తీగలాగితే.. గుట్టు రట్టు

ABN , First Publish Date - 2021-06-20T05:47:56+05:30 IST

ఓ చిన్న కేసులో పోలీసులు మూలాలు వెతికారు. నకిలీ కవర్లు తయారు చేసే ముఠా గుట్టు రట్టు చేశారు. కేసు ఛేదించిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తీగలాగితే.. గుట్టు రట్టు
పరిశీస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

  1. ప్రధాన కంపెనీల బ్రాండ్ల పేరుతో మోసం 
  2. నకిలీ ప్యాకెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
  3. రూ.2 కోట్లు విలువైన సామగ్రి సీజ్‌ 


కర్నూలు, జూన్‌ 19: ఓ చిన్న కేసులో పోలీసులు మూలాలు వెతికారు. నకిలీ కవర్లు తయారు చేసే ముఠా గుట్టు రట్టు చేశారు. కేసు ఛేదించిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీపొడి మొదలుకుని చికెన్‌ మసాలాలు, పాన్‌ మసాలాలు, నూనె ప్యాకెట్లు, డిటర్జెంట్లు, విత్తనాలు, ఎరువుల మందులు కూడా ప్రధాన బ్రాండ్లను తలపించేలా నకిలీ ప్యాకెట్లు తయారు చేస్తున్న వైనాన్ని చూసి విస్తు పోయారు. ఆదోని పోలీసులు చేసిన చిన్న ప్రయత్నం భారీ మోసం వెలుగు చూసింది. చివరకు నకిలీ ప్యాకెట్లు తయారు చేసే ముఠా పట్టుబడింది. నిందితులు బోగూడ సురేష్‌ (హైదరాబాద్‌), సుబ్బారెడ్డి (బైలుప్పల, గోనెగండ్ల మండలం), కురువ పెద్ద తిమ్మయ్య (బైలుప్పల, గోనెగండ్ల)ను అరెస్టు చేసి వారి నుంచి రూ.2 కోట్ల విలువ చేసే నకిలీ ప్యాకెట్లు తయారు చేసే యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నూలు ఎస్పీ ఎదుట హాజరు పరిచారు. ఎస్పీ ఫక్కీరప్ప, అడిషినల్‌ ఎస్పీ గౌతమిసాలి, ఆదోని డీఎస్పీ వినోద్‌ కుమార్‌, ఎస్‌బీ డీఎస్పీ మహేశ్వరరెడ్డి, తాలుకా సీఐ పార్థసారథి శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 


కేసు నేపథ్యం ఇదీ..


ఈ నెల 12న ఆదోని తాలుకా ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఎమ్మిగనూరు రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మిగనూరు నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్‌ సైకిల్‌పై రెండు ప్యాకెట్లు తీసుకురావడాన్ని గుర్తించారు. వారిని ఆపి తనిఖీ చేయగా.. పత్తి విత్తనాలు కనిపించాయి. కవర్‌పై ప్రధాన బ్రాండెడ్‌ కంపెనీ పేరు ఉంది. పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే అవి నకిలీ విత్తనాలుగా బయటపడ్డాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే.. తాము బైలుప్పలకు చెందిన సుబ్బారెడ్డి, తిమ్మయ్య నుంచి ఈ విత్తనాలు కొనుగోలు చేసి.. రైతులకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నామని వారు చెప్పారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశారు. తర్వాత సుబ్బారెడ్డి, తిమ్మప్పను అదుపులో తీసుకుంటే.. వారి వద్ద 1400 పత్తి విత్తనాల ప్యాకెట్లు పల్లవి బ్రాండ్‌తో కనిపించాయి. ఇవన్నీ నకిలీవిగా గుర్తించారు. ఈ విషయాన్ని డీఎస్పీ వినోద్‌ కుమార్‌, ఎస్పీ ఫక్కీరప్ప దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ప్రధాన కంపెనీ పేర్లతో కూడిన నకిలీ ప్యాకెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీశారు. ఆదోని తాలుకా సీఐ పార్థసారథి, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి, పెద్దతుంబళం ఎస్‌ఐ చంద్ర ఆధ్వర్యంలో ఓ బృందం ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. 


హైదరాబాద్‌ కేంద్రంగా..


హైదరాబాద్‌కు చెందిన బోగూడ సురేష్‌ 22 ఏళ్లుగా వివిధ ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకేజీంగ్‌ కంపెనీల్లో సూపర్‌వైజర్‌గా పని చేశాడు. అక్కడున్న అనుభవంతో 2018లో కపీశ్వర్‌ రోటో ప్యాకేజింగ్‌ ప్రై.లిమిటెడ్‌ కంపెనీని స్థాపించాడు. రెండు ప్రధాన బ్రాండ్లకు చెందిన కవర్లు తయారు చేసేందుకు అనుమతులు తీసుకున్నాడు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది చెందిన ఆర్గనైజర్లను సంప్రదించాడు. ప్రధాన బ్రాండ్ల కవర్లు తయారు చేసి ఇస్తానని, వాటిలో నాణ్యత లేని పత్తి విత్తనాలు ప్యాక్‌ చేసి అమ్ముకుంటే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. ఇలా కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన బ్రాండ్లకు చెందిన పత్తికంపెనీకి చెందిన కవర్లు తయారు చేసి సరఫరా చేయడం మొదలు పెట్టాడు. 


వీరేం చేస్తారంటే..


ఆర్గనైజర్లు ఆ కవర్లు కొనుగోలు చేసి.. నకిలీ పత్తి విత్తనాలు ప్యాక్‌ చేసి రైతులకు విక్రయిస్తున్నారు. ప్రధాన జిన్నింగ్‌ మిల్లుల వద్ద ఎందుకూ పనికిరాని నకిలీ విత్తనాలను సేకరిస్తారు. వాటిని శుద్ధి చేస్తారు. 50 శాతం ఒరిజినల్‌ పత్తి విత్తనాలతో పాటు నకిలీ విత్తనాలు కలిపి కవర్‌లో ప్యాక్‌ చేసి రైతులను మోసం చేస్తున్నారు. మార్కెట్‌ రేటు కన్నా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లే కాదు.. గుట్కా, పాన్‌ మాసాలాలు, టీ, డిటర్జెంట్లు ఇలా అన్ని ప్రధాన బ్రాండ్లకు చెందిన నకిలీ కవర్లు తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు సురేష్‌ కంపెనీపై దాడి చేసి తనిఖీ చేస్తే ప్యాకెట్లు తయారుచేసే 683 సిలిండర్లు లభించాయి. వీటితో పాటు తయారీ యంత్రాలు, ముడిసరుకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. ఎస్పీ మాట్లాడుతూ నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. రైతులు లోకల్‌ డీలర్ల వద్ద విత్తనాలు, పురుగుల మందులు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఆర్‌బీకే కేంద్రాలు, ప్రధాన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలన్నారు. వాటికి బిల్లులు, ఇన్వాయిస్‌లు తీసుకోవాలని కోరారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ వినోద్‌ కుమార్‌, సీఐ పార్థసారధి, ఎస్‌ఐలు నరేంద్రకుమార్‌రెడ్డి, చంద్ర, హెడ్‌ కానిస్టేబుళ్లు మురళీధర్‌ రెడ్డి, కానిస్టేబుళ్లు మునీర్‌బాషా, భాస్కర్‌, కేశవరెడ్డి, కాశీం, రాము, సుధాకర్‌, లక్ష్మినారాయణ, రాజేశ్వరరెడ్డిని ఎస్పీ అభినందించారు. 

Updated Date - 2021-06-20T05:47:56+05:30 IST