పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేస్తున్నారా?.. మీరెంత నష్టపోతున్నారో తెలుసా?

ABN , First Publish Date - 2021-08-14T01:26:11+05:30 IST

దాదాపు ప్రతి కంపెనీలో ఉద్యోగస్థులకు పీఎఫ్ ఖాతాలు ఉంటాయి. వాటిలో జమ అయ్యే డబ్బును తరచూ వాడేసుకోవడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువట.

పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేస్తున్నారా?.. మీరెంత నష్టపోతున్నారో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు ప్రతి కంపెనీలో ఉద్యోగస్థులకు పీఎఫ్ ఖాతాలు ఉంటాయి. వాటిలో జమ అయ్యే డబ్బును తరచూ వాడేసుకోవడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువట. ఈ విషయాన్ని ఈపీఎఫ్‌ఓ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఏకే శుక్లా స్వయంగా వెల్లడించారు. ప్రస్తుత కరోనా కాలంలో చాలా మంది ఖర్చుల కోసం పీఎఫ్ ఖాతాలపైనే ఆధారపడ్డారు. ఈ కరోనా కాలంలో సుమారు 7.1 మిలియన్ల పీఎఫ్ ఖాతాలు క్లోజ్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ పీఎఫ్ డబ్బును తీసుకొని రోజులు వెళ్లదీశారు. అయితే ఇలా చేయడం మంచి ఆలోచన కాదని శుక్లా అంటున్నారు. అంతేకాదు ఇలా పీఎఫ్ డబ్బును తరచూ తీయడం వల్ల మనకు భవిష్యత్తులో 35 లక్షల రూపాయల వరకూ నష్టం జరగొచ్చని ఆయన చెప్తున్నారు. తన వాదనను నిరూపించేందుకు ఒక లెక్క కూడా చెప్పారు. ఆ లెక్కేంటో చూద్దామా..?


ఒక 30 ఏళ్ల వ్యక్తి మరో 30 ఏళ్లు ఉద్యోగంలో ఉంటాడు. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏదో అవసరం వచ్చి పీఎఫ్ ఖాతా నుంచి ఒక లక్ష రూపాయలు తీశారని అనుకుందాం. ఈ ఖాతాలోని డబ్బుపై 8.5 శాతం వడ్డీ వస్తుంది. చిన్నమొత్తాల్లో చేసే పొదుపుపై ఇంత వడ్డీ మరెక్కడా రాదు. ఈ లెక్కన ఈపీఎఫ్ లెక్కలు వేస్తే.. పదవీ విరమణ వయసు వచ్చే నాటికి సదరు 30 ఏళ్ల వ్యక్తి విత్‌డ్రా చేసిన రూ.లక్ష.. రూ.11.55 లక్షలుగా మారుతుంది. అంటే ఇప్పుడు తొందరపడి పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయడం వల్ల ఎంత నష్టపోతున్నామో అర్థమైందా? అదే అప్పుడప్పుడూ కొంత చొప్పున ఒక రూ.3 లక్షల పీఎఫ్ సొమ్ము విత్‌డ్రా చేస్తే.. పదవీ విరమణ వయసు నాటికి సుమారు 35 లక్షల రూపాలయ వరకూ నష్టపోయినట్లే అని శుక్లా లెక్కలు చెప్పారు. కాబట్టి మరీ అత్యవసరమైతే తప్ప పీఎఫ్ డబ్బులు డ్రా చేయకండని సలహా ఇస్తున్నారయన. 

Updated Date - 2021-08-14T01:26:11+05:30 IST