అందరూ బతకడానికి వస్తే... నేను ఏలడానికి వచ్చా

ABN , First Publish Date - 2022-10-02T06:57:15+05:30 IST

ఇప్పుడు సినిమా విడుదలకు వేదికలు పెరిగాయి. దీనివల్ల సృజనాత్మకత స్వేచ్ఛ పెరిగింది.

అందరూ బతకడానికి వస్తే... నేను ఏలడానికి వచ్చా

ఘన విజయాలతో మొదలుపెట్టి... అపజయాల బాట పట్టిన దర్శకులు ఎందరో. కానీ పరీక్షలకు నిలబడి... సవాళ్లకు ఎదురెళ్లి... తిరిగి రేస్‌లో నిలబడేవారు కొందరే. అలాంటి వారిలో ముందుంటారు ప్రముఖ దర్శకుడు తేజ. ఇప్పుడు ‘అహింస’తో మళ్లీ తన మార్కు ‘చిత్రం’ చూపించాలని పట్టుదలగా ఉన్న తేజను ‘నవ్య’ పలుకరించింది... 


పరిశ్రమలో మీది సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్‌ అయింది. 

ఓటీటీ రాక సినిమా మేకింగ్‌ను ఎలా ప్రభావితం చేస్తోంది? 

ఇప్పుడు సినిమా విడుదలకు వేదికలు పెరిగాయి. దీనివల్ల సృజనాత్మకత స్వేచ్ఛ పెరిగింది. నేను మద్రా్‌సలో ఉన్న రోజుల్లో ఒకటీ అరా తప్ప  తెలుగు సినిమాలు కేవలం ఆంధ్రాలో మాత్రమే విడుదలయ్యేవి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ఓటీటీ, శాటిలైట్‌, మొబైల్‌.. ఇలా ట్రేడ్‌ పార్ట్‌ బాగా పెరిగింది. 

పాన్‌ ఇండియా ధోరణితో  తెలుగు సినిమా తన మూలాలను వదిలి ఊహా ప్రపంచంలోకి వెళుతోందనే విమర్శ వినిపిస్తోంది కదా?

మన మూలాలు మన సంస్కృతిలోనే ఉంటాయి. మనం పెరిగిన ఊరు, సంస్కృతి ప్రభావం మనపైన ఉంటుంది. ఆ కల్చర్‌లో అయితేనే నేను సినిమా తీయగలను. ఐరోపా నేపథ్యంలో సినిమా తీయమంటే నా వల్ల కాదు. అలాగే ఉత్తర భారతం, బిహార్‌ ప్రేక్షకులకు నచ్చేలా తీయమంటే నేను తీయలేను. తెలుగు సంస్కృతికి తగ్గట్లు సినిమా తీసి, అది ఇక్కడివాళ్లకు, బయటివాళ్లకు కూడా నచ్చితే అప్పుడు పాన్‌ ఇండియా అవుతుంది. 

ఈ విధానంలో తప్పు ఎక్కడ ఉందంటారు?

ఇప్పుడు పాన్‌ ఇండియా ట్రెండ్‌లో రెండు రకాలు ఉన్నాయి. ముంబై, తమిళనాడు, ఢిల్లీ సంస్కృతి కనిపించేందుకు ఆయా ప్రాంతాల నుంచి ఒకరొకరు చొప్పున నటీనటులను తీసుకొని పెట్టుకుంటున్నారు. అదే పాన్‌ ఇండియా అనుకుంటున్నారు. 

కానీ ‘బాహుబలి’ సినిమాను పాన్‌ ఇండియా కోసం అని తీయలేదు. తీసిన తర్వాత అది పాన్‌ ఇండియా సినిమా అయింది. దానికంటే ముందుగా వచ్చిన కమల్‌హాసన్‌ సినిమాలు చాలా పాన్‌ ఇండియానే. ‘షోలే’ ముంబైలో తీసినా తమిళనాడులో ఆడింది. ‘ఎంటర్‌ ది డ్రాగన్‌’, ‘36 ఛాంబర్‌ ఆఫ్‌ షావోలిన్‌ టెంపుల్‌’ చిత్రాలు పల్లెల్లో కూడా ఆడాయి. జాకీచాన్‌ ఇంటర్నేషనల్‌ స్టార్‌. బ్రూస్లీ అంద రికీ తెలుసు. కారణం వాళ్లని మనం ఓన్‌ చేసుకున్నాం. బ్రూస్లీని తెచ్చి ఇక్కడ సినిమా చేస్తే ఆడదు. అలాగే మనం కూడా వాళ్ల సంస్కృతి నేపథ్యంలో సాగే సినిమాలు చేయకూడదు. 

