రంగు మారినా.. కొనుగోలు చేయాల్సిందే!

ABN , First Publish Date - 2020-11-29T04:52:08+05:30 IST

‘ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేసి.. లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ధాన్యం రంగు మారినా.. వాటిని తిరస్కరించకుండా కొనుగోలు చేయాల్సిందే’ అని జేసీ సుమిత కుమార్‌ అధికారులను ఆదేశించారు. నివర్‌ తుఫాన ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది

రంగు మారినా.. కొనుగోలు చేయాల్సిందే!
పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో పరికరాలను పరిశీలిస్తున్న సుమిత్‌కుమార్‌

నిబంధనల మేరకు ధాన్యం సేకరించాలి

ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు నమోదు చేయండి

జేసీ సుమిత్‌ కుమార్‌ 

(ఆమదాలవలస రూరల్‌/సరుబుజ్జిలి/ఎల్‌.ఎన్‌.పేట/మెళియాపుట్టి/హిరమండలం)

‘ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేసి.. లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ధాన్యం రంగు మారినా.. వాటిని తిరస్కరించకుండా కొనుగోలు చేయాల్సిందే’ అని జేసీ సుమిత కుమార్‌ అధికారులను ఆదేశించారు. నివర్‌ తుఫాన ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. చాలా ప్రాంతాల్లో ధాన్యం రంగు మారిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జేసీ సుమిత కుమార్‌ శనివారం ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎల్‌.ఎన.పేట, మెళియాపుట్టి, హిరమండలం ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశించారు. 

- ఆమదాలవలస మండలం కృష్ణాపురం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది రైతుల వివరాలను రిజిస్ర్టేషన్‌ చేయాలని జేసీ ఆదేశించారు. ఆమదాలవలస మండలానికి ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంజూరు చేశామని తెలిపారు. మునిసిపాలిటీలోని మోణింగి వారివీధి సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు, పీఎసీఎస్‌ సిబ్బంది గురుగుబెల్లి రామ్మోహన్‌, చిగురుపెల్లి వెంకటరావు ఉన్నారు.

- సరుబుజ్జిలి పీఏసీఎస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  జేసీ పరిశీలించారు. సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కేంద్రం పరిధిలో సుమారు ఆరు వేల మంది రైతులు ఉండగా, 1,350 మంది మాత్రమే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇస్తున్నట్లు రిజిస్ర్టేషన్‌ చేయించుకోవడంతో వ్యవసాయ సహాయకుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

-లక్ష్మీనర్సుపేట, చాపర(మెళియాపుట్టి), గులుమూరు(హిరమండలం)లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జేసీ ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలని ఆదేశించారు. తూకం, నాణ్యతలో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుభరోసా కేంద్రాల్లో వారం రోజుల్లో రైతుల వివరాలు నమోదు చేయించాలని సూచించారు. జిల్లాలో 811 రైతు భరోసా కేంద్రాల ద్వారా 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. దళారుల బారిన పడకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని రైతులను కోరారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాకే నేరుగా నగదు జమవుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఏడీఏ మధు, తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ, డీటీలు పద్మావతి, ప్రసాదరావు, సీఎస్‌డీటీ కూర్మారావు,  ఏపీఈడీవోలు ఆర్‌.కాళీప్రసాదరావు, చంద్రకుమారి, ఏవోలు పద్మనాభం పి.లతాశ్రీ, దానకర్ణుడు, పీఏసీఎస్‌ సీఈవో సింహాచలం, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కె.త్రినాథరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌లు బాలరాజు, ఏవీ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-11-29T04:52:08+05:30 IST