కాదంటే బెదిరిస్తాడు.. వేధిస్తాడు

ABN , First Publish Date - 2022-09-29T05:59:18+05:30 IST

ఎవరికైనా ఆపద వస్తే రయ్యిన దూసుకువచ్చి భరోసా ఇచ్చే 108.. తనలో పనిచేసే మహిళా సిబ్బంది కన్నీటిని మాత్రం తుడవలేకపోతోంది.

కాదంటే బెదిరిస్తాడు.. వేధిస్తాడు

కన్నుపడితే... కాటేస్తాడు...

ఉద్యోగాలు వీడుతున్న మహిళా సిబ్బంది

బతుకుదెరువు కోసం భరిస్తున్న కొందరు

108 సిబ్బందిని వేటాడుతున్న మృగాడు

శిక్షణ.. పర్యవేక్షణ పేరిట భారీగా వసూళ్లు


ఎవరికైనా ఆపద వస్తే రయ్యిన దూసుకువచ్చి భరోసా ఇచ్చే 108.. తనలో పనిచేసే మహిళా సిబ్బంది కన్నీటిని మాత్రం తుడవలేకపోతోంది. ఈ విభాగంలో పనిచేసే ఓ అధికారి కామంతో కాటు వేయాలని చూస్తుంటే.. మౌనంగా భరిస్తోంది. ఆపదలో ఉన్నవారిని కాపాడే అంబులెన్సు.. సొంత సిబ్బంది కష్టాలను చూసి కంటతడి పెడుతోంది. ఉదయాన్నే విధులకు వెళ్లే మహిళా సిబ్బంది.. ‘దేవుడా.. ఈ రోజు ఆ మృగం కంట పడకుండా చూడు..’ అని మొక్కుకునే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్లలు కనిపిస్తే ఆయన వక్రబుద్ధితో చూస్తారని ఆ విభాగంలో బహిరంగ చర్చ జరుగుతోంది. ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  


ఊహూ అంటే...

ఆయనకు సహకరిస్తే సరే..! లేదంటే మహిళా సిబ్బందిని విధుల పేరిట వేధిస్తారని బాధితులు వాపోతున్నారు. మానం కాపాడుకునేందుకు ఇప్పటికే కొందరు ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పారని సమాచారం. మరికొందరు బతుకుదెరువు కోసం, తప్పని పరిస్థితుల్లో వేధింపులు భరిస్తున్నామని అంటున్నారు. ఆ అధికారి తీరును ప్రశ్నించిన పురుష సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతారని అంటున్నారు. స్వస్థలాలకు దూరంగా డ్యూటీలు వేస్తారని వాపోతున్నారు. 

 ఆ విభాగంలో పనిచేసే ఓ యువతిపై ఆయన కన్నేశాడు. దగ్గర కావాలని వివిధ రకాలుగా ప్రయత్నించారట. దీంతో భయపడి ఉద్యోగం వదిలేసి వెళ్లినట్లు సమాచారం. తన తల్లిదండ్రుల వద్ద విషయం చెప్పినా.. ‘పెళ్లిగాని పిల్ల.. అల్లరిపాలు కావడం ఎందుకు..’ అని సమాజానికి భయపడి మిన్నకుండిపోయారని 108 సిబ్బంది చర్చించుకుంటున్నారు. 

 ఓ మహిళ ఉద్యోగిని పట్ల ఇలాగే వ్యవహరించారట. ఒప్పుకోలేదని వేధించారట. చివరకు తట్టుకోలేక ఆమె ఉద్యోగాన్ని వదిలేసి, కర్ణాటక ప్రాంతంలోని ఓ క్లినిక్‌లో చేరారని సమాచారం. 

తనకు లొంగని మహిళా సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా దూర ప్రాంతాలకు విధులకు పంపి.. పర్యవేక్షణ పేరుతో వెళ్లి వేధిస్తారట. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో తిరుగుతూ, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. బయటకు చెప్పుకోలేని ఎందరో మహిళలు, నిత్యం మానసిక వేదన అనుభవిస్తున్నారని సిబ్బంది బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. 


హెచఆర్‌ అండతో బరితెగింపు..?

108 వాహనాల నిర్వహణ బాధ్యతను అధికార పార్టీకి చెందిన కీలక నేత బంధువు సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ఈ విభాగాన్ని పర్యవేక్షించే రాష్ట్ర స్థాయి హెచఆర్‌  అండతో జిల్లాకు చెందిన మృగాడు రెచ్చిపోతున్నాడని సమాచారం. మహిళా సిబ్బంది  వేధించడం, బెదిరించి డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారిందని అంటున్నారు. వేధింపులు భరించలేక కొందరు పైలెట్‌లు, ఈఎంటీలు ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోయారని సమచారం. దీన్నికూడా ఆయన ఆదాయ వనరుగా మార్చుకున్నారని అంటున్నారు. కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకున్నవారి నుంచి శిక్షణ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచఆర్‌ అండదండలు ఉన్నాయన్న ప్రచారంతో బాధిత సిబ్బంది మౌనంగా భరిస్తున్నారు. ప్రశ్నిస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని ఆందోళన చెందుతున్నారు. 


పర్యవేక్షణ ఏదీ..?

జిల్లాలో 108 విభాగం ఇలా తయారవ్వడానికి ఏజెన్సీ కీలక అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ ఏజెన్సీ ఈ వాహనాలను నిర్వహిస్తుండడంతో ఉన్నతాధికారులు సైతం అటువైపు చూడడానికి జంకుతున్నారని సమాచారం. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టిసారించి.. ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆపదలో ఉండేవారిని ఆదుకునే విభాగంలో అకృత్యాలను అరికట్టాలని బాధితులు కోరుతున్నారు. 


అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలు..

మా శాఖలో అలాంటి వేధింపులు లేవు. మహిళా సిబ్బందిని వేధించేవారు ఎవరూ లేరు. అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలు. అలా జరుగుతున్నట్లు ఎవరైనా నిరుపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతా. కొందరు గిట్టని వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఆరోపణలపై విచారణకు సిద్ధం.

- సుబ్రహ్మణ్యం, 108 జిల్లా కో ఆర్డినేటర్‌ అనంతపురం

Updated Date - 2022-09-29T05:59:18+05:30 IST