
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ అల్లర్ల ద్వేషపూరిత ప్రసంగాల కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో చేసే ప్రసంగం సాధారణ సమయంలో చేసిన ప్రసంగానికి భిన్నంగా ఉంటుందని పేర్కొంది. కొన్నిసార్లు ఎలాంటి ఉద్దేశం లేకపోయినా చక్కని వాతావరణం కోసం ప్రసంగిస్తుంటారని తెలిపింది. ఏ విషయమైనా చిరునవ్వుతో చెబితే అది నేరం కాదని, కానీ అభ్యంతరకరంగా మాట్లాడితే మాత్రం నేరపూరితం కావచ్చని జస్టిస్ చంద్రధారి సింగ్ అభిప్రాయపడ్డారు.
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఎంపీ పర్వేష్వర్మలపై ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సీపీఎం నేత బృందాకారత్ చేసిన విజ్ఞప్తిని దిగువ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ చంద్రధారి సింగ్.. ‘‘అవి ఎన్నికల ప్రసంగాలా? అది ఎన్నికల ప్రసంగమా? లేదంటే సాధారణ సమయమా? ఎన్నికల సమయంలో ఏదైనా స్పీచ్ ఇచ్చి ఉంటే, అది వేరే విషయం. కానీ, సాధారణ సమయంలో ఇచ్చి ఉంటే అది ప్రేరేపించడమే అవుతుంది. ఇక, ఎన్నికల సమయంలో రాజకీయాల కోసం నాయకులు ఎన్నెన్నో చెబుతుంటారు. అది కూడా తప్పే. అయితే, ఇక్కడ నేరాన్ని చట్టం కోణంలోంచి చూడాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
అలా కాకుంటే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులపై వేలాది ఎఫ్ఐఆర్లు నమోదయ్యే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ‘‘మీరు ఏదైనా చిరునవ్వుతో మాట్లాడితే నేరం కాదు. కానీ అభ్యంతరకరంగా మాట్లాడితేనే నేరం అవుతుంది. కాబట్టి సమన్వయం అవసరం. లేదంటే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులందరిపైనా 1000 ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి’’ అని ధర్మాసనం వివరించింది.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ఇక్కడ మనకు మాట్లాడే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. ఆ ప్రసంగం ఎప్పుడు? ఏ సమయంలో జరిగింది? దాని ఉద్దేశం ఏమిటి? ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశమా? లేదంటే నేరం చేసేందుకు ప్రజలను ప్రేరేపించేందుకు చేసినదా? అనేది తెలుసుకోవాలని బెంచ్ పేర్కొంది.
‘‘యే లోగ్ ఆప్కే ఘరోం మే ఘుసేంగే ఆప్కీ బేటీయోం కో ఉఠాయేంగే అవుర్ ఉన్కో రేప్ కరేంగే’’ అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ‘యే లోగ్’ అనే పదం ఎవరిని సూచిస్తుందని, అది నిర్దిష్ట సామాజిక వర్గాన్ని సూచిస్తుందని పిటిషనర్ ఎలా అనుకుంటారని కోర్టు ప్రశ్నించింది. బదులుగా పిటిషనర్ తరపు న్యాయవాది ఆదిత్ పూజారి మాట్లాడుతూ.. అది షహీన్‌బాగ్ ఘటనను ఉద్దేశించి చేసినదని కోర్టుకు తెలిపారు. కాగా, వాదోపవాదాల అనంతరం కారత్ పిటిషన్‌పై కోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచింది.
ఇవి కూడా చదవండి