ఆ ప్లాంట్ పేలితే యూరోప్‌కి యుగాంతం : జెలెన్‌స్కీ

ABN , First Publish Date - 2022-03-04T23:32:57+05:30 IST

ఉక్రెయిన్‌లోని జపొరిజ్జియా అణు విద్యుత్తు కర్మాగారం పేలితే

ఆ ప్లాంట్ పేలితే యూరోప్‌కి యుగాంతం : జెలెన్‌స్కీ

కీవ్ : ఉక్రెయిన్‌లోని జపొరిజ్జియా అణు విద్యుత్తు కర్మాగారం పేలితే, యూరోప్ అంతమవుతుందని ఆ దేశాధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరించారు. రష్యా దళాలు ఈ ప్లాంట్‌పై బాంబులు కురిపించిన వెంటనే ఆయన అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాల అధినేతలకు టెలిఫోన్ ద్వారా ఈ వివరాలను తెలిపారు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థకు కూడా ఈ దాడి గురించి వివరించారు. 


ఆఫ్‌లైన్ రియాక్టర్‌పై...

యూరోప్‌లో అతి పెద్ద అణు విద్యుత్తు కర్మాగారం జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై శుక్రవారం రష్యా దళాలు బాంబులు కురిపించాయి. దీనిలో ఆరు రియాక్టర్లు ఉన్నాయి. వీటిలో ఒకదానిలో కార్యకలాపాలు జరగడం లేదు. ఆఫ్‌లైన్‌లో ఉంది. దీనిని ఆధునికీకరిస్తున్నారు. అయితే దానిలో న్యూక్లియర్ ఫ్యూయల్ ఉంది. రష్యా దళాలు ప్రయోగించిన బాంబులు దీనిపైనే పడ్డాయి. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో సెంట్రల్ యూరోప్ దాదాపు దశాబ్దాల పాటు మహా విపత్తును ఎదుర్కొనబోతోందనే భయం వ్యాపించింది. ఈ మంటలను ఆర్పేసినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించడంతో కాస్త ఉపశమనం దొరికింది. 


ఈ ప్లాంట్ అధికార ప్రతినిధి ఆండ్రియ్ టుజ్ ఉక్రెయిన్ టెలివిజన్‌తో మాట్లాడుతూ, రష్యా దళాలు ప్రయోగించిన బాంబులు నేరుగా తమ ప్లాంటుపై పడ్డాయన్నారు. దీనిలో ఆరు రియాక్టర్లు ఉన్నాయని, ప్రస్తుతం కార్యకలాపాలు జరగని, ఆధునికీకరణ పనులు జరుగుతున్న రియాక్టర్‌పై బాంబులు పడ్డాయని చెప్పారు. 


ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడ, యూరోపియన్ యూనియన్ నేతలు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలతో జెలెన్‌స్కీ మాట్లాడారు. రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలను విధించాలని కోరారు. జపొరిజ్జియా ప్లాంట్‌పై రష్యా దళాల దాడుల తర్వాత యూరోప్‌‌ మహా విపత్తును ఎదుర్కొనబోతోందని చెప్పారు. ఈ ప్లాంట్‌లో పేలుడు జరిగితే ప్రతి ఒక్కరికీ అదే అంతిమ ఘడియ అవుతుందని చెప్పారు. యూరోప్ ఖాళీ అవుతుందన్నారు. యూరోప్ అత్యవసరంగా చర్యలు చేపడితేనే రష్యా దళాలను ఆపగలమని చెప్పారు. అణు విద్యుత్తు కర్మాగారంలో విపత్తు వల్ల యూరోప్ అంతమవడానికి అవకాశం ఇవ్వకూడదని తెలిపారు. రష్యా దళాలను ఆపడం కోసం రష్యా అధినాయకత్వంపై ఒత్తిడి తేవాలని రాజకీయ నేతలను, ప్రజలను కోరారు. 


రష్యాపై NATO ఆగ్రహం

ఉక్రెయిన్‌లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై బాంబులు కురిపించిన రష్యాపై నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిర్లక్ష్యపూరిత చర్య అని దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తక్షణమే ఆపాలని రష్యాను డిమాండ్ చేశారు. ఈ ప్లాంట్ ప్రాంతంలో యుద్ధాన్ని తక్షణమే ఆపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, మరికొందరు నేతలు రష్యాను కోరారు. 


రేడియేషన్ లెవెల్స్‌లో మార్పు లేదు

ఉక్రెయిన్ స్టేట్ న్యూక్లియర్ రెగ్యులేటర్ శుక్రవారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఎనర్హొడార్‌ నగరంలోని జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంటుపై రష్యన్ దళాలు జరిపిన దాడిలో చెలరేగిన మంటలను ఆర్పేశారు. రేడియేషన్ లెవెల్స్‌లో మార్పులు ప్రస్తుతానికి నమోదు కాలేదు. ఒకటో రియాక్టర్‌ కంపార్ట్‌మెంట్‌కు జరిగిన ఇతర నష్టాల గురించి అధ్యయనం జరుగుతోంది. యుద్దం వల్ల ఈ ప్లాంటుకు విద్యుత్తు సరఫరా నిలిచిపోతే, చల్లబరచే వ్యవస్థలకు విద్యుత్తును అందజేయడం కోసం డీజిల్ జనరేటర్లపై ఆధారపడవలసి వస్తుంది. ఈ వ్యవస్థలు విఫలమైతే జపాన్‌లోని Fukushima ప్లాంటులో సంభవించిన విపత్తు వంటి ఘోరం తప్పదు. 


ఈ ప్లాంట్‌లోని ట్రైనింగ్ సెంటర్‌పై రష్యన్ ప్రొజెక్టైల్ పడిందని ఐక్యరాజ్య సమితి అటామిక్ ఏజెన్సీ తెలిపింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానో గ్రోసి మాట్లాడుతూ, రేడియోధార్మిక పదార్థాలేవీ విడుదల కాలేదన్నారు. అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు గాయపడినట్లు చెప్పారు. 


కట్టుదిట్టమైన భద్రత

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్తు ప్లాంటులో ఉన్న నాలుగో రియాక్టర్ వద్ద  1986 ఏప్రిల్ 26న ప్రమాదం జరిగింది. ఇది చరిత్రలో అత్యంత దారుణమైన అణు విపత్తుగా రికార్డులకు ఎక్కింది. అయితే జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజైన్ విభిన్నమైనది. అగ్ని ప్రమాదాల నుంచి దీనికి కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. అయినప్పటికీ ఆ ప్లాంట్ పరిసరాల్లో యుద్ధం చేయడం వల్ల దారుణమైన నష్టం జరుగుతుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ, అణు భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Updated Date - 2022-03-04T23:32:57+05:30 IST