కౌన్సిలరే చనిపోతే.. సామాన్యుల గతేంటి?

ABN , First Publish Date - 2020-07-07T07:35:55+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందించకపోవడం వల్లే సంగారెడ్డి మునిసిపల్‌ కౌన్సిలర్‌ గౌసియా బేగం మృతి చెందారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఒక కౌన్సిలర్‌నే కాపాడలేని పరిస్థితి ఉంటే.. సామాన్యుల గతేంటని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీచ, దుర్మార్గ పాలన కొనసాగుతోందని

కౌన్సిలరే చనిపోతే.. సామాన్యుల గతేంటి?

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందించకపోవడం వల్లే సంగారెడ్డి మునిసిపల్‌ కౌన్సిలర్‌ గౌసియా బేగం మృతి చెందారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఒక కౌన్సిలర్‌నే కాపాడలేని పరిస్థితి ఉంటే.. సామాన్యుల గతేంటని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీచ, దుర్మార్గ పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు. కరోనా బారిన పడిన కౌన్సిలర్‌కు చికిత్స అందించే విషయమై ఐదు రోజుల పాటు తానే స్వయంగా ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగానని, ఎక్కడికి వెళ్లినా బెడ్లు లేవనే సమాధానం చెప్పారన్నారు. మునిసిపల్‌ కౌన్సిలర్‌ను కాపాడుకునే పరిస్థితి లేని రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నానని వ్యాఖ్యానించారు. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు వంటి సౌకర్యాలు సరిగ్గా లేవని, అవసరమైన మేర సిబ్బందీ లేరని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు? కేంద్రం నుంచి వచ్చిన బృందం ఏం చేసింది? అని ప్రశ్నించారు. ప్రజలను ఎలా కాపాడాలన్న దానిపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సూచించారు. గాంధీలో ప్రతి రోజూ 20 నుంచి 25 మంది చనిపోతున్నా బయటకు చెప్పడం లేదదని ఆరోపించారు. రాజధానిలోని గాంధీ ఆస్పత్రికే దిక్కు లేదని.. ఇక జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మంత్రి ఈటలకు మంచి పేరుందని, దాన్ని కాపాడుకోవాలంటే వెంటనే రాజీనామా చేయాలని సూచించారు. ‘‘కషాయం తాగితే సరిపోతుందని హోంమంత్రి మహమూద్‌ అలీ, డేంజర్‌ ఏమీ లేదని మంత్రి తలసాని మాట్లాడుతున్నరు. చుట్టూ పోలీసులు, డాక్టర్లను పెట్టుకున్న వారికి ఏం తెలుస్తది? రాష్ట్రం సేఫ్‌గా ఉందని చెప్పడానికి ముఖం ఉండాలి. ఎంతసేపూ సీఎంకు భజన చేసుడేనా? ప్రజలు అవసరం లేదా?’’ అని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో లక్ష వెంటిలేర్లు ఏర్పాటు చేయాలని, గాంధీ ఆస్పత్రికి రూ.3వేల కోట్లు, జిల్లా ఆస్పత్రులకు రూ.2వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయకుంటే.. ట్యాంక్‌బండ్‌పై కూర్చుని నిరసన తెలుపుతానని, తాడో పేడో తేల్చుకుంటానని హెచ్చరించారు. కరోనా వచ్చి నయమైన వారికి ఫోన్లు చేసి అడుగుతున్న మంత్రి హరీశ్‌కు రోగుల ఇబ్బందులు కనిపించడం లేదని విమర్శించారు. సంగారెడ్డి ఆస్పత్రిలో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయించాలన్న ఆలోచన మంత్రి, ఎంపీకి లేదా? అని ప్రశ్నించారు.

Updated Date - 2020-07-07T07:35:55+05:30 IST