ITR filing: విదేశీ ఆస్తులపై తప్పుడు సమాచారం ఇచ్చారో...

ABN , First Publish Date - 2022-07-19T22:23:17+05:30 IST

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు మరికొద్ది రోజులే

ITR filing: విదేశీ ఆస్తులపై తప్పుడు సమాచారం ఇచ్చారో...

న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నుల (IT Returns) దాఖలుకు గడువు మరికొద్ది రోజులే మిగిలి ఉంది. రిటర్నులను దాఖలు చేయాలనే ఆత్రుతలో విదేశీ ఆస్తుల గురించి తప్పుడు సమాచారం ఇస్తే, చట్ట ప్రకారం కఠిన చర్యలను ఎదుర్కొనక తప్పదు. నల్లధనం చట్టం ప్రకారం సంవత్సరానికి రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించడంతోపాటు , గరిష్ఠంగా పదేళ్ళ వరకు జైలు శిక్షను అనుభవించవలసిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 


Income Tax Returnను దాఖలు చేయడానికి చేసే కసరత్తులో మొట్టమొదటి అంశం సరైన ఫారాన్ని ఎంపిక చేసుకోవడం. నివాస హోదా, ఆదాయం స్వభావం, ఆడిట్ అవసరాలు మొదలైనవాటి ఆధారంగా సరైన ఫారాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు, ప్రవాస భారతీయులు (NRIs) ఐటీఆర్-2 ఫారాన్ని (ITR-2 Form) ఉపయోగించాలి. రెండు ఇళ్ళ నుంచి అద్దె రూపంలో వచ్చే  ఆదాయాన్ని లేదా కేపిటల్ గెయిన్స్‌ను ఐటీఆర్-2లోనే రిపోర్ట్ చేయాలి. ఇంట్రా డే ట్రేడింగ్ (Intraday Trading) లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ (Futures and options trading) ద్వారా వచ్చే ఆదాయం కోసం ఐటీఆర్-3 (ITR-3 Form) ని ఉపయోగించాలి. 


వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలను సమగ్రంగా ఇవ్వాలి. ముందుగానే నింపిన JSON యుటిలిటీ ఆధారంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ జరుగుతుంది. అంటే వ్యక్తిగత సమాచారం తనంతట తానుగానే ట్యాక్స్ పోర్టల్ నుంచి ఐటీఆర్ ఫారంలోకి వచ్చేస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు తమ పేరు, చిరునామా, సంప్రదించవలసిన ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ వంటివాటిని తప్పులు లేకుండా ట్యాక్స్ పోర్టల్‌లో ఇవ్వాలి. ఉదాహరణకు బ్యాంకు ఖాతా వివరాలను సక్రమంగా ఇవ్వకపోతే రిఫండ్ క్రెడిట్ ప్రాసెస్ నిలిచిపోతుంది. 


విదేశాల్లో తమకుగల ఆస్తుల వివరాలను ఐటీఆర్‌లో పేర్కొనకపోతే, ఆదాయపు పన్ను చట్టం, నల్లధనం చట్టం ప్రకారం అధికారులు ప్రశ్నిస్తారు. విదేశాల్లో సంపాదించిన ఆదాయానికి భారత దేశంలో పన్ను విధించినపుడు, ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్ లబ్ధిని పొందడం కోసం ఐటీఆర్‌ను దాఖలు చేయడానికి ముందు ఫారం-67ను దాఖలు చేయడం తప్పనిసరి. ఫారం-67 (Form-67)తోపాటు విదేశాల్లో చెల్లించిన పన్నుల రశీదులను జత చేయాలి. ఓవర్సీస్ ట్యాక్స్ రిటర్ను, పన్ను చెల్లింపు చలానా వంటివాటిని సమర్పించాలి. ఫారం-67ను దాఖలు చేయకపోతే ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్‌ను నిరాకరించే అవకాశం ఉంటుంది. 


అక్రమార్కులపై కొరడా నల్లధనం చట్టం

2016 ఏప్రిల్ 1 నుంచి Undisclosed Foreign Income and Assets and Imposition of Tax Act, 2015 అమల్లోకి వచ్చింది. దీనినే నల్లధనం చట్టం అని పిలుస్తున్నారు. విదేశీ ఆస్తులు, ఆదాయాలను నిజాయితీగా వెల్లడించకపోతే ఈ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవు. విదేశీ ఆదాయాలపై ఫ్లాట్ రేట్ 30 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం లభించే మినహాయింపులు, తగ్గింపులు, నష్టాల రద్దు లేదా ముందు సంవత్సరాలకు సర్దుబాటు చేయడం వంటివేవీ వర్తించవు. 


వెల్లడించని విదేశీ ఆస్తులు, నల్లధనానికి కళ్లెం వేయడం లక్ష్యంగా ఈ చట్టాన్ని భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019లో దీనిని సవరించారు. భారత దేశం వెలుపల ఆస్తిని సంపాదించినపుడు లేదా ఆదాయాన్ని ఆర్జించినపుడు భారత దేశంలో నివసించిన నాన్ రెసిడెంట్ ఇండియన్లను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఆస్తులను వెల్లడించడానికి కొంత గడువును నిర్దేశించారు. ఈ గడువులోగా విదేశీ ఆస్తులను, ఆదాయాలను  వెల్లడించిన పన్ను చెల్లింపుదారులపై విచారణ జరగదు. 


విదేశీ ఆదాయంపై పన్నును ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తే మూడు సంవత్సరాల నుంచి పదేళ్ళ వరకు జైలు శిక్ష విధించవచ్చు. అంతేకాకుండా ఎగవేసిన పన్నుకు మూడు రెట్లకు సమానమైన జరిమానా విధించవచ్చు లేదా వెల్లడించని ఆదాయంలో 90 శాతం లేదా ఆ ఆస్తి విలువను జరిమానాగా విధించవచ్చు. 


ఈ నిబంధనను పాటించనివారు 30 శాతం రేటుతో పన్ను చెల్లించవలసి ఉంటుంది, అయితే కన్సెషనల్ పెనాల్టీ మాత్రం పన్ను మొత్తంతో సమానంగా ఉంటుంది. 


విదేశీ ఆదాయం లేదా ఆస్తుల వివరాలను వెల్లడించడంలో విఫలమైతే, రూ.10 లక్షల వరకు పెనాల్టీ విధించవచ్చు. రెండోసారి, ఆ తర్వాత ఈ నేరానికి పాల్పడినవారిని మూడేళ్ళ నుంచి పదేళ్ళ వరకు జైలు శిక్షతో శిక్షించవచ్చు. అంతేకాకుండా రూ.1 కోటి వరకు జరిమానా విధించవచ్చు. పన్ను చెల్లించకుండా బాకీ పెడితే, ఆ బాకీ సొమ్ముకు సమానమైన పెనాల్టీ విధించవచ్చు. నిబంధనలను, అధికారుల ఆదేశాలను పాటించకపోతే రూ.50,000 నుంచి రూ.2,00,000 వరకు పెనాల్టీ విధించవచ్చు.


ఓ సంవత్సరంలో రూ.5 లక్షల కన్నా తక్కువ విలువైన ఆస్తులను పరాకు వల్ల కానీ, సమాచారం తెలియకపోవడం వల్ల కానీ వెల్లడించకపోతే పెనాల్టీ కానీ, విచారణ కానీ ఉండవు. 


ఈ శిక్షలు, జరిమానాలపై పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రైబ్యునల్, అధికార పరిధిగల హైకోర్టులు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. 


Updated Date - 2022-07-19T22:23:17+05:30 IST