మారకపోతే మార్చేస్తా!

ABN , First Publish Date - 2022-08-18T06:25:44+05:30 IST

‘గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏమి జరుగుతుంది, ఎవరేమి చేస్తున్నారో నిత్యం గమనిస్తున్నా. ఎక్కడ లోపం జరిగినా ఇన్‌చార్జ్‌దే బాధ్యత. మీ వలన పార్టీకి నష్టం జరిగితే ఉపేక్షించను, మీరు మారకపోతే మిమ్మల్నే మార్చేస్తా’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆపార్టీ ఇన్‌చార్జ్‌లకు స్పష్టం చేశారు.

మారకపోతే మార్చేస్తా!
విజయ్‌కుమార్‌తో మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు

సర్వేలు బాగున్నాయి, అయినా నిర్లక్ష్యం తగదు 

మండల కన్వీనర్లు,  క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు కలిసి పనిచేయాల్సిందే 

కందుల, బీఎన్‌లతో  చంద్రబాబు విడివిడిగా సమీక్ష 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

‘గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏమి జరుగుతుంది, ఎవరేమి చేస్తున్నారో నిత్యం గమనిస్తున్నా. ఎక్కడ లోపం జరిగినా ఇన్‌చార్జ్‌దే బాధ్యత. మీ వలన పార్టీకి నష్టం జరిగితే ఉపేక్షించను, మీరు మారకపోతే మిమ్మల్నే మార్చేస్తా’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆపార్టీ ఇన్‌చార్జ్‌లకు స్పష్టం చేశారు. మార్కాపురం, ఎస్‌ఎన్‌పాడు ఇన్‌చార్జ్‌లైన కందుల నారాయణరెడ్డి, బీఎన్‌ విజయ్‌కుమార్‌తో బుధవారం సాయంత్రం ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఒక్కొక్కరితో గంటకుపైగా ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. ఇద్దరికీ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు, మండల కన్వీనర్లను సమన్వయం చేసుకుని వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండకపోయినా, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించకపోయినా, ఉన్న వారిలో పనిచేయకుండా మీకు జేజేలు పలుకుతున్నారంటూ ఎవరినైనా ప్రోత్సహించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  


 కొత్తవారికీ అవకాశం ఇవ్వండి 

‘మీరు చురుగ్గానే పనిచేస్తున్నారు. జిల్లా ఏర్పాటు విషయంలో మీ ప్రాంతా నికి జరిగిన అన్యాయాన్ని, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తిచూపటంలో కూడా సక్సెస్‌ అయ్యారు. కానీ కిందిస్థాయి నాయకులను సమన్వయం చేసుకోవటంలో లోపం కనిపిస్తోంది, కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించలేకపోతున్నారు’ అని మార్కాపురం ఇన్‌చార్జ్‌ నారాయణరెడ్డికి చంద్రబాబు క్లాస్‌ ఇచ్చినట్లు తెలిసింది. క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు, మండల కన్వీనర్లను సమన్వయం చేసుకుని మీరు ముందుకుపోవాలి, కానీ కొన్నిచోట్ల లోపం జరుగుతోందని చెప్పినట్లు సమాచారం. పార్టీలోకి కొత్తవారు రావాల్సిన అవసరం ఉంది, కానీ మీరు రానివ్వటం లేదు కదా అని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. అయితే కొత్తవారిని ఆహ్వానిస్తే పార్టీలో పూర్వం నుంచి ఉన్న కొందరు వ్యతిరేకిస్తున్నారని చెబుతూ ఉదాహరణకు కొనకనమిట్లలో జరిగిన కొన్ని ఘటనలను కందుల వివరించగా.. అప్పుడే మీ నాయకత్వ పటిమ బయటపడాలని బాబు సూచించారు. సమన్వయలోపాన్ని సరిచేసుకుంటూ ఓటర్ల జాబితా సవరణలపై దృష్టిసారించకపోతే ఇబ్బందిపడతారని కూడా చెప్పినట్లు తెలిసింది.  


సమన్వయలోపాన్ని సవరించుకోండి

‘కిందిస్థాయి నాయకులతో సమన్వయలోపాన్ని సవరించుకోవాలి. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుల అవినీతి అక్రమాలను ఎండగట్టడంలో దూకుడుగా ఉండాలి. బాదుడే బాదుడు, ఓటర్ల సవరణల కార్యక్రమాలపై మరింత దృష్టిపెట్టాలి’ అని ఎస్‌ఎన్‌పాడు ఇన్‌చార్జ్‌ బీఎన్‌ విజయ్‌కుమార్‌కు చంద్రబాబు  సూచించినట్లు తెలిసింది. ‘ఇప్పటికి మీ నియోజకవర్గంపై మూడు సర్వేలు చేయించాం, మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి, మీరు మరింత దృష్టి పెట్టకపోతే కుదరదు’ అని కూడా బాబు స్పష్టం చేసినట్లు తెలిసింది.  కిందిస్థాయిలో నాయకుల మధ్య సమన్వయలోపాన్ని సవరించుకోవాల్సింది మీరే. ఈ రెండు విషయాల్లో మీరు నిర్లక్ష్యంగా ఉంటే కుదరదు అని చంద్రబాబు తేల్చిచెప్పారు. వ్యక్తిగతంగా మీపై కూడా నియోజకవర్గ ప్రజలలో మంచి అభిప్రాయం ఉంది. కానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి, అరాచకాలను ఎండగట్టడంలో వెనుకబడ్డారు, దానిని సవరించుకోవాలని కూడా సూచించినట్లు తెలిసింది. బాదుడే బాదుడు, ఓటర్ల జాబితా సవరణలపై సీరియస్‌గా పనిచేయకపోతే మళ్లీ పిలుస్తానని, నిర్ణయాలు సీరియస్‌గా ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. 


Updated Date - 2022-08-18T06:25:44+05:30 IST