ఐపీఎల్ పూర్తిచేయకుంటే రూ. 2500 కోట్లు నష్టపోతాం: గంగూలీ

ABN , First Publish Date - 2021-05-07T23:11:23+05:30 IST

కరోనా సమయంలో కాస్తోకూస్తో అభిమానులకు కాస్తంత వినోదాన్ని పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 29 మ్యాచ్‌ల

ఐపీఎల్ పూర్తిచేయకుంటే రూ. 2500 కోట్లు నష్టపోతాం: గంగూలీ

న్యూఢిల్లీ: కరోనా సమయంలో కాస్తోకూస్తో అభిమానులకు కాస్తంత వినోదాన్ని పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 29 మ్యాచ్‌ల తర్వాత వాయిదా పడింది. పలు జట్ల ఆటగాళ్లు కరోనా బారినపడడంతో టోర్నీని బీసీసీఐ అర్ధంతరంగా వాయిదా వేసింది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ ఉన్న కేలెండర్‌లో ఐపీఎల్‌ను పూర్తిచేసేందుకు అవసరమైన టైమ్ స్లాట్ దొరకడం కష్టమైన పనేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బోర్డు చీఫ్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. టోర్నీలోని మిగతా మ్యాచ్‌లను కనుక నిర్వహించకుంటే జరిగే నష్టం రూ. 2 వేల కోట్లకు పైమాటేనని పేర్కొన్నాడు. 


‘‘ఐపీఎల్‌ను పూర్తిచేయడంలో కనుక మనం విఫలమైతే ఆ నష్టం దాదాపు రూ. 2500 కోట్లు’’ అని గంగూలీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఐపీఎల్‌ను వాయిదా వేసి రెండు రోజులు మాత్రమే అయిందని, ఇతర బోర్డులతో చర్చిస్తున్నామని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు ఏదైనా విండో ఖాళీగా దొరుకుతుందేమోనని చూస్తున్నట్టు వివరించాడు. ఐపీఎల్ వాయిదా పెద్ద ఎదురుదెబ్బ అని తాను అనుకోవడం లేదన్నాడు. గతేడాది వింబుల్డన్ కానీ, ఒలింపిక్స్ కానీ జరగలేదన్న విషయాన్ని గంగూలీ గుర్తు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనమేమీ చేయలేమన్నాడు. టీ20 ప్రపంచకప్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలని గంగూలీ పేర్కొన్నాడు. 

Updated Date - 2021-05-07T23:11:23+05:30 IST