యూచర్‌ క్యాపిటల్‌’ సంస్థ పెట్టినప్పుడు ఒక వెలుగు వెలిగిన సంస్థే!. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు టోకు రుణాలు ఇవ్వడం వల్ల ... 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత... బ్యాంకు నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్లు పెరిగిపోయాయి. రూ.1100 ఉన్న ఫ్యూచర్‌ క్యాపిటల్‌ షేరు.. 2010 నాటికి రూ.90 కి పడిపోయింది. అభద్రతాభావంతో సగం మంది ఉద్యోగులు సంస్థను వదిలేశారు. అలాంటి సంక్షోభపరిస్థితుల్లో.. అత్యున్నత పదవిని వదిలేసి.. మునిగిపోయే నావలాంటి సంస్థకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు వైద్యనాథన్‌. బార్ల్కేస్‌, స్టాండర్డ్‌ చార్టర్డ్‌, సిటీ, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి వంటి సంస్థలలో పనిచేసే ఉద్యోగులను ఊరించి.. అగ్రశ్రేణి రిటైల్‌ బృందాన్ని తయారుచేశాడు. ఈ సంస్థకు ఫ్యూచరూ లేదు, కాపిటలూ లేదు అంటూ అన్ని సంస్థలు ముఖం చాటేశాయి. పట్టువీడని వైదీ చిన్నాచితక నిధులు సేకరించాడు. ఎస్‌ఎంఈ సంస్థలకు చేయూతనిచ్చేందుకు విభిన్న తరహా రుణాలను రూపొందించాడు. గాడి తప్పిన సంస్థను మళ్లీ పట్టాలెక్కించాడు.




ఆఖరికి ఆయన దొరికాడు..

ఓ శుభ ముహూర్తాన ‘వార్బర్గ్‌ పిన్కస్‌’ అనే సంస్థ ఫ్యూచర్‌ క్యాపిటల్‌లో కిషోర్‌ బియానీ వాటాను కొనుగోలు చేసింది. కొత్త భాగస్వామి చేరడంతో ‘క్యాపిటల్‌ ఫస్ట్‌’గా పేరు మారింది. మరిక వెనక్కి చూసుకోలేదు. జీవితం వరుస గెలుపులతో సాగిపోతోంది కానీ.. గుర్దాయల్‌ సైనీ ఆచూకీ మాత్రం దొరకలేదన్న అసంతృప్తి అలాగే ఉండిపోయింది. 2018లో ఐడిఎఫ్‌సి బ్యాంకు.. క్యాపిటల్‌ ఫస్ట్‌లో విలీనమై.. ‘ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌’గా మారింది. ఒక రోజు కొడుకు ఉపనయనం జరుగుతోంది. భార్య కొడుకుతో పీటల మీద కూర్చున్న వైద్యనాథన్‌ దగ్గరికి పరుగున వచ్చిన లేడీ సెక్రటరీ చెవిలో ఏదో చెప్పి.. ఆయన చేతికి ఫోన్‌ ఇచ్చింది. ‘వైదీ సార్‌.. నేను ఆగ్రా ఐసిఐసిఐ బ్యాంకు మేనేజర్‌ను. మీరు వెదుకుతున్న గుర్దాయల్‌ సైనీ అనే ఆయన ఆచూకీ దొరికింది. ఆయన ఫోటో, వివరాలు వాట్సప్‌ చేస్తాను’ అని చెప్పాడు.


ఎవరీ గుర్దాయల్‌ సైనీ?

