మత్తు పదార్థాలు వాడితే కాటిక పయనమే..!

ABN , First Publish Date - 2022-06-27T07:11:40+05:30 IST

మత్తు, మాదక ద్రవ్యాల వాడితే కాటికి పయనం ప్రారంభమైనట్టేనని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మత్తు పదార్థాలు వాడితే కాటిక పయనమే..!

ఎస్పీ పరమేశ్వరరెడ్డి 


తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 26: మత్తు, మాదక ద్రవ్యాల వాడితే కాటికి పయనం ప్రారంభమైనట్టేనని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఎస్‌ఈబీ) శాఖల ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో అవగాహన ర్యాలీ జరిగింది. ఏఐఆర్‌ బైపాస్‌ రోడ్డులోని అన్నమయ్య కూడలిలో ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎంఆర్‌పల్లె కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారం నిర్మించారు.  ‘లైఫ్‌ ఈజ్‌ షార్ట్‌ విత్‌ డ్రగ్స్‌, డ్రగ్స్‌ డ్రాగ్‌ యు డౌన్‌ ’ తదితర నినాదాలతో విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం - అనర్థాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు ఎస్పీ మాట్లాడుతూ యువత బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. మత్తు, మాదక ద్రావ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు విక్రయించే వారి సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. జిల్లా పరిపాలనా విభాగం ఏఎస్పీ, ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుప్రజ, ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ స్వాతి ఇతర పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  



Updated Date - 2022-06-27T07:11:40+05:30 IST