మూడేళ్లుగా తూము మూతే..!

ABN , First Publish Date - 2022-05-16T06:45:05+05:30 IST

పుంగనూరులోని పుంగమ్మ చెరువు నుంచి పొలాలకు చుక్కనీరు కూడా వెళ్లకుండా అధికారులు మూడేళ్ల కిందట తూమును మూసివేశారు.

మూడేళ్లుగా తూము మూతే..!
మూతపడిన పుంగమ్మ చెరువు తూము

పుంగమ్మచెరువు నుంచి చుక్క నీరు వదలకున్నా నోటీసులు 


పుంగనూరు: పుంగనూరులోని పుంగమ్మ చెరువు నుంచి పొలాలకు చుక్కనీరు కూడా వెళ్లకుండా అధికారులు మూడేళ్ల కిందట తూమును మూసివేశారు. వర్షాలు అంతంతమాత్రమే కురవడం, పుంగమ్మచెరువుకు వరదనీరు వచ్చే వంకలు, కాల్వలు ఆక్రమణలకు గురికావడం, రామసముద్రం మండలంలో చెక్‌డ్యాంల నిర్మాణం వల్ల చాలా కాలంగా నీరు రావడంలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హంద్రీ నీవా జలాలను కుప్పం తీసుకెళ్లే ప్రయత్నంలో పుంగమ్మ చెరువుకు కొద్దిగా నీటిని విడుదల చేయగా.. తర్వాత ఆగిపోయింది. వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో పుంగమ్మ చెరువులోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుకు హంద్రీనీవా నీటిని వదిలి.. తర్వాత చెరువును నింపారు. పుంగమ్మ చెరువునుంచి వ్యవసాయానికి నీటిని వదిలితే చెరువులో నీరు తగ్గుతాయని మూడేళ్ల కిందట మూసిన తూములను తెరవలేదు. దీంతో చెరువునుంచి వ్యవసాయానికి చుక్కనీరు కూడా రావడంలేదు. దంతో బోర్లతో కొద్ది మంది రైతులు మాత్రమే సాగు చేశారు. గతంలో కంటే ఆయకట్టు ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరగడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. పుంగమ్మ చెరువు ఆయకట్టు 400 ఎకరాలు కాగా 285 ఎకరాలు నీటిద్వారా సాగు అయ్యేదని, 115 ఎకరాలు సాగు అయ్యే అవకాశమేలేదని ఇరిగేషన్‌ అధికారులు గతంలోనే గుర్తించారు. తాజాగా ప్రభుత్వం చెరువుల కింద వ్యవసాయ భూములకు నీటితీరువా చెల్లించాలని పుంగమ్మ చెరువు ఆయకట్టులోని 280 మంది రైతులకు సచివాలయ అధికారులు, వీఆర్వోల ద్వారా నోటీసులు పంపారు. వీరిలో కొద్దిమంది రైతులు బోర్లు ద్వారా వ్యవసాయం చేయగా అందులో టమోటా సాగుచేసిన వారు తీవ్రంగా నష్టపోయారు. చుక్కనీరు ఇవ్వకుండానే నీటి తీరువా చెల్లించాలన్న డిమాండుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-05-16T06:45:05+05:30 IST