నీళ్లు వాడకున్నా.. తీరువా కట్టాల్సిందే!!

ABN , First Publish Date - 2022-05-16T06:42:29+05:30 IST

మీరు చెల్లించాల్సిన నీటి తీరువా రూ.1711. ఈ నోటీసు అందిన పది రోజుల్లో మొత్తం బకాయిని గ్రామ సచివాలయాల్లో చెల్లించి రశీదు పొందండి. గడువులోగా బకాయి చెల్లించకుంటే ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్‌ఆర్‌ యాక్ట్‌) 1864 ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇదీ 1.61 ఎకరాల పొలం ఉండే ఓ రైతుకు తహసీల్దార్‌ నుంచి అందిన నోటీసు.

నీళ్లు వాడకున్నా.. తీరువా కట్టాల్సిందే!!

జిల్లాలో రూ.2.64 కోట్ల వసూలు లక్ష్యం

చెల్లించకుంటే ఆర్‌ఆర్‌ చట్టం మేరకు చర్యలు

నోటీసులపై ఆగ్రహిస్తున్న అన్నదాతలు


చిత్తూరు, ఆంధ్రజ్యోతి 


మీరు చెల్లించాల్సిన నీటి తీరువా రూ.1711. ఈ నోటీసు అందిన పది రోజుల్లో మొత్తం బకాయిని గ్రామ సచివాలయాల్లో చెల్లించి రశీదు పొందండి. గడువులోగా బకాయి చెల్లించకుంటే ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్‌ఆర్‌ యాక్ట్‌) 1864 ప్రకారం చర్యలు తీసుకుంటాం. 

 ఇదీ 1.61 ఎకరాల పొలం ఉండే ఓ రైతుకు తహసీల్దార్‌ నుంచి అందిన నోటీసు. ఇలాంటి నోటీసులు జిల్లా వ్యాప్తంగా రైతులకు తహసీల్దార్లు అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో పంపిణీ చేయగా, మరికొన్నిచోట అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. 



చెరువుల కింద పొలాలు సాగు చేసుకునే రైతులు ఏడాదికి రెండు సార్లు (ఖరీఫ్‌, రబీ సీజన్లలో) రూ.100 చొప్పున రూ.200 నీటి తీరువా చెల్లించాలి. పంటలు పండిస్తేనే ఈ మొత్తాన్ని జమ చేయాలి. పంట ఏదైనా సరే, చేతికొచ్చాక సాగుకు అయ్యే ఖర్చు కూడా రైతులకు మిగలడం లేదు. సాగు విస్తీర్ణమూ తగ్గుతోంది. యువత ఈ రంగంవైపు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇలా.. గిట్టుబాటు ధరల్లేక.. నష్టాల బారిన పడిన రైతులపై భారం మోపకూడదని గత ప్రభుత్వాలు నీటి తీరువాను వసూలు చేయలేదు. ఇలా పదేళ్లుగా తీరువా మాటనేదే లేకుండా పోయింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మాత్రం నీటి తీరువా బకాయిలను చెల్లించాలని ఒత్తిడి తెస్తోంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వం.. ప్రజల నుంచి పన్నుల రూపేణా పిండేందుకు అవకాశాలను వెతుకుతోంది. ఈ క్రమంలో బక్కచిక్కిన రైతులు కనిపించారు. వారి సమస్యలు.. బాధలను ఏ మాత్రం పట్టించుకోకుండా నీటి తీరువా బకాయిలపై 6 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఒకవేళ అన్నదాతలు డబ్బు కట్టకుంటే రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వసూలు బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించడంతో తహసీల్దార్లు రైతులకు నోటీసులు ఇస్తున్నారు. కొన్నిచోట్ల చెరువు నీళ్లు కాకుండా, బోర్ల కింద పండించుకునే రైతులకూ తీరువా కట్టాలని నోటీసులు వచ్చాయి. సొంత నీళ్లు వాడుకునే తామెందుకు కట్టాలంటూ రైతులు నిలదీస్తున్నారు. కాగా, వసూళ్లకు వెళ్లే వీఆర్వో, వీఆర్‌ఏలకు రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు అధికమవడంతో ఏం చేయాలో తెలియక వీరు సతమతమవుతున్నారు.


