కాలనీల్లో లేకుంటే ఎస్సీ, ఎస్టీలు కాదా?

ABN , First Publish Date - 2022-06-27T07:24:31+05:30 IST

’ఉమ్మడి జిల్లాలో 13,35,422 గృహ వినియోగ విద్యుత్తు సర్వీసులున్నాయి. వీటిలో 1,68,350 ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులవే. వీళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెడుతోంది.

కాలనీల్లో లేకుంటే ఎస్సీ, ఎస్టీలు కాదా?

ఉచిత విద్యుత్తుపై ప్రభుత్వ వింత వాదన


కుల ధ్రువీకరణ, ఆధార్‌ అనుసంధానమైతేనే 200 యూనిట్ల లబ్ధి


ఉమ్మడి జిల్లాలో ఉచితానికి దూరం కానున్న 50 వేల మంది 


చిత్తూరు, ఆంధ్రజ్యోతి / చిత్తూరు రూరల్‌


’ఉమ్మడి జిల్లాలో 13,35,422 గృహ వినియోగ విద్యుత్తు సర్వీసులున్నాయి. వీటిలో 1,68,350 ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులవే. వీళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు  సరఫరా చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం కొత్త నిబంధనలు పెడుతోంది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉండే వారికే ఉచిత విద్యుత్తును పరిమితం చేయనుంది. దీనికోసం ఎస్సీ, ఎస్టీలు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు? వారిలో ఉద్యోగాలు చేసేవాళ్లున్నారా? లబ్ధిదారుల ఇంట్లో ఇతరులు ఎవరైనా నివసిస్తున్నారా? ఎస్సీ, ఎస్టీలు తమ ఇళ్లను ఇతరులకు ఎవరికైనా అమ్మేశారా? మీటరు ఎవరి పేరున ఉంది? నివాసితుల ఆధార్‌కు అనుసంధానమై ఉందా లేదా..? అని పరిశీలించి తుది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. గత నెల 20వ తేదీ నుంచి సర్వే చేసి కొత్త నిబంధనల ప్రకారం అనర్హులను తేల్చింది. ఆ ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 50 వేల మందికిపైగా ఈ నెల నుంచి ఉచిత విద్యుత్తు లబ్ధి ఆగిపోనుంది. కాలనీల్లో లేని వాళ్లకు ఈ నెల వరకే 200 యూనిట్ల లబ్ధి చేకూరనుంది. మీటరు, ఆధార్‌ అనుసంధానం కాకుండా అనర్హుల జాబితాలో ఉన్న వారు అర్హులుగా  నిరూపించుకునే వరకూ ఉచిత విద్యుత్తును నిలిపేయనున్నారు. ఆ మేరకు సదరన్‌ డిస్కం అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. మొత్తానికి సచివాలయ సిబ్బంది ధ్రువీకరించిన వారికే ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


 ధ్రువపత్రాలు చూపిస్తేనే..


ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్తు వినియోగదారుల్లో కొందరు జీవనోపాధి కోసం ఊరొదిలి వెళ్లిపోతుంటారు. ఎక్కువ మంది నిరక్షరాస్యులే. గతంలో అధికారుల ధ్రువీకరణతోనే ఇప్పటివరకు లబ్ధి పొందుతున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని, లేకుంటే లబ్ధి నిలిపేస్తామని అధికారులంటున్నారు. వీటి కోసం రెండు మూడు రోజులు తిరిగే అవకాశం, అవగాహన లేక చాలామంది అందించలేకపోయారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సుమారు లక్ష మంది విద్యుత్తు కనెక్షన్లకు ఆధార్‌తో అనుసంధానం జరగలేదు. ఎప్పుడో తాతలు, తండ్రుల పేరిట కనెక్షన్లు పొందారు. ఇప్పుడు వారి వారసులు ఆ ఇళ్లలో ఉంటున్నారు. వీరంతా మీటర్లను తమ పేరిట మార్చుకుని, ఆధార్‌తో అనుసంధానం చేసుకుని, కులధ్రువీకరణ పత్రం అందించి ఆ లబ్ధి పొందేసరికి ‘కరెంటు బాదుడు’ రుచి చూడాల్సిందే. దీనిపై ఎస్సీ, ఎస్టీలు, ఆయా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆందోళనలు చేస్తాం..

ప్రస్తుతం వస్తున్న అధిక విద్యుత్తు బిల్లులను ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారే కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీలకు నిబంధనల పేరుతో ఉచిత విద్యుత్తు సౌకర్యాన్ని తొలగిస్తే, అధిక బిల్లులు ఎలా కట్టుకోగలరు? ఇప్పుడున్న ధరలకు నిత్యావసర సరుకులను కొని తినలేని పరిస్థితుల్లో ఉన్నాం. విద్యుత్తు బిల్లుల భారాన్ని భరించలేం. దీనిపై ప్రభుత్వం పునరాలోచించకుంటే అన్ని దళిత సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తాం.

- కేకే రవి, మాలమహానాడు జిల్లా అధికార ప్రతినిధి



ఇతర ప్రాంతాల్లో నివసించకూడదా?


కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులను ఖర్చు చేయడం లేదు. ఎస్సీ, ఎస్టీలు దళితవాడల్లోనే నివసించాలని ఎక్కడైనా నిబంధన ఉందా? ఇతర ప్రాంతాల్లో ఉంటే మా కులం మారిపోతుందా? ఈ నిబంధన కారణంగా మాకు లభిస్తున్న లబ్ధిని తొలగించడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

- రాజ్‌కుమార్‌, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ మెంబర్‌




అనర్హులను గుర్తించి తొలగిస్తాం..


ఉమ్మడి జిల్లాలో 30 శాతానికిపైగా అనర్హులు ఉచిత విద్యుత్తును వినియోగించుకుంటున్నట్లు గుర్తించాం. ఇలాంటి వారి జాబితాను సిద్ధం చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో దశల వారీగా తొలగిస్తాం.

- హరి, ఇన్‌చార్జ్‌ ఈఈ విద్యుత్‌ శాఖ

Updated Date - 2022-06-27T07:24:31+05:30 IST