మమతకు సీఎంగా ఉండే అర్హత లేదు: నిర్భయ తల్లి

ABN , First Publish Date - 2022-04-12T22:07:57+05:30 IST

హన్ష్‌ఖలీ బాలిక అత్యాచారం విషయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి మండిపడ్డారు. ఒక మహిళా సీఎం అయ్యుండి అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు.

మమతకు సీఎంగా ఉండే అర్హత లేదు: నిర్భయ తల్లి

హన్ష్‌ఖలీ బాలిక అత్యాచారం విషయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి మండిపడ్డారు. ఒక మహిళా సీఎం అయ్యుండి అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు. అత్యాచారాన్ని సమర్ధించేలా మాట్లాడిన మమతకు సీఎం పదవిలో ఉండే అర్హత లేదని నిర్భయ తల్లి అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లా హన్ష్‌ఖలీలో ఇటీవల పద్నాలుగేళ్ల బాలిక గ్యాంగ్ రేప్‌నకు గురైంది. ఈ కేసులో నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల కుటుంబం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. దీంతో ఈ అంశంపై స్పందించిన మమత పరోక్షంగా అత్యాచారాన్ని సమర్ధించేలా మాట్లాడింది. దీంతో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.


 ‘‘బాలిక హత్యాచారానికి గురైందంటున్నారు. అది నిజంగా హత్యాచారం అవుతుందా? ఆమె ప్రెగ్నెంటా.. లేక లవ్ ఎఫైర్ ఉందా అనేది ఎవరైనా విచారించారా? బాలికకు నిందితుడితో లవ్ ఎఫైర్ ఉందని పోలీసులు చెప్పారు. బాలిక కుటుంబం కూడా ఈ విషయమే చెప్పింది. అమ్మాయి.. అబ్బాయి రిలేషన్‌లో ఉంటే దాన్ని ఎలా అడ్డుకోగలం. అది వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛ. ఒకవేళ ఈ విషయంలో తప్పు జరిగితే పోలీసులు నిందితుల్ని అరెస్టు చేస్తారు. ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారు’’ అని మమత వ్యాఖ్యానించింది. దీంతో అత్యాచార ఘటనను ఇద్దరి మధ్య రిలేషన్‌లో జరిగిన పొరపాటుగా మమత వర్ణించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నిర్భయ తల్లి కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఒక మహిళ అయ్యుండి.. మమతకు అత్యాచారం విషయంలో సున్నితత్వం లోపించిందంటే, ఆమెకు మఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు’’ అని నిర్భయ తల్లి విమర్శిచింది.

Updated Date - 2022-04-12T22:07:57+05:30 IST