షూటింగులు లేకపోతే బోర్‌ కొడుతోంది

Published: Mon, 08 Aug 2022 00:50:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
షూటింగులు లేకపోతే బోర్‌ కొడుతోంది

‘ఒక్క సినిమా చాలు.. జీవితాల్ని మార్చేయడానికి..’ అంటుంటారు. అది అక్షరాలా  నిజమని నిరూపించారు కృతిశెట్టి. ‘ఉప్పెన’... అనే ఒకే ఒక్క సినిమా కృతిని స్టార్‌ని చేసేసింది. అప్పటి నుంచి క్షణం తీరిక లేదు. వరుస సినిమాలతో బిజీ. ప్రతి మూడు నెలలకు  ఆమె నుంచి ఒక సినిమా వస్తోంది. ఈమధ్యే ‘వారియర్‌’లో రేడియో జాకీగా మెరిసింది.  ఇప్పుడు ‘మాచర్ల నియోజకవర్గం’లో నితిన్‌తో జోడీ కట్టింది. ఈ సినిమా ఈనెల 12న  విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కృతితో జరిపిన చిట్‌ చాట్‌ ఇది.


టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్‌ మీరే. ఈ జీవితం ఎలా అనిపిస్తోంది?

ఈమాట వింటుంటే సంతోషంగా ఉంది. రోజూ పని దొరుకుతోంది. ఇంతకంటే కావల్సిందేముంది? నాపై నమ్మకంతో దర్శక నిర్మాతలు నాకు అవకాశాలు కల్పిస్తున్నారు. వాటిని నిలబెట్టుకోవడానికి నావంతు నేను కష్టపడుతున్నా. 


వచ్చిన కథల్ని చేసేస్తున్నారా? లేదంటే ఒడబోత ఉంటోందా?

ఓ కథ వింటే.. ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్లాలా అనిపించాలి. అలాంటి కథలనే ఎంచుకొంటున్నా. నాకు ప్రతీ రోజూ షూటింగ్‌కి వెళ్లాలనిపిస్తుంది. పని లేకపోతే... బోర్‌ కొట్టేస్తోంది. వచ్చి యేడాదే కదా అవుతోంది. మెల్లమెల్లగా నేర్చుకొంటున్నా. నేనిప్పటి వరకూ తప్పు చేయలేదనే నా ఫీలింగ్‌. నా వరకూ బాగా నటించానా, దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేయగలిగానా లేదా? అనేదే చూసుకుంటున్నా. ఫలితాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకవేళ నేను చేసిన సినిమా ఫ్లాప్‌ అయినా.. అది కూడా నేర్చుకోవడంలో ఓ భాగంగానే చూస్తున్నా.


వారియర్‌ ఫలితాన్ని కూడా పట్టించుకోలేదా?

నా వరకూ అది మంచి సినిమానే. ఎందుకంటే నేను లింగుస్వామి గారి అభిమానిని. ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయనతో పనిచేసే అవకాశం రావడమే గొప్ప. అందుకే ‘వారియర్‌’ చేసినందుకు నేనేం చింతించడం లేదు. చెప్పా కదా.. ఏదైనా ఈ ప్రయాణంలో భాగమే అని.


‘ఉప్పెన’ ఇమేజ్‌ మీకు భారంగా మారిందా?

‘ఉప్పెన’ నా కెరీర్‌ని మార్చేసింది. ఆ సినిమా వల్లే నేనీ స్థాయిలో ఉన్నా. అందులో బేబమ్మ పాత్రని ప్రేక్షకులు అంతగా ఆశీర్వదించారు. ప్రతీసారీ అలాంటి పాత్రలే రావాలని లేదు. అలాంటి పాత్రలే మళ్లీ మళ్లీ చేసినా బోర్‌ కొట్టేస్తాను. నటికి వైవిధ్యభరితమైన పాత్రలు రావాలి. ‘ఉప్పెన’ తరవాత... ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఒప్పుకోవడానికి కారణం అదే. రెండు పాత్రలకూ అస్సలు పోలిక ఉండదు. అలా వెరైటీ పాత్రలు చేసుకుంటూ వెళ్తేనే ఎక్కువ కాలం నిలబడగలుగుతాం.