రంగంలోకి సచివాలయ సిబ్బంది 


నీటి తీరువాను తొలుత రెవెన్యూ సిబ్బంది మాత్రమే వసూలు చేసినప్పటికీ, ఇప్పుడు సచివాలయ సిబ్బందీ రంగంలోకి దిగారు. చెరువుల కింద భూములుండి, సాగు చేసుకునేవారి నుంచే తీరువా వసూలు చేయాల్సి ఉంది. కానీ, చెరువు కింద భూములుండి సాగు చేయనివారి నుంచి, బోర్ల కింద సాగు చేసుకునే రైతుల నుంచీ వసూలు చేసేందుకు నోటీసులు ఇస్తున్నారు. చెరువు నీరు చుక్క కూడా వాడుకోని తామెందుకు తీరువా చెల్లించాలని గ్రామాల్లో రైతులు రెవెన్యూ, సచివాలయ సిబ్బంది మీద తిరగబడుతున్నారు.


నీటి వనరుల నిర్వహణేది? 


జిల్లాలో చెరువులు, రిజర్వాయర్ల నిర్వహణను ప్రభుత్వం మరచిపోయింది. పంట కాలువలు చాలావరకు పూడిపోయాయి. దీంతో చెరువుల్లో నీళ్లు పొలాలకు అందని పరిస్థితి. మరోవైపు గ్రామాల వారీగా.. ఆయా సీజన్లలో ఏ రైతు.. ఏ పంట.. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే లెక్కలూ నమోదు కాలేదు. చెరువు నీటిని వినియోగించి పంటలు వేశారా అనే వివరాలూ పక్కాగా లేవు. దీంతో పంటలు సాగు చేశారా చేయలేదా అన్నదానితో నిమిత్తం లేకుండా రెవెన్యూ రికార్డుల్లో రైతుల నీటి తీరువా బకాయిలు పెరిగిపోయాయి. ఈ మేరకు అధికారులు బకాయిల నోటీసులు సిద్ధం చేస్తున్నారు. రైతులకు అందజేస్తున్నారు. 


పాలసముద్రం మండలంలో 11 ప్రధాన చెరువులుండగా, వీటి కింద ఆయకట్టు భూములు కలిగిన 5820 మంది రైతులకు రూ.12.44 లక్షలు చెల్లించాలని అధికారులు నోటీసుల్ని సిద్ధం చేశారు. త్వరలో పంపిణీ చేస్తామని తహసీల్దార్‌ భాగ్యలత తెలిపారు.

పెద్దపంజాణి మండలంలోని శంకర్రాయలపేట చెరువు, హనుమాన్‌ చెరువు, అమ్మల్లచెరువు, చలమంగళం చెరువు, రాయల్‌ చెరువు కింద ఆయకట్టు దారులకు నోటీసులు జారీ చేశారు. మిగిలిన చెరువుల కింద ఆయకట్టు ఉన్న రైతులకు ఇంకా నోటీసులు ఇవ్వలేదు.

శాంతిపురం మండలంలో 10 ప్రధాన చెరువుల పరిధిలోని 12 గ్రామాలకు చెందిన 5527 మంది రైతులకు రూ.3.07 లక్షల నీటి తీరువా వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు నోటీసులు అందించారు. 20 మంది రైతులు మాత్రమే రూ.5981 చెల్లించినట్లు తహసీల్దార్‌ లోకేశ్వరం తెలిపారు.

నిండ్ర మండలంలో 8206 మంది రైతులకు రూ.5.20 లక్షలు చెల్లించాలని అధికారులు నోటీసులిచ్చారు. ఇప్పటివరకు రూ.25 వేలు వసూలైంది. 

గంగవరం మండలంలో నాలుగు ప్రధాన చెరువుల కింద 4657 మంది ఆయకట్టుదారులకు నోటీసులిచ్చారు. రూ.92 వేలకుగానూ రూ.22 వేలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

నగరి పట్టణం, రూరల్‌లో 26 చెరువుల పరిధిలో 17,294 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక్కో ఎకరాకు ఏడాదికి రూ.వంద చొప్పున పదేళ్లకు రూ.వెయ్యి చెల్లించాలని అధికారులు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. కానీ, ఇప్పటివరకు ఎవరికీ నోటీసులు అందించలేదు.

Updated Date - 2022-05-16T06:42:29+05:30 IST