బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు బంద్‌!

ABN , First Publish Date - 2022-09-25T05:13:00+05:30 IST

తెలంగాణలో డబుల్‌ఇంజన్‌ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోతాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు బంద్‌!
జహీరాబాద్‌లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

 రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


జహీరాబాద్‌, సెప్టెంబరు 24: తెలంగాణలో డబుల్‌ఇంజన్‌ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోతాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని మోసపూరిత ప్రకటనలు చేస్తూ, ప్రజలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్న పింఛన్‌ రూ.2,016లను బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.600 పింఛన్‌ మాత్రమే అందిస్తుందన్నారు. 


దేశానికే దశ - దిశ చూపుతున్న తెలంగాణ


అన్ని రంగాల అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దశ దిశ చూపుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం మొగుడంపల్లిలో నూతనంగా నిర్మించిన తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజన విద్యాలయాల సంఖ్య 91 నుంచి 183 వరకు పెరిగిందన్నారు. త్వరలో గిరిజన పీజీ, లా కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. గతంలో గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలవి 298, ఉంటే ప్రస్తుతం 923కు చేరుకున్నాయన్నారు. గతంలో గురుకులాల్లో లక్షా12 వేల మంది విద్యార్థులు ఉంటే, ప్రస్తుతం నాలుగు లక్షల 50 వేల మంది ఉన్నారని వెల్లడించారు. అంతకుముందు మంత్రి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన రాధా అనే విద్యార్థినికి నగదు బహుమతిని అందజేశారు. ఒకప్పుడు మొగుడంపల్లి ప్రాంతంలో తాగునీటికి కటకట ఉండేదని, కేసీఆర్‌ నాయకత్వంలో ఇంటింటికీ నల్లా పెట్టి నీరు అందిస్తున్నామని హరీశ్‌రావు చెప్పారు. గతంలో గీతారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో జహీరాబాద్‌ ప్రాంతానికి సాగునీరు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలో 11,480 మంది ఆడపిల్లల పెళ్లిల్లకు రూ.109 కోట్ల ఆర్థిక సహాయంతో పాటు 38,830 మందికి ప్రతీనెల రూ.8 కోట్లు ఆసరా పెన్షన్‌లు ఇస్తున్నామన్నారు. మొగుడంపల్లి మండలాభివృద్ధికి రూ.కోటి నిధులు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మండల సమైక్య స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.13.20కోట్ల బ్యాంకు లింకేజ్‌ చెక్కును, లబ్ధిదారులకు ఆసరా పింఛన్‌ కార్డులను, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మొగుడంపల్లిలో సెంట్రల్‌ డివైడర్‌, సీసీ రోడ్లను ప్రారంభించారు. మన్నాపూర్‌, మొగుడంపల్లిలో రైతువేదికలను, జిల్లా పరిషత్‌ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. 


రాష్ట్రంలో 350 బస్తీ దవాఖానాలు 


రాష్ట్రంలో 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్‌రవు చెప్పారు. జహీరాబాద్‌ పట్టణంలో రూ.13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానాను శనివారం మంత్రి ప్రారంభించారు. రూ.ఏడున్నర కోట్లతో నిర్మించనున్న మాతా శిశు ఆసుపత్రికి శంకుస్థాపన చేసి, మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జిల్లా వైద్యాధికారి తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. జహీరాబాద్‌ పట్టణ ప్రజలకు తాగునీటి కోం రూ.40కోట్లతో వాటర్‌ట్యాంక్‌ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గత మూడు, నాలుగు ఏళ్లలో జహీరాబాద్‌ పట్టణ అభివృద్ధికి రూ.180 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. మైనారిటీలకు ఐదెకరాల ప్రభుత్వ భూమిని శ్మశానవాటిక కోసం కేటాయించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉర్దూ మీడియం భవనాన్ని, వాటర్‌ ట్యాంక్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, కలెక్టర్‌ శరత్‌, హెచ్‌డీసీ చైర్మన్‌ చింతా ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, ఆత్మ కమిటీ చైర్మన్‌ పెంటారెడ్డి, జడ్పీటీసీ అరుణవిజయమోహన్‌రెడ్డి, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌, జిల్లా వైద్యాధికారిని గాయత్రిదేవి, జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శేషు పద్మనాభరావు, సర్పంచ్‌ సుగుణ, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, రాములు, తన్వీర్‌, ఇజ్రాయిల్‌ బాబీ, నామరావుకిరణ్‌, బండి మోహన్‌, సందీప్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:13:00+05:30 IST