వైద్యనాథన్‌ తండ్రి వైమానిక ఉద్యోగి కావడం వల్ల.. దేశవ్యాప్తంగా తిరగాల్సి వచ్చింది. ఒకసారి పంజాబ్‌, పఠాన్‌కోట్‌ లోని కేంద్రీయ విద్యాలయంలో పన్నెండో తరగతి చదువుతున్నప్పుడు.. జరిగిందీ సంఘటన. బిట్స్‌ ప్రవేశ పరీక్ష రాశాడు. ఈలోపు తండ్రికి లఢక్‌ బదిలీ అయ్యింది. రాంచీ నగరానికి సమీపంలోని బిట్స్‌లో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంది. తండ్రి ఊర్లో లేడు. తల్లి దగ్గర సమయానికి డబ్బులేదు. మరుసటి రోజు స్కూలుకు వెళ్లినప్పుడు లెక్కల మాస్టారుకు విషయం తెలిసింది. సాయంత్రం ఇంటికొచ్చిన ఆయన ‘‘చూడండమ్మా, బిట్స్‌లో సీటు రావడం ఆషామాషీ కాదు. మీ అబ్బాయిని ఇంటర్వ్యూకు వెళ్లమనండి’’ అంటూ ఐదొందల రూపాయలు చేతిలో పెట్టాడు. ఆత్మాభిమానం అడ్డొచ్చి వద్దంది తల్లి. బతిమాలి ఒప్పించి.. వైద్యనాథన్‌ను బిహార్‌ రైలు ఎక్కించి, మరీ సాగనంపాడు మాస్టారు. ఆ లెక్కల సారు పేరే గుర్దాయల్‌ సరూప్‌ సైనీ. ఆయన సహాయం చేసిన నెల రోజులకే తండ్రికి డల్‌హౌసీకి బదిలీ కావడంతో వైద్యనాథన్‌ కుటుంబం వెళ్లిపోయింది. మాస్టారు కూడా మరో ఊరికి బదిలీపై వెళ్లిపోయాడు. కాలం గడిచిపోయింది. ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా వెదుకుతూనే ఉన్నాడు వైద్యనాథన్‌.




ఐదొందలు ఇచ్చినందుకు రూ.30 లక్షలు సాయం..

ఆఖరికి మాస్టారు దొరికాడు. వణుకుతున్న గొంతుతో ‘‘మాస్టారు.. మాస్టారు.. మీరిచ్చిన ఐదొందలతోనే ఆ రోజు రైలు ఎక్కాను. ఇంజనీరింగ్‌ చేసి.. ఇప్పుడు బ్యాంకు కూడా పెట్టాను. మీ రుణం ఎలా తీర్చుకోను..’’ అంటూ కృతజ్ఞతాభావంతో ఏకరువు పెట్టాడు వైదీ. ‘‘చాలా సంతోషం నాయనా. నేను చేసింది చిన్న సహాయమే. నాకు గుర్తు కూడా లేదు. దేవుడి దయ వల్ల రిటైర్మెంట్‌ డబ్బుతో ఇల్లు కట్టుకున్నాను. నాకు నువ్వేమీ ఇవ్వొద్దు..’ అంటూ సున్నితంగా తిరస్కరించాడు మాస్టారు. ఆయన రుణం తీర్చుకోనిదే నిద్రపట్టలేదు వైద్యనాథన్‌కు. చివరికి 2020 ఆగస్టులో ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌లో తన వాటాలోని లక్ష షేర్లను (విలువ రూ.30 లక్షలు) ఆ మాస్టారి పేరు మీద కానుకగా బదిలీ చేశాడు. ఒకప్పుడు రైలు టికెట్‌కు డబ్బుల్లేని వైద్యనాథన్‌ నేడు రెండు లక్షల కోట్ల విలువగల బ్యాంక్‌కు యజమాని. అయినా గర్వం లేదు. ఆయన కాళ్లు నేల మీదే ఉన్నాయి. కళ్లు మానవీయతతో మెరుస్తున్నాయి. 


వైద్యనాథన్‌లోని కృతజ్ఞతా భావానికి ఎవరైనా ఆశ్చర్యపోతారు. కష్టకాలంలో తనపై విశ్వాసం ఉంచిన అన్నదమ్ములకు, అక్కకు, తనతో మొదటి నుంచీ ఉన్న 23 మంది ఉద్యోగులకు.. రూ.20 కోట్ల విలువైన తన బ్యాంక్‌ షేర్లను 2018లో దీపావళి కానుకగా ఇచ్చాడు. తన కారు డ్రైవరు, వంటమనిషి, ప్యూన్‌ వంటి వ్యక్తిగత సిబ్బంది ఒక్కొక్కరికీ రూ.30 లక్షల విలువైన షేర్లను ఇచ్చి సత్కరించాడు..


- సునీల్‌ ధవళ, 97417 47700 సీయీవో, 

ద థర్డ్‌ అంపైర్‌ మీడియా అండ్‌ అనలిటిక్స్‌ 

Updated Date - 2020-10-25T21:37:00+05:30 IST