పరిహారం అడిగితే బేడీలు వేస్తారా?

ABN , First Publish Date - 2022-07-03T09:54:52+05:30 IST

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో తమ జీవనాధారమైన భూములను కోల్పోయారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరేందుకు వెళితే..

పరిహారం అడిగితే బేడీలు వేస్తారా?

  • గౌరవెల్లి భూనిర్వాసితుల చేతులకు సంకెళ్లు..
  • కోర్టులో హాజరుపరిచేందుకు బేడీలు వేసి తీసుకొచ్చిన పోలీసులు
  • మా వాళ్లేమైనా ఉగ్రవాదులా? దేశద్రోహులా?
  • కుటుంబసభ్యుల ఆగ్రహం


అక్కన్నపేట, జూలై 2: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో తమ జీవనాధారమైన భూములను కోల్పోయారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరేందుకు వెళితే.. అధికార పార్టీకి చెందినవారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ జరిగి పోలీసులకు గాయాలైతే.. అందుకు మీరే కారణమంటూ కేసులు పెట్టారు. 14 రోజులుగా జైల్లో పెట్టి.. కోర్టులో హాజరుపరిచేందుకంటూ చేతులకు బేడీలు వేసి తీసుకొచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లికి చెందిన భూ నిర్వాసితుల పట్ల పోలీసులు ప్రవర్తించిన ఈ తీరుపై వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు ఉగ్రవాదులు, దేశద్రోహుల్లాగా చేతులకు సంకెళ్లు వేసి తీసుకు రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టులో తాము కోల్పోయున భూములకు సంబంధించి పరిహారం చెల్లించాలంటూ నిర్వాసితులు 18 రోజుల క్రితం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీయడం తెలిసిందే. హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట హనుమకొండ-సిద్దిపేట ప్రధాన రహదారిపై వారు ఆందోళనకు దిగారు. అయితే అప్పటికే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరగా వారికి, భూ నిర్వాసితులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో హుస్నాబాద్‌ ఏసీపీ సతీశ్‌కు గాయాలయ్యాయి. 


17 మందిపై కేసులు..

భూనిర్వాసితులు పోలీసులపై దాడులు చేశారంటూ గుడాటిపల్లికి చెందిన 17 మందిపై కేసులు పెట్టారు. వీరిలో రాగి శ్రీనివాస్‌, భూక్యా సక్రు, అంగిటి తిరుపతిరెడ్డి, బద్దం శంకర్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 14 రోజులుగా కరీంనగర్‌ జైలులో గడుపుతున్న వీరిని జూన్‌ 30న హుస్నాబాద్‌ కోర్టులో హాజరుపరిచేందుకు చేతులకు సంకెళ్లు వేసి తీసుకువచ్చారు. దీనిపై వారి కుటుంబసభ్యులు, భూనిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నలుగురికి కోర్టు మరో 14 రోజులపాటు రిమాండ్‌ విధించడంతో తిరిగి జైలుకు తరలించారు. కేసులు నమోదైన మిగతా 13 మంది నిర్వాసితులు పరారీలో ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా దొరకడం లేదు. అయితే రాత్రి అయిందంటే చాలు.. పోలీసులు ఎప్పుడు వస్తారో, ఏం చేస్తారోనని భయం భయంగా బతుకుతున్నామని భూ నిర్వాసితులు చెబుతున్నారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరినందుకు పోలీసులతో దాడులు చేయిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.


నాకు మందులెవరు తెస్తారు?

నాకు ఆరోగ్యం బాగుండదు. ప్రతిరోజూ మందులు వేసుకుంటేనే బతుకుతాను. కూలిపనులు చేసే నా భర్తను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకుపోయిండ్రు. 17 రోజులు అవుతుంది. నేను వేసుకునే మందులు అయిపోయినయ్‌. తెచ్చుకుందామంటే డబ్బులు లేవు. నేను చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? నా పిల్లలను ఎవరు చూసుకుంటారు? నా భర్తను వెంటనే విడుదల చేయాలి.

  •                                                       - భూక్యా ఉమ, జైల్లో ఉన్న సక్రునాయక్‌ భార్య

మేమెలా బతకాలి?

మాకు ఉన్న భూమి అంతా ప్రాజెక్టులో పోయింది. కూలిపనులు చేసుకుంటూ బతుకుతున్నాం. నాకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడిని పట్టుకొని కూలిపనులకు ఎలా పోవాలి? నేను ఎలా బతకాలి? ప్రతి రోజూ భయం భయంగా బతుకుతున్నా. నా భర్తకు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఎప్పుడు జైలు నుంచి వస్తాడా? అని ఎదురు చూస్తున్నా.

  •                                                 - రాగి లాస్య, జైల్లో ఉన్న రాగి శ్రీనివాస్‌ భార్య

Updated Date - 2022-07-03T09:54:52+05:30 IST