సెరెనా పోరాడినా..

ABN , First Publish Date - 2022-06-30T08:49:42+05:30 IST

సెరెనా పోరాడినా..

సెరెనా పోరాడినా..

ఆరంభ రౌండ్‌లో తప్పని ఓటమి

రదుకాను, కొంటావిట్‌, రడ్‌, ముగురుజా కూడా అవుట్‌

వింబుల్డన్‌లో జొకో జోరు 


లండన్‌: వెటరన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వింబుల్డన్‌లో పునరాగమన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఆమెకు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. అలాగే యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఎమ్మా రదుకాను, రెండో సీడ్‌ అనెటా కొంటావిట్‌, తొమ్మిదో సీడ్‌ ముగురుజా, పురుషుల మూడో సీడ్‌ కాస్పెర్‌ కూడా కంగుతిన్నారు. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మూడో రౌండ్‌లో ప్రవేశించాడు. బుధవారం మూడు గంటలకుపైగా జరిగిన మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో సెరెనా తీవ్రంగా పోరాడింది. కానీ తొలిసారి వింబుల్డన్‌ బరిలో దిగిన ఫ్రాన్స్‌కు చెందిన 115వ ర్యాంకర్‌ హార్మనీ టాన్‌ 7-5, 1-6, 7-6 (7)తో 40 ఏళ్ల సెరెనాకు షాకిచ్చి సంచలనం సృష్టించింది. గాయంతో నిరుడు ఈ టోర్నీ మొదటి రౌండ్‌ మధ్యలో సెరెనా వైదొలగిన సంగతి తెలిసిందే. ‘గత సంవత్సరంకంటే ఈ ఏడాది బాగా ఆడా. ఇలాంటి ఆరంభమే కావాలి’ అని ఏడుసార్లు వింబుల్డన్‌ విజేత సెరెనా వ్యాఖ్యానించింది. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో.. యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌,  స్థానిక స్టార్‌ ఎమ్మా రదుకానును 6-3, 6-3తో కరోలిన్‌ గార్షియా (ఫ్రాన్స్‌) మట్టికరిపించింది. మరో రెండో రౌండ్‌ పోరులో వరల్డ్‌ నెం. 97 జూలీ నీమీర్‌ (జర్మనీ) 6-4, 6-0తో రెండో సీడ్‌ కొంటావిట్‌ (ఎస్తోనియా)ను కంగుతినిపించింది. మాజీ చాంపియన్‌ ముగురుజా (స్పెయిన్‌) 4-6, 0-6తో గ్రీట్‌ మినెన్‌ (బెల్జియం) చేతిలో మొదటి రౌండ్‌ పరాజయంతో టోర్నీనుంచి నిష్క్రమించింది. పురుషుల్లో..ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనలిస్ట్‌ కాస్పెర్‌ రడ్‌ (నార్వే) 6-3, 2-6, 5-7, 4-6 తో అన్‌సీడెడ్‌ యూగో హంబర్ట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో రెండో రౌండ్‌లో ఓడాడు. టాప్‌సీడ్‌ జొకోవిచ్‌ 6-1, 6-4, 6-2తో కొకినాకిస్‌ (ఆస్ట్రేలి యా)ను చిత్తుచేసి మూడో రౌండ్‌కు దూసుకు పోయాడు.  మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో ఆరో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7-6 (1), 7-5తో మర్టిన్కోవాపై, ఎనిమిదో సీడ్‌ పెగులా 6-3, 7-6 (2)తో వెకిక్‌పై గెలిచారు. 12వ సీడ్‌ జెలెనా ఒస్టాపెంకో 6-2, 6-2తో విక్‌ మాయెర్‌పై,  15వ సీడ్‌ ఏంజెలిక్‌ కెర్బెర్‌ 6-3, 6-4తో లినెట్టిపై విజయంతో మూడో రౌండ్‌లో అడుగుపెట్టారు. 



Updated Date - 2022-06-30T08:49:42+05:30 IST