ఓటీటీల ప్రభావం దర్శకులు అప్‌డేట్‌ అవ్వాల్సిన అవసరం కల్పించిందా? 

తెలుగు జనాభా 20 కోట్లు ఉంటుంది. ఇందులో ఓటీటీ చూసేవాళ్లు ఒక 30 లక్షలు ఉంటారు. మళ్లీ ఇందులోనూ సగం మంది అసలు థియేటర్లకు రారు. అంటే ఓ 15 లక్షలమంది వస్తారు. మన ప్రేక్షకులు  రెండు,మూడు కోట్లు ఉంటారు. వీళ్లందరూ ఓటీటీ చూడరు. కానీ ఎక్కడయితే మనం వ్యాపారాలు చేస్తున్నామో, సినిమాలు తీస్తున్నామో అక్కడ మనం ఓటీటీలో చూస్తాం. మనం చూస్తున్నాం కాబట్టి అందరూ ఓటీటీ చూస్తున్నారనుకుంటున్నాం. అందరూ మారిపోయారనుకుంటున్నాం. అందరూ మారలేదు. మారరు. 

మరి దర్శకులు ఎక్కడ విఫలమవుతున్నారు?

కొత్త సాంకేతికత, విదేశీ సినిమాల ప్రభావం ప్రేక్షకుల పైన ఉంది. కానీ సినిమాలో భావోద్వేగాలదే పైచేయి. ‘నార్కోస్‌’, ‘షోలే’, ‘జయం’... ఏ సినిమా చూసినా అందులో ఓ ఎమోషన్‌ ఉంది. ప్రేక్షకుడు భావోద్వేగాలతో కనెక్ట్‌ అవుతాడు తప్ప టెక్నాలజీతో కాదు. భారీ గన్స్‌తో ‘కేజీఎఫ్‌’ తీసినా, అసలు గన్స్‌ లేకుండా ‘బాహుబలి’ తీసినా కనెక్ట్‌ అయ్యారు. టెక్నాలజీ సాయంతో వాళ్లు మరింత అనుభూతి చెందేలా చేయాలేతప్ప... టెక్నిక్‌ వచ్చిందని చెప్పి ఎమోషన్‌ని తొక్కేయకూడదు. ఈ కన్‌ఫ్యూజన్‌ ఇప్పుడు ఎదురవుతోంది. టెక్నాలజీని పెట్టి ఎమోషన్‌ని తొక్కేస్తున్నారు. ఎమోషన్‌ ఈజ్‌ ఎమోషన్‌. మా ఆవిడతో హైదరాబాద్‌లో ‘అవేంజర్స్‌’ సినిమా చూశాను. అమెరికాలో ఉంటున్న నా కూతురు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆ సినిమా చూసింది. మా ఆవిడ నా కూతురుతో మాట్లాడుతూ ‘ఇక్కడ సూపర్‌ హీరో తెరపైన కనిపించ గానే ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు’ అంది. ‘ఇక్కడ కూడా కొట్టారు అమ్మా’ అని నా కూతురు చెప్పింది. మా ఆవిడ ‘ఒక చిన్నపాప కనిపించగానే అందరూ గట్టిగా అరిచారు’ అంది. ‘ఇక్కడ కూడా అరిచారు’ అని నా కూతురు చెప్పింది. ‘ఐరన్‌ మ్యాన్‌ చచ్చిపోతే ఏడ్చారు ఇక్కడ’ అంది. ‘మా దగ్గర కూడా ఏడ్చారు’ అంది నా కూతురు. అంటే కథలో అంతర్లీనంగా ఉండే భావోద్వేగాలు ఎక్కడైనా ఒక్కటే. అవి సరిహద్దులు, సంస్కృతులు, భాషలకు అతీతమైనవి. తల్లి ప్రేమ ఎక్కడైనా తల్లి ప్రేమే. ఈ ఎమోషన్‌ని కరెక్ట్‌గా పట్టుకొని ఏ భాషలో తీసినా, ఓటీటీలో తీసినా కనెక్ట్‌ అవుతారు. 


కొవిడ్‌ తర్వాత పరిశ్రమలో అపజయాలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? 

