తనిఖీ చేస్తే.. బదిలీయే!

ABN , First Publish Date - 2022-09-26T08:06:04+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో తనిఖీలు చేయాలని సర్కారు ఆదేశించింది.

తనిఖీ చేస్తే.. బదిలీయే!

  • డీఎంహెచ్‌వోలకు అధికార పార్టీ నేతల హెచ్చరిక
  • ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు అపహాస్యం
  • రంగంలోకి దిగిన ప్రైవేటు ఆస్పత్రుల మాఫియా
  • జిల్లాల్లో వైద్యాధికారులకు నేతల బెదిరింపులు
  • తనిఖీలకు జంకుతున్న డీఎంహెచ్‌వోలు
  • కొన్ని జిల్లాల్లో ప్రక్రియే ప్రారంభించని వైనం
  • తనిఖీలు చేయాలని 21న సర్కారు ఆదేశం
  • శనివారం నాటికి 52 ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు సీజ్‌
  • రాష్ట్రవ్యాప్తంగా 147 ఆస్పత్రులకు నోటీసులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో తనిఖీలు చేయాలని సర్కారు ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేయాలంటూ ఈ నెల 21న ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్ని జిల్లాల వైద్యాధికారులకు సర్క్యులర్‌ జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల్లో వైద్యాధికారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు ప్రారంభించారు. అంతే.. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల మాఫియా రంగంలోకి దిగింది. తనిఖీలను ఆపాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఆశ్రయించింది. 


స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తమ ప్రతాపాన్ని వైద్యాధికారులపై చూపిస్తున్నారు. తనిఖీలను ఆపాలని హుకుం జారీ చేస్తున్నారు. వినకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. డీఎంహెచ్‌వోలను బదిలీ చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. దక్షిణ తెలంగాణలోని రెండు జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఈ పరిస్థితి ఇప్పటికే ఎదురైంది. కొందరు డీఎంహెచ్‌వోలు అసలు తనిఖీల ప్రక్రియనే ప్రారంభించలేదు. ఇక తనిఖీలు చేసిన చోట చర్యలకు వెనకాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని సీజ్‌ చేసే పరిస్థితీ కనిపించడం లేదు. అధికార పార్టీ నేతల దెబ్బకు కొందరు డీఎంహెచ్‌వోలు ఏకంగా ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసుకుంటున్నారు. శనివారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా 52 ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలను సీజ్‌ చేశారు. 147 ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చారు. ఆదివారం సెలవు కావడంతో తనిఖీలు జరగలేదు. 


నాలుగు రోజుల్లోనే సీన్‌ రివర్స్‌..

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌ లు, క్లినిక్‌లు, కన్సల్టేషన్‌ రూమ్‌లు, పాలీ క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, ఫిజియోథెరపీ సెంటర్లు, డెం టల్‌ ఆస్పత్రుల్లో కొన్ని తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్టు ప్రకారం రిజిష్ట్రేషన్లు లేకుండానే నడుస్తున్నాయి. అలాగే అనర్హులైన డాక్టర్లు, పారామెడికల్‌ స్టాఫ్‌, ఇతర అత్యవసర సిబ్బంది ఈ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నట్లు వైద్యశాఖకు భారీగా ఫిర్యాదులు అందాయి. ఇలాంటి ఆస్పత్రులు కనీస మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చుకోలేదు. సర్కారు ఆదేశాల మేరకు ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు.. అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి, 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ నెల 21న డీఎంహెచ్‌వోలందరికీ సర్క్యులర్‌ జారీ చేశారు. ఆ మరుసటి రోజు నుంచి డీఎంహెచ్‌వోలు రంగంలోకి దిగారు. తనిఖీలు మొదలుపెట్టిన రెండు మూడు రోజుల్లోనే సీన్‌ రివర్స్‌ అయింది. ఒకవైపు సర్కారు తనిఖీలు చేయమంటుంటే.. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వాటిని ఆపాలంటూ వైద్య శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో తాము ఎలా ముందుకు వెళ్లాలంటూ డీఎంహెచ్‌వోలు వాపోతున్నారు. 


