ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం సిద్ధాంతాన్ని అనుసరిస్తే... : మోదీ

ABN , First Publish Date - 2022-04-26T19:57:04+05:30 IST

కుల వివక్షకు వ్యతిరేకంగా శ్రీ నారాయణ గురు అద్భుతంగా

ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం సిద్ధాంతాన్ని అనుసరిస్తే... : మోదీ

న్యూఢిల్లీ : కుల వివక్షకు వ్యతిరేకంగా శ్రీ నారాయణ గురు అద్భుతంగా పోరాడారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాలానికి అనుగుణంగా మతాన్ని నారాయణ గురు సంస్కరించారని చెప్పారు. శివగిరి యాత్ర 90వ వార్షికోత్సవాలు, బ్రహ్మ విద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా ఏడాదిపాటు జరిగే వేడుకల ప్రారంభం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. 


కేరళకు చెందిన శ్రీ నారాయణ గురు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త కూడా. ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. వేడుకల ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, శ్రీ నారాయణ గురు బోధనలను, ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం’ సందేశాన్ని ప్రజలు అనుసరిస్తే, మన దేశాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ విభజించజాలవని తెలిపారు. ఆయన సందేశం ‘ఆత్మ నిర్భర్ భారత్’కు మార్గదర్శనం చేస్తుందన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్, నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఢిల్లీలోని శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 


శివగిరి యాత్ర, బ్రహ్మ విద్యాలయాలను శ్రీ నారాయణ గురు మార్గదర్శనంలో ప్రారంభించారు. శివగిరి యాత్ర 1933లో ప్రారంభమైంది. కేరళలోని తిరువనంతపురం, శివగిరిలో ఏటా డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు ఈ యాత్రను నిర్వహిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి, ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్ర లక్ష్యాలను శ్రీ నారాయణ గురు మాటల్లో చెప్పాలంటే, సమగ్ర విజ్ఞానం ప్రజలందరికీ అందాలనేది ఈ యాత్ర లక్ష్యం. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, సౌభాగ్యానికి ఈ యాత్ర దోహదపడుతుంది. ఈ యాత్ర ముఖ్యంగా ఎనిమిది అంశాలపై దృష్టి పెడుతుంది. అవి ఏమిటంటే, విద్య, పరిశుభ్రత, దైవభక్తి, చేతివృత్తులు, వర్తకవ్యాపారాలు, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవస్థీకృత కృషి. 


శ్రీ నారాయణ గురు దార్శనికతను సాకారం చేయడం కోసం శివగిరిలో బ్రహ్మ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అన్ని మతాల సిద్ధాంతాలను సమాన గౌరవంతో ఒకే చోట బోధించాలని ఆయన కలలుగన్నారు. ఇండియన్ ఫిలాసఫీలో ఏడేళ్ళ కోర్సును ఈ విద్యాలయంలో బోధిస్తున్నారు. శ్రీ నారాయణ గురు రచనలు, బోధనలతోపాటు, ప్రపంచంలోని ముఖ్యమైన మతాల గ్రంథాలను కూడా బోధిస్తారు. 


Updated Date - 2022-04-26T19:57:04+05:30 IST