పీవీపై సీఎంకు ప్రేమ ఉంటే జిల్లాను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-06-17T05:04:13+05:30 IST

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావుపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉంటే హుజూరాబాద్‌ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు.

పీవీపై సీఎంకు ప్రేమ ఉంటే జిల్లాను ఏర్పాటు చేయాలి
హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న ఇనుగాల పెద్దిరెడ్డి

బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి

హుజూరాబాద్‌ రూరల్‌, జూన్‌ 16: మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావుపై సీఎం కేసీఆర్‌కు ప్రేమ ఉంటే హుజూరాబాద్‌ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌ జిల్లా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. కరోనా వైరస్‌ బారిన పడి కుటుంబాలు చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సూచించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న కార్పొరేట్‌ ఆస్పత్రుల ఆగడాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సాక్షాత్తూ జిల్లా మంత్రి పేర్కొంటున్నాడని, ఈటల రాజీనామా నేపథ్యంలో హుజూరాబాద్‌ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారంటూ మంత్రి గంగుల చెబుతున్నారన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. తాను టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని కలిశానని, పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ఆరోపణలు ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశానుసారం పనిచేస్తానని పేర్కొన్నారు. అనంతరం కరోనా కారణంగా మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, వారికి అండ గా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్‌ పోరెడ్డి కిషన్‌రెడ్డి, ఇనుగాల విక్రమ్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు భాస్కర్‌రెడ్డి, మల్లారెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T05:04:13+05:30 IST