కొవిడ్‌ వల్ల తెలియకుండానే ఇంటిపట్టున ఉండడం అలవాటైంది. సినిమా అయినా మరేదైనా అవసరం అనిపిస్తేనే బయటకు వెళుతున్నారు. బాగుందని కన్‌ఫర్మ్‌ చేసుకున్నాకే సినిమాకు వెళుతున్నారు. నేను సినిమాకు వెళితే తప్పనిసరిగా పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్‌ కావాలి. ఇప్పుడు వాటిని కొనాలంటే భయంకరమైన రేట్లు. టికెట్‌ ధరలను మించిపోయాయి. టికెట్‌ రూ.150 ఉంటే, పాప్‌కార్న్‌ రూ.400. ప్రపంచంలో ఎక్కడా ఇలా ఉండదు. అదే అమెరికాలో టికెట్‌ 30 డాలర్లు ఉందనుకుంటే, పాప్‌కార్న్‌ 5 డాలర్లే ఉంటుంది. అంటే మీరు వందకోట్లతో తీసిన సినిమా కన్నా కూడా మించిపోయింది. పది రూపాయల పాప్‌కార్న్‌ నాలుగు వందల రూపాయలకు అమ్మడం ఏంటి. వీటన్నింటి ప్రభావం తెలియకుండానే సినిమాపై పడుతోంది. మీరు సినిమాకు వెళితే, పార్కింగ్‌ బాగుండాలి, సీట్లు బాగుండాలి, పాప్‌కార్న్‌ ధర తక్కువ ఉండాలి... ఇదంతా ఒక ప్యాకేజీ. ఎందుకంటే మనం ఒక అడ్వెంచర్‌కి వెళుతున్నాం. ఇందులో ఒకటి సరిగా లేకున్నా ప్రేక్షకుడు అసౌకర్యంగా భావిస్తాడు. మల్టీప్లెక్స్‌లు వచ్చాక ఇలా అయింది. కానీ సింగిల్‌ స్ర్కీన్లలో అయితే ఈ డ్రామాలు ఉండవు. ఇప్పుడు బాంబే ఇండస్ట్రీ పడిపోవడానికి ప్రధాన కారణం మల్టీప్లెక్స్‌ల వ్యవస్థ. వాళ్లు అమాంతంగా పెంచిన టికెట్‌ ధరలు, తినుబండారాల ధరలతో ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్లడం మానేశాడు. సింగిల్‌ స్ర్కీన్లు లేవు. ఇంకెక్కడా చూడలేక జనం సినిమాకు వెళ్లడం మానేశారు. మనదగ్గరా అదే జరుగుతోంది. ఇప్పుడు మల్టీప్లెక్స్‌ల కంటే కూడా సింగిల్‌ స్ర్కీన్ల వసూళ్లు చాలా బెటర్‌గా ఉన్నాయి. కాకపోతే మనం వాణిజ్య నగరాలు, ప్రధాన నగరాల్లో ట్రెండ్స్‌ను మాత్రమే చూస్తాం. బాంబేలో ‘మండీమే హిట్‌ హువాతో హిట్‌ హువా’ అంటారు. మండిలో హిట్‌ అయితే చాలు వాళ్లకి. ‘పుష్ప’ ముంబైలో ఆడింది... వాళ్ల దృష్టిలో దేశం అంతా ఆడినట్లే. ఆంధ్రాలో ఎంత డెఫిషిట్‌ అంటే ఇంకా డబ్బులు తిరిగి కట్టాలి. మాకు తెలిసిన వాళ్ల థియేటర్‌లో ‘పుష్ప’ని రిలీజ్‌ చేశాం. పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ వచ్చింది. దానికంటే ‘రాధేశ్యామ్‌’కి కాస్త మెరుగైన కలెక్షన్స్‌ ఉన్నాయి. ‘ఆచార్య’కు నష్టాలు వచ్చాయి. 


ట్రైలర్‌ చూసి ప్రేక్షకుడు సినిమా చూడాలో, వద్దో నిర్ణయించుకుంటున్నాడు. ఎందుకంటే పెద్దమొత్తం వెచ్చించాల్సి వస్తోంది. బుక్‌మైషోలో టికెట్‌ రేటుపైన అధికంగా కొంత మొత్తం వసూలు చేస్తాడు. పార్కింగ్‌ రుసుం. ఏమీ తినకుండా సినిమా చూడలేం. థమ్సప్‌ క్యాన్‌ రేటు కంపెనీ ధర రూ.7. బయట షాపుల్లో రూ.20. మల్టీప్లెక్స్‌ల్లో దాన్ని రూ.100కు అమ్ముతున్నారు. మరీ అంత అన్యాయమా? ఒక ఐదు రూపాయల లాభం వేసుకుంటే భరించవచ్చు. రూ.75 లాభమా? ఇదంతా సినిమాకు దెబ్బ అవుతోంది. పిల్లల్ని తీసుకొని సినిమాకు వెళ్లాలంటే ఈ ఖర్చు చూసి భయపడుతున్నారు. 