‘మాచర్ల’లో మీ పాత్ర కూడా ఇంతే వైవిధ్యంగా ఉంటుందా?

నూటికి నూరుపాళ్లు. ఇందులో స్వాతి అనే అమ్మాయిగా నటించా. చాలా సాధారణమైన అమ్మాయి. అమాయకంగా ఉంటుంది. ఈ పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి. ఒక్కో షేడ్‌ మెల్లమెల్లగా రివీల్‌ అవుతూ ఉంటుంది. నా పాత్రని చాలా అందంగా తీర్చిదిద్దారు. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది.


ఈ సినిమాలో ఇంకా కొత్తగా ఏమున్నాయి?

ఇదో మాస్‌ సినిమా. దాంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా చాలా ఉన్నాయి. కామెడీ కూడా చాలా బాగుంటుంది. దర్శకుడు ఈ కథ చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకొన్నా. నాకు అంతగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కుటుంబ కథా చిత్రాలంటే చాలా ఇష్టం. వాళ్లందరికీ ‘మాచర్ల’ తప్పకుండా నచ్చుతుంది.


నితిన్‌ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు కదా, తనతో మ్యాచ్‌ చేయడం కష్టం అనిపించలేదా?

నితిన్‌ చాలా కూల్‌. నాకు సెట్లో చాలా హెల్ప్‌ చేశారు. ఆయనలో నిజాయతీ, అమాయకత్వం రెండూ ఉన్నాయి. పరిశ్రమకొచ్చి ఇరవై ఏళ్లయ్యిందని చెబితే ఆశ్చర్యపోయా. తొలి సినిమా రోజుల్లో ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలానే ఉన్నారు. మేమిద్దరం ఇప్పుడు మంచి స్నేహితులైపోయాం. సెట్లో ఆయన చాలా ఓపిగ్గా ఉండేవారు. ఆయన టైమింగ్‌ని, ఎనర్జీనీ మ్యాచ్‌ చేయడం కష్టమే. కానీ నా వంతు ప్రయత్నించా.


సెట్లో చాలామంది సీనియర్లు ఉండేవారు కదా, ఆ అనుభవాలేంటి?

రాజేంద్ర ప్రసాద్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌.. ఇలా అందరూ నాకంటే సీనియర్లే. వాళ్ల ముందు నేను చాలా చిన్నపిల్లని. నన్ను అంతా అలానే చూసుకొన్నారు. అందరం కలిసే భోజనం చేసేవాళ్లం. నాకు స్వీట్స్‌, ఫ్రూట్స్‌ పంపేవారు. నన్ను చాలా బాగా చూసుకొన్నారు. నేనంటే వాళ్లకు ఎంత ఇష్టముందో అర్థమైంది. ఈ ప్రేమకు, అభిమానానికి రుణపడి ఉంటా.


నాయికా ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలని ఉందా?

లేడీ ఓరియెంటెడ్‌ అంటే చాలా బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. దర్శక నిర్మాతలకు నాపై నమ్మకం ఏర్పడాలి. నాక్కూడా అనుభవం రావాలి. ఇప్పుడే ఆ బరువుని మోయలేను అనిపిస్తోంది.


బాలీవుడ్‌ నుంచి అవకాశాలు వచ్చాయా?

వచ్చాయి..కానీ అక్కడ చేసేంత తీరిక ప్రస్తుతానికి లేదు. తెలుగు, తమిళ భాషల్లో నేను బిజీగా ఉన్నాను. ఇక్కడి వాతావరణం బాగా అలవాటు అయిపోయింది. 


ఇప్పుడు చేస్తున్న సినిమాలేంటి?

సూర్య గారితో ఓ సినిమా చేస్తున్నా. నాగ చైతన్యతో మరోసారి కలిసి నటిస్తున్నా. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రెడీ అయిపోయింది. ఇవి కాకుండా మరో రెండు మూడు చర్చల దశలో ఉన్నాయి.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International