ట్రంప్ ఓడినా.. మరో 76 రోజుల వరకు ఛాన్స్..!

ABN , First Publish Date - 2020-11-05T23:03:13+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతున్న కొద్ది మరింత ఉత్కంఠతను రేకేత్తిస్తున్నాయి. ఒకవైపు అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు అవసరమైన మార్జిన్‌(270 ఎలక్టోరల్ ఓట్లు)కు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అతి చేరువలో ఉంటే.. మరోవైపు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50పైగా ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలు రావాలి. దీంతో చివరి వరకు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది.

ట్రంప్ ఓడినా.. మరో 76 రోజుల వరకు ఛాన్స్..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆలస్యం అవుతున్న కొద్ది మరింత ఉత్కంఠతను రేకేత్తిస్తున్నాయి. ఒకవైపు అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు అవసరమైన మార్జిన్‌(270 ఎలక్టోరల్ ఓట్లు)కు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అతి చేరువలో ఉంటే.. మరోవైపు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50పైగా ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలు రావాలి. దీంతో చివరి వరకు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇదిలాఉంటే... ఒకవేళ ట్రంప్ ఓడిపోతే? ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి? తరువాతి అధ్యక్షుడు వచ్చే ఏడాది జనవరి 20 వరకు బాధ్యతలు చేపట్టలేడు. అంటే ఇంకా 76 రోజులు ట్రంపే అధ్యక్షుడు. ఈ 76 రోజులు అధికార నివాసం శ్వేతసౌధంలోనే ఉంటారు. ట్రంప్ చేతిలోనే అన్ని అధికారులు ఉంటాయి. కనుక ట్రంప్ ఏమైనా చేయొచ్చు.


ఒకవేళ ట్రంప్ ఓడితే పరాభవం అవమానంతో రగిలిపోవడం ఖాయం. మాములుగానే ఆయన వివాదాస్పద నిర్ణయాలతో అందరినీ హడలెత్తిస్తుంటారు. అలాంటిది ఓటమి చవిచూసిన తర్వాత 76 రోజులు ఆయన చేతిలో అధికారం ఉంటే. ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టం. ఊహించని నిర్ణయాలు, పైస్థాయి అధికారుల బదలీలు ఇలా ఎన్నో విషయాల్లో ట్రంప్ తన మార్కును చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే, అంటువ్యాధుల నిపుణుడు డా. అంథోనీ ఫౌసీ‌లపై ట్రంప్ పగ తీర్చుకునే అవకాశం ఉంది. కరోనా విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఫౌసీ తప్పుపట్టడం.. ఆయనను ట్రంప్ ముర్ఖుడని చెప్పడం ఇదివరకే జరిగాయి. క్రిస్టోఫర్‌తోనూ కొన్ని విషయాల్లో ట్రంప్‌కు భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరిపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించడం ఖాయంగానే కనిపిస్తోంది. 


ఇక ఈసారి ట్రంప్ ఓడినా ఆయనకు ప్రజాదరణ విషయంలో ఎలాంటి మార్పు లేదని తాజాగా వెలువడుతున్న ఫలితాలే చెబుతున్నాయి. 2016లో వచ్చిన ఓట్ల కంటే ఈ ఎన్నికల్లో ఆయనకు 50 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. అంటే... ప్రజలు ట్రంప్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసినట్లే. నాలుగేళ్ల పాలనలో ట్రంప్ ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు, కరోనా విషయంలో అలసత్వం ఇలా ఎన్నో విషయాలు ఆయనను ప్రజల్లో తక్కువ చేశాయనే చెప్పాలి. అయినా ఈసారి ఎన్నికల్లో ట్రంప్‌కు ఏకంగా 6.8 కోట్ల మంది ఓటు వేశారు. ఇక్కడే ఆయన చరిష్మా ఎంటో అర్థం అవుతోంది. 


ఫలితం ఎలా వచ్చిన భారీ ప్రజాదరణ ఉన్న ట్రంప్ అధికారాన్ని మాత్రం అంత సులువుగా వదులుకోడనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఆయన ముందే చెప్పారు కూడా. ఒకవేళ తాను ఓడిపోయిన అధికారాన్ని అంత సులువుగా బదలాయించనని. కనుక ట్రంప్ పరాజయం పాలైన తాను అధికారంలో ఉండే 76 రోజులు వైట్‌హౌజ్ నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవడం ఖాయం. ఇప్పటికే పలు రాష్ట్రాల ఫలితాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ... కోర్టు మెట్లు ఎక్కారు. అలాంటిది అధికారం వదులుకోవాల్సి వస్తే... ట్రంప్ తనకు అధికారం ఉన్న ఈ 76 రోజుల్లో మరిన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2020-11-05T23:03:13+05:30 IST