కొత్తవాళ్లతో చేయడం కష్టమనిపించదా? 

కొంతమంది దర్శకులు అయితే కొత్తవాళ్లతో అసలు సినిమాలు చేయరు. నాకు అది మామూలే. కొత్త తరంతో కనెక్ట్‌ అవ్వడం నాకు అంత కష్టంగా అనిపించదు. ఒక్కోసారి వాళ్లపైన కోపం వస్తుంది. కానీ కొంచెం ఆలస్యం అయినా వాళ్ల నుంచి అనుకున్న అవుట్‌పుట్‌ రాబట్టుకుంటాను. దానికోసం ఒక మార్గాన్ని వెతికిపట్టుకునే ప్రక్రియను నేను ఆస్వాదిస్తాను. నా దృష్టిలో జీవితం అంటే, ఎక్కువ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమే. విఘ్నాలను అధిగమించే శక్తిని ప్రసాదించమని వినాయకుణ్ణి ప్రార్థిస్తాను. ఒంటరితనాన్ని అసలు ఇష్టపడను. ఎప్పుడూ జనంలోనే ఉంటాను. డైరెక్టర్లలో చాలామందికి ఇంట్లో హోమ్‌థియేటర్‌ ఉంటుంది. నేను మాత్రం మా గ్రూప్‌తో ప్రసాద్స్‌కి వెళ్లి చూస్తాను. 

కష్టకాలంలో మీకు ఓదార్పునిచ్చిన వ్యక్తులు ఎవరు?

నాకు ఆదివారాలు, సెలవులు ఉండవు. ఎప్పుడూ పనే లోకం. పనిలో తలమునకలవుతాను. అది అన్నీ మరిపిస్తుంది. ఎంత కష్టం వచ్చినా, బాధ కలిగినా నేను ఎవరితో పంచుకోను. 

పనిలో పడి జీవితంలో ఏదైనా కోల్పోయాను అనే భావన కలిగిందా? 

విజయాన్ని  గుర్తుచేసుకుంటే పొగరు  తలకెక్కుతుంది. ఓటమిని గుర్తుచేసుకుంటే పరాజయభావన వెంటాడుతుంది. అందుకే గతం తాలూకు జ్ఞాపకాలకు నా మనసులో స్థానం లేదు. నా పాత సినిమాను ఎవరైనా ప్రశంసిస్తున్నా చూసి నవ్వుకొని వెళ్లిపోతాను. ఇంట్లో నా ఫొటోలు, షీల్డులు కూడా పెట్టుకోను. ఈ ఇండస్ట్రీ నాది. అందరూ బతకడానికి వస్తే, నేను ఏలడానికి వచ్చాను అనుకుంటాను. 

దర్శకుడిగా మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? 

నాలోని ప్రతిభకు తగ్గ సినిమా ఇంకా పడలేదు. సాధించాల్సింది చాలా ఉంది. ఇంకా ఏదో చేయాలని ఉంది. 


ఆర్పీతో మళ్లీ పనిచేయడం ఎలా ఉంది?

చాలా బాగుంది. నేను ఇప్పటిదాకా సినిమా రంగానికి పరిచయం చేసినవాళ్ల సంఖ్య 1163. అందులో ఆర్పీ ఒకరు. ఆరంభం నుంచి కలసి పనిచేశాం. మా ఇద్దరికీ జోడీ బాగా కుదిరింది. తను చెప్పింది వెంటనే అర్థం చేసుకుంటాడు. మాకు ఇంట్లో మనిషిలానే. నాకు సంగీతంపై అంతగా అవగాహన లేదు. నేను కలలో కూడా పాడలేను. కానీ నా సినిమాలు అన్నీ మ్యూజికల్‌ హిట్లు. కారణం ఆర్పీ. ఆయనతో చేసేటప్పుడు మ్యూజిక్‌ పరంగా మేం అప్‌డేట్‌గా ఉన్నామా లేదా అని చెక్‌ చేసుకుంటే సరిపోతుంది. 