ప్రాణాలతో చెలగాటం

ఇక వైద్యశాఖ ఇప్పటి వరకు చేసిన తనిఖీల్లో విస్తుపోయే అంశా లు వెలుగులోకి వస్తున్నాయి. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 16 ఆస్పత్రులను తనిఖీ చేస్తే, అందులో 12 సీజ్‌ చేశారు. నాలుగింటికి నోటీసులిచ్చారు. నారాయణపేట జిల్లాలో 12 ఆస్పత్రులను తనిఖీలు చేస్తే ఆరింటిని సీజ్‌ చేశారు. వారం కిందట ఇదే జిల్లాలోని కోస్గిలో 3 ఆస్పత్రులను సీజ్‌ చేశారు. జగిత్యాల జిల్లాలో 16 ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తే నాలుగింటిలో అర్హత లేని వైద్యులు పనిచేస్తున్నందుకు నోటీసులిచ్చారు. నల్లగొండ జిల్లాలో 60 ఆస్పత్రుల్లో తనిఖీలు చేయగా, ఐదు ల్యాబ్‌లు, రెండు ఆస్పత్రులను  సీజ్‌ చేశారు. 10 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. హనుమకొండ జిల్లాలో 16 ఆస్పత్రులను తనిఖీ చేయగా నాలుగింటికి  గుర్తింపే లేదని తేలింది. ఆ జిల్లాలో శనివారం ఒక్కరోజే 30 ఆస్పత్రులకు చెందిన వైద్యులు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తులు తీసుకెళ్లడం గమనార్హం. సిరిసిల్లలో 48 ఆస్పత్రులు తనిఖీలు చేసి, రిజిస్ట్రేషన్‌ లేని 12 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు.


 తనిఖీలు చేసిన వాటిలో సగానికిపైగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. అనుమతులు, అర్హతలు లేకుండానే కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా యి. ఇలాంటి ఆస్పత్రులకు అధికార పార్టీ నేతలు అం డగా నిలుస్తున్నారు. వాటిపై చర్యలు తీసుకోవద్దంటూ అధికారులను బెదిరిస్తున్నారు. కొన్నిజిల్లాల్లో అయితే ఇంకా తనిఖీల ప్రక్రియే మొదలుకాలేదు. ఇక తనిఖీల్లో ఎక్కువగా డెంటల్‌ ఆస్పత్రులు రిజిస్టర్‌ కాలేదని తెలుస్తోంది. అలాగే రిజిస్ట్రేషన్‌ లేకుండానే ఆస్పత్రులు పెట్టడం, ధరల పట్టిక ప్రదర్శించకపోవడం, ఎంబీబీఎస్‌ బోర్డు పెట్టి ఆర్‌ఎంపీ వైద్యుడితో చికిత్స చేయించడం వంటివి బయటపడుతున్నట్లు డీఎంహెచ్‌వోలు చెబుతున్నారు. ఇప్పటికే సీజ్‌ అయిన, నోటీసులు అందుకున్న ఆస్పత్రుల యజమానులు పైరవీలు మొదలుపెడుతున్నారు. 


ఒక్క నోటీసూ ఇవ్వలేదు..

నిజామాబాద్‌ జిల్లాలో శనివారం రాత్రి వరకు 45 ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. ఒక్కదానికీ నోటీసు ఇవ్వలేదు. ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ తనిఖీలు చేసి, ఒక్క నోటీసై ఇవ్వలేదు. మంచిర్యాల జిల్లాలో 32 ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. లోపాలు గుర్తించలేదని, నోటీసులు ఇవ్వలేదని వైద్యాధికారులు తెలిపారు. 


జిల్లాల్లో పరిస్థితి ఇలా..

ఆదిలాబాద్‌ జిల్లాలో 5 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. 

జనగామ జిల్లాలో ఓ క్లినిక్‌ను సీజ్‌ చేశారు.  

భూపాలపల్లిలో 7 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. 

ములుగు జిల్లాలో 3 ప్రైవేటు క్లినిక్‌లను సీజ్‌ చేశారు.

వరంగల్‌ జిల్లాలో 27 ఆస్పత్రులను తనిఖీలు చేయగా ఐదింటికి నోటీసులు జారీ చేశారు.

పెద్దపల్లి జిల్లాలో 28 ఆస్పత్రులను తనిఖీ చేసి.. 12 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. 

గద్వాల జిల్లాలో 46ఆస్పత్రులను తనిఖీ చేసి ఆరింటిని సీజ్‌ చేసి, పదింటికి నోటీసులిచ్చారు. 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 62 ఆస్పత్రులను తనిఖీ చేసి 17 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు. అడ్డాకుల మండలంలో ఓ క్లినిక్‌ను సీజ్‌ చేశారు. 

నాగర్‌కర్నూలు జిల్లాలో 4 ఆస్పత్రులను సీజ్‌ చేశారు.

యాదాద్రి జిల్లాలో 20 ఆస్పత్రులను తనిఖీ చేసి ఏడింటికి నోటీసులిచ్చారు.

వికారాబాద్‌ జిల్లాలో 78 ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. 6 ఆస్పత్రులు, రెండు డయాగ్నస్టిక్‌ కేంద్రాలను సీజ్‌ చేశారు. 24 ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు.  13 ఆస్పత్రులకు జరిమానా విధించారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 87 ఆస్పత్రుల్లో తనిఖీలు చేసి, ఏడింటిని సీజ్‌ చేశారు. 30 ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చారు.

హైదరాబాద్‌లో 49 చోట్ల తనిఖీలు చేసి రెండు డయాగ్నస్టిక్‌ కేంద్రాలను సీజ్‌ చేశారు. 17 ఆస్పత్రులకు నోటీసులిచ్చారు.

Updated Date - 2022-09-26T08:06:04+05:30 IST