నిర్లక్ష్యం పెరిగితే...

ABN , First Publish Date - 2022-06-03T08:26:49+05:30 IST

మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి. అవి అత్యావశ్యకాలై ఉంటాయి. అలాంటి వాటిని సమకూర్చుకోవడం, భద్రపరచుకోవడం, వినియోగించుకోవడం తప్పు కాదు. అవసరాలకు మించి

నిర్లక్ష్యం పెరిగితే...

మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి. అవి అత్యావశ్యకాలై ఉంటాయి. అలాంటి వాటిని సమకూర్చుకోవడం, భద్రపరచుకోవడం, వినియోగించుకోవడం తప్పు కాదు. అవసరాలకు మించి వినియోగించుకోవడమే ఆశ. పక్కవారికి ఉన్న వస్తువులన్నీ మన ఇంట్లో కూడా ఉండాలని అనుకోవడం అత్యాశ. ఇతరులకు లేకుండా మనకే ఉండాలని అనుకోవడం దురాశ. ఆశ, అత్యాశ, దురాశ... ఇవన్నీ దుఃఖాన్ని తెచ్చిపెట్టేవే. వస్తువుల మీద అధిక వ్యామోహం మనల్ని ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టేస్తుంది. ఏ వస్తువునైనా పూర్తిగా వినియోగించుకోవాలి. దుస్తులైనా, ఇంట్లోని సామాన్లయినా, వాహనాలైనా, సెల్‌ఫోన్లయినా అంతే. పాతవాటి వినియోగం పూర్తిగా తీరకముందే వాటిని తీసెయ్యకూడదు. పక్కకు తోసెయ్యకూడదు. సంపూర్ణ వినియోగం జరగాలి. అప్పుడు అత్యాశలు, దురాశలు ఉండవు. అంతేకాదు... ఏదైనా ఒక వస్తువు కొద్దిగా దెబ్బతింటే దాన్ని బాగుచేయించుకోవాలి. నిర్లక్ష్యంగా మూలన పడెయ్యకూడదు. 


శ్రావస్తి విహారంలో అలాంటి నిర్లక్ష్య భిక్షువు ఉండేవాడు. అతని ఆరామంలో కుర్చీలు, బల్లలు, చాపలు, దుస్తులు... ఏవి ఏ కొద్దిగా దెబ్బతిన్నా సరే... వాటిని ఒక మూలకు నెట్టేసేవాడు. ఆ వస్తువులు చెదలు పట్టి, ఎలుకలు కొట్టి... క్రమంగా పాడైపోయేవి. అంత నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఎవరైనా ‘‘ఎందుకిలా చేస్తున్నావు?’’ అని అడిగితే...


‘‘ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం? ఏది నిత్యం? మారకుండా ఉండేది ఏది? భగవాన్‌ బుద్ధుడు ఏం చెప్పాడు? ప్రతీదీ, ప్రతిక్షణం మారుతుందని చెప్పాడా, లేదా? అదే వస్తువును ఇక్కడ భద్రం చేస్తే మారకుండా ఉంటుందా? మరింత పాడవకుండా ఉంటుందా? పుట్టిన ప్రతిదీ గిట్టాల్సిందే. జీవి అయినా అంతే... వస్తువైనా అంతే. ఏ వస్తువైనా పాడవకుండా ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుంది? ఎప్పటికైనా నాశనం పొందాల్సిందే కదా!’’ అంటూ తర్కానికి దిగేవాడు. 


అతని వ్యవహారం చివరకు బుద్ధుడికి చేరింది. ఒక రోజు బుద్ధుడు అతని గదికి వచ్చాడు. అక్కడ శిథిలమై పడి ఉన్న వస్తువులను చూశాడు. ఆ భిక్షువు బుద్ధునికి ఏదో చెప్పబోయి ఆగాడు. 


అప్పుడు బుద్ధ భగవానుడు ‘‘భిక్షూ! నీవన్నట్టు శాశ్వతంగా ఉండేది ఏదీ లేదు. ప్రతిదీ అశాశ్వతమే. అనిత్యమే. కానీ ఆ వస్తువును అలా నిర్లక్యంగా పడేయకపోతే... అది మరి కొంతకాలం, మరికొంతమందికి ఉపయోగపడేది కదా! అయినా నీ నిర్లక్ష్యం వల్ల ఇలా పాడైపోయిన వస్తువులను మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏ కోసల రాజో, మగధ రాజో,  లేదా మరో దాతో... కావాలంటే దానం చేస్తారు. నా బాధ ఈ వస్తువుల గురించి కాదు, నీ గురించే. నీలో ఈ నిర్లక్ష్యం పెరిగి, పెరిగి... నిన్నే మింగేస్తుంది. నీవు చివరకు బౌద్ధ సంఘానికి దూరమైపోతావు. చివరకు నీకు నీవే కాకుండా పోతావు. నిర్లక్ష్యం అనేది మనుషుల్ని చెదల కన్నా వేగంగా తినేస్తుంది’’ అన్నాడు.


బుద్ధుని మాటలు ఆ భిక్షువు మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాడు. అధిక వస్తు వినియోగాన్ని పూర్తిగా మానుకున్నాడు. సుఖంగా, శాంతంగా ధర్మాన్ని అభ్యసించాడు.

 బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2022-06-03T08:26:49+05:30 IST