జగన్‌ వచ్చి ఉంటే హైదరాబాద్‌ కూడా ఫినిష్‌ అయ్యేది

ABN , First Publish Date - 2022-07-01T08:22:20+05:30 IST

జగన్‌ వచ్చి ఉంటే హైదరాబాద్‌ కూడా ఫినిష్‌ అయ్యేది

జగన్‌ వచ్చి ఉంటే హైదరాబాద్‌ కూడా ఫినిష్‌ అయ్యేది

కక్షసాధింపులకు అమరావతి బలి: చంద్రబాబు


అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ‘‘ఉమ్మడి రాష్ట్రంలో నా తర్వాత జగన్‌ లాంటివాళ్లు వచ్చి ఉంటే హైదరాబాద్‌ నగరం కూడా నాశనం అయి ఉండేది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు ఆ పార్టీలో చేరారు. వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘పాలన చేసేవారికి దూరదృష్టి ఉండాలి. చేసే పనులు తర్వాతి తరాల వారికి కూడా ఉపయోగపడాలి. ఆ దృష్టితోనే నేను హైదరాబాద్‌ను నాలెడ్జ్‌ కేంద్రంగా, అవకాశాల ప్రదేశంగా మలిచాను. ఖర్మకాలి నా తర్వాత జగన్‌ వంటివాళ్లు వచ్చి ఉంటే హైదరాబాద్‌ సర్వతోముఖాభివృద్ధికి తలపెట్టిన రింగ్‌ రోడ్డు, ఎయిర్‌ పోర్టు, హైటెక్‌ సిటీ, ఐఎ్‌సబీ వంటి వాటిని కూడా నిలిపివేయడమో... కూల్చివేయడమో చేసేవాళ్లు. నా మీద కక్షతో అమరావతిని స్మశానం చేయాలని చూస్తున్న జగన్‌... తనకు అవకాశం వచ్చి ఉంటే హైదరాబాద్‌ను కూడా అదేపని చేసి ఉండేవారు. జగన్‌ కక్ష సాధింపునకు అమరావతి అది బలైపోయింది’’ అని పేర్కొన్నారు. ఉడతల కారణంగా కరెంటు తీగలు తెగిపోవడం, ఎలుకలు మద్యం తాగడం, ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ఉద్యోగుల ఖాతాల నుంచి మాయం కావడం ఈ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పాల్గొన్నారు. కాగా, రాజస్ధాన్‌లోని అజ్మీర్‌ దర్గాకు బహుకరించడానికి తీసుకువెళ్తున్న చాదర్‌ను ఎన్టీఆర్‌ జిల్లా మైలవరానికి చెందిన ముస్లిం మైనారిటీల బృందం గురువారం ఇక్కడ చంద్రబాబు చేతుల మీదుగా అందుకొంది.


లాండ్‌ పూలింగ్‌పై పుస్తకావిష్కరణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత ప్రభుత్వం చేపట్టిన లాండ్‌ పూలింగ్‌ విధానంపై రాసిన పుస్తకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఆవిష్కరించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక ప్రగతిపై లాండ్‌ పూలింగ్‌ విధానం ప్రభావం’ అనే శీర్షికతో ఈ పుస్తకాన్ని ఆచార్య పొదిలి వెంకటేశ్వరరావు రచించారు. ప్రపంచంలో అమరావతి లాండ్‌ పూలింగ్‌ నమూనా ఎలా విజయవంతమైన నమూనాగా నిలిచిందో ఆయన ఈ  పుస్తకంలో రాశారు.  


Updated Date - 2022-07-01T08:22:20+05:30 IST