ధర పెంచినా తగ్గేదేలే..!

ABN , First Publish Date - 2022-05-24T09:15:17+05:30 IST

రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగినా..

ధర పెంచినా తగ్గేదేలే..!


  • జోరుమీదున్న మందు బాబులు
  • 4 రోజుల్లో 523 కోట్ల మద్యం విక్రయాలు

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. తెలంగాణలో గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ.523 కోట్ల మద్యం అమ్ముడైంది. 8.31 లక్షల కేసుల బీర్లు, 4.88 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయాలు జరిగాయి. ఇటీవల ప్రభుత్వం మద్యం ధరలను పెంచిన విషయం తెలిసిందే. చీప్‌ లిక్కర్‌పై రూ.25, బీర్‌ బాటిల్‌పై రూ.10 చొప్పున పెరిగాయి. లిక్కర్‌పై మొత్తంగా 20 నుంచి 25 శాతం వరకు ధర పెరిగింది. కొత్త ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి వచ్చాయి. 19న పాత స్టాక్‌ను లెక్కగట్టి మద్యం దుకాణ యజమానుల నుంచి అధికారులు ఎక్సైజ్‌ డ్యూటీని వసూలు చేశారు.


ఒక్కో బాటిల్‌పై పెరిగిన ధరను ముందుగానే కట్టించుకున్నారు. సాయంత్రం వరకు స్టాక్‌ లెక్కింపు జరగడంతో ఆ రోజు పెద్దగా అమ్మకాలు జరగలేదు. కేవలం రూ.75 కోట్ల మద్యమే అమ్ముడైంది. ఆ తర్వాత ఈ నెల 20న రూ.145.3 కోట్లు, 21న రూ.149.5 కోట్లు, 22న రూ.153.5 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నాలుగు రోజుల్లో రూ.523 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ధరల పెంపు తర్వాత రోజుకు సగటున రూ.130 కోట్ల మద్యం విక్రయాలు జరగుతున్నాయని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు.  గత ఏడాది మే నెలతో పోల్చితే.. ఈసారి 36.27 శాతం అమ్మకాలు పెరగడం గమనార్హం.  


గత మే లో రోజుకు రూ.80 కోట్లు..

మద్యం ధరల పెంపు కన్నా ముందు ఇదే నెలలో సగటున ప్రతి రోజు రూ.110 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ నెల 10న రూ.105 కోట్లు, 11న రూ.91.14 కోట్లు, 12న రూ.79 కోట్లు, 13న 97.84 కోట్లు, 14న రూ.76 కోట్లు, 15న రూ.66 కోట్లు, 16న రూ.135 కోట్లు, 17న 95.03 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో సగటున రోజుకు రూ.80 కోట్ల మద్యం అమ్ముడైంది. కాగా, ధరల పెంపు ప్రభావం అమ్మకాలపై ఇప్పుడే పడదని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. రోజూ తాగే వారు ఒకేసారి మానేయడం కష్టమంటున్నారు. నెల తర్వాత ఆర్థిక భారంగా భావించి మద్యం తాగ డం తగ్గిస్తారని అంటున్నారు. జూన్‌ చివరి నుంచి మద్యం అమ్మకాలు కాస్త తగ్గే అవకాశముందని చెబుతున్నారు. 

Updated Date - 2022-05-24T09:15:17+05:30 IST