ఒక సినిమా చేయడానికి మీకు ప్రేరణ?

 ప్రేక్షకులు ఎప్పుడూ స్టార్లు కోసం చూడరు. మంచి సినిమా కావాలనుకుంటారు. మంచి కథలో గాడిదను హీరోగా పెట్టినా సినిమా హిట్టవుతుంది. చెత్త కథలో అమితాబ్‌, ఆమిర్‌, రజనీకాంత్‌ కలసి నటించినా కూడా ఆడదు. ఎమోషన్‌, స్టోరీ బాగుంటేనే హిట్‌. నేను ఆ స్టోరిని నమ్ముకున్నాను. విజయా, సురేష్‌ ప్రొడక్షన్స్‌ కథ ను నమ్మి పెద్ద సంస్థలుగా ఎదిగాయి. కంటెంట్‌ బాగుంది కాబట్టే  ఓటీటీలో మనం విదేశీ భాషా చిత్రాలు చూస్తున్నాం. నేను ఎమోషన్‌ని నమ్ముకున్నాను. స్టార్‌ని నమ్ముకుంటే కొత్తగా తీయలేం. ‘నేనే రాజు- నేనే మంత్రి’ సినిమాలో రానాకు బదులు జూనియర్‌ ఎన్టీఆర్‌ని పెడితే అభిమానులు నన్ను కొట్టేవాళ్లు. 

అభిరామ్‌ని ఎలా చూపించబోతున్నారు?

నేను కనికరం చూపని దర్శకుణ్ణి. ‘‘అహింస’ సినిమాలో అతనిపైన అన్ని ట్రిక్స్‌ వాడాను. కావాలనుకున్న అవుట్‌ పుట్‌ ఇచ్చాడా లేదా అనేదే నాకు ముఖ్యం. తను నాయుడుగారి మనవడు, సురేష్‌బాబు గారి అబ్బాయి అనేది పట్టించుకోను. నా సినిమాలో క్యారెక్టర్‌లా బిహేవ్‌ చేయాలి అంతే.  మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి షూటింగ్‌ చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక ్షన్‌ జరుగుతోంది. అవుట్‌ పుట్‌ బాగుంది. చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాను. దీపావళికి రిలీజ్‌ చేసే ఆలోచన ఉంది.ఇందులో 25మంది కొత్త నటులు ఉన్నారు. 

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


పాన్‌ ఇండియా ఉధృతి వల్ల మంచే జరుగుతోందా?

దీనివల్ల క్రియేటివ్‌ సైడ్‌ కొంత గందరగోళం కూడా ఏర్పడింది. పాన్‌ ఇండియా లక్ష్యంగా తీసే సినిమాలు విఫలమవుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు సినిమా తీస్తే, అది పాన్‌ ఇండియా అయితే మంచిది. కేవలం పాన్‌ ఇండియా కోసమే అని ఒక సినిమా తీస్తే దాన్ని ఏ ప్రేక్షకులూ ఓన్‌ చేసుకోవడం లేదు. ఒక బాణంతో ఐదు లక్ష్యాలను కొట్టలేము. అలాగే ఐదు బాణాలు ఉండి, ఐదు లక్ష్యాలు ఉన్నా కొట్టలేము. ఐదు బాణాలతో ఒకే లక్ష్యాన్నిఛేదించలేం. ఒక బాణం ఒక లక్ష్యం ఉండడమే కరెక్ట్‌. 


ఒంటరితనాన్ని అసలు ఇష్టపడను. ఎప్పుడూ జనంలోనే ఉంటాను. డైరెక్టర్లలో చాలామందికి ఇంట్లో హోమ్‌థియేటర్‌ ఉంటుంది. నేను మాత్రం మా గ్రూప్‌తో ప్రసాద్స్‌కి వెళ్లి చూస్తాను. 


కథలో అంతర్లీనంగా ఉండే భావోద్వేగాలు ఎక్కడైనా ఒక్కటే. అవి సరిహద్దులు, సంస్కృతులు, భాషలకు అతీతమైనవి. తల్లి ప్రేమ ఎక్కడైనా తల్లి ప్రేమే. ఈ ఎమోషన్‌ని కరెక్ట్‌గా పట్టుకొని ఏ భాషలో తీసినా, ఓటీటీలో తీసినా జనం కనెక్ట్‌ అవుతారు. 

Updated Date - 2022-10-02T06:57:15+05:30 IST