జనం అడిగితే.. జనార్దనే!

ABN , First Publish Date - 2022-05-26T09:52:12+05:30 IST

జనం సమస్యల గురించి ప్రస్తావిస్తే అందంతా మాజీ ఎమ్మెల్యే జనార్దనే అడిగిస్తున్నాడంటూ మాజీ మంత్రి బాలినేని సహనం కోల్పోయు అసభ్య పదజాలం వాడటం కలకలం రేపింది.

జనం అడిగితే.. జనార్దనే!

  • సహనం కోల్పోయిన మాజీ మంత్రి బాలినేని
  • గడపగడపకు కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు
  • మనవాళ్లే రైతుల నోళ్లు కొట్టారన్న వైసీపీ మహిళ  


కొత్తపట్నం, చిత్తూరు, మే 25: జనం సమస్యల గురించి ప్రస్తావిస్తే అందంతా మాజీ ఎమ్మెల్యే జనార్దనే అడిగిస్తున్నాడంటూ మాజీ మంత్రి బాలినేని సహనం కోల్పోయు అసభ్య పదజాలం వాడటం కలకలం రేపింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో బుధవారం ‘గడపగడపకు ప్రభుత్వం’ కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. గ్రామంలో ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై టీడీపీ నాయకులు గేనం సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి తదితరులు ఆయనకు అర్జీ ఇచ్చారు. రైతులను నిలువునా ముంచారని, విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని కోరా రు. కాగా, ‘మన పార్టీ వాళ్లే రైతులకు తక్కు వ ధర చెల్లించి ప్రభు త్వం నుంచి ఎక్కువధర తీసుకుని రైతులను మోసం చేశారు’ అని వైసీపీకి చెందిన కవిత అనే మహిళ బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ‘ఆ పని చేసింది మీ బంధువే కదా!’ అని వైసీపీకే చెందిన కొందరు ఆమెకు కౌంటర్‌ ఇచ్చారు. ఈ గందరగోళంలో కోపంతో రగిలిపోయిన బాలినేని అక్కడే ఉన్న దామచర్ల జనార్దన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇదంతా జనార్దనే చేయిస్తున్నాడు. అంతుచూస్తా..’ అంటూ రెచ్చిపోయారు. కాగా, ‘చేసింది మనవాళ్లు అంటుంటే జనార్దన్‌ను తిడతారేంటి’ అంటూ కవిత ఎదురుతిరగడం గమనార్హం. జై జగన్‌.. జై బాలినేని అంటూ వైసీపీ వర్గీయులు పెద్దఎత్తున నినాదాలు చేయగా, ప్రతిగా అక్కడ ఉన్న వారు కూడా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో అందరినీపోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. 


రేషన్‌ వాహనం రావట్లేదు..

రేషన్‌ వాహనం తమ వీధికి రావట్లేదని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులును మహిళలు నిలదీశారు. చిత్తూరు నగరంలోని శరవణపురంలో బుధవారం ఆయన ‘గడప గడపకు  ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ వీధికి రేషన్‌ వాహనం ఎందుకు రావడం లేదో చెప్పాలని మహిళలు ఆయనను నిలదీశారు. తమ పిల్లలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటే పెన్షన్లను ఆపేశారని ఫిర్యాదు చేశారు. వేలూరు రోడ్డులో ప్రధాన డ్రైనేజీ పూడికతీయాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదని కార్పొరేటర్‌ ఇందు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-05-26T09:52:12+05:30 IST