రోజూ పకోడీలు తింటే ‘మధ్య ప్రదేశ్’ తగ్గదు : Mamata Banerjee

ABN , First Publish Date - 2022-05-31T19:05:40+05:30 IST

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై వీరోచితంగా

రోజూ పకోడీలు తింటే ‘మధ్య ప్రదేశ్’ తగ్గదు : Mamata Banerjee

కోల్‌కతా : భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతూ నిత్యం గంభీరంగా కనిపించే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,  టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తన పార్టీ నేతతో చాలా సరదాగా మాట్లాడారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రోటుండ్ పురపాలక సంఘం చైర్మన్ సురేశ్ అగర్వాల్‌తో జరిగిన ఈ సంభాషణలో రోజూ ఆయన ఏం తింటారో, ఎలాంటి కసరత్తులు చేస్తారో తెలుసుకున్నారు. ఆ తర్వాత పొట్ట తగ్గడానికి సలహాలు ఇచ్చారు. పొట్టను సరదాగా ‘మధ్య ప్రదేశ్’ అని వ్యాఖ్యానించారు. 


టీఎంసీ నేతలు, కార్యకర్తల సమావేశంలో ఈ సంభాషణ జరిగింది. ఈ సమావేశాన్ని మమత బెనర్జీ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో కూడా స్ట్రీమ్‌లైన్ చేశారు. ఈ సంభాషణ క్రింది విధంగా జరిగింది :


మమత : నీ పొట్ట పెరిగిపోతోంది, ఏదో ఓ రోజు కుప్పకూలిపోతావు. 


సురేశ్ : అదేం లేదు, నేను కుప్పకూలిపోను. 


మమత : వాకింగ్ చేస్తావా? ఎక్సర్‌సైజులు చేస్తావా?


సురేశ్ : నాకు మధుమేహం కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ లేవు. 


మమత : అయితే నీకు కాలేయ సమస్యలు ఉండొచ్చు.


సురేశ్  : నాకు ఆరోగ్య సమస్యలు లేవు.


మమత : అయితే అంత పెద్ద మధ్య ప్రదేశ్ ఎలా వచ్చింది? (పొట్టను మధ్య ప్రదేశ్ అని సరదాగా అన్నారు.)


సురేశ్ : మందులు వాడవలసిన అవసరం నాకు రాలేదు. అది నా రికార్డు.


మమత : రికార్డుని పక్కనబెట్టు. ఎక్సర్‌సైజ్ చేస్తావా? లేదంటే నడుస్తావా? 


సురేశ్ : ఆఁ నేను రోజూ 90 నిమిషాలపాటు నడుస్తాను. అయితే నేను రోజూ పకోడీలు తింటాను. 


మమత : ఉదయాన్నే పకోడీలు ఎందుకు తింటున్నావు?


సురేశ్ : నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. పకోడీలు నాకు ఇష్టం. 


మమత : రోజూ పకోడీలు తింటే నీ పొట్ట తగ్గదు. 


సురేశ్ : అయితే నేను రోజుకు 90 నిమిషాలపాటు కసరత్తులు చేస్తాను. 


మమత : ఏం కసరత్తులు చేస్తావు? నాకు చూపించు.


సురేశ్ అనులోమ, విలోమ ప్రాణాయామం చేశారు. 


మమత : నువ్వు చేస్తున్నది ప్రాణాయామం. దాన్ని చేయడం వల్ల నీ పొట్ట తగ్గదు. 


మరొక నేత : నేను కూడా ఇతర యోగాసనాలు వేస్తాను. 


మమత : అది నీ బరువును తగ్గించదు. నీ పొట్ట కోసం ఎలాంటి ఎక్సర్‌సైజులు చేస్తావు? 


సురేశ్ : కపాలభాతి చేస్తాను. 


మమత : ఎన్నిసార్లు కపాలభాతి చేస్తావు? 


సురేశ్ : వెయ్యిసార్లు.


మమత : అసాధ్యం.


సురేశ్ : నేను దీనిని సాయంత్రం చేస్తాను మేడమ్. నేను ఇంకా ఏమీ తినలేదు.


మమత : నా ముందు వెయ్యి కపాలభాతిలు చేస్తే, ఇక్కడికిక్కడే రూ.10,000 ఇస్తాను.


సురేశ్ : దానిని నేను సాయంత్రం 5 గంటల తర్వాత చేస్తాను. దాన్ని ఉదయం కానీ, సాయంత్రం 5 తర్వాత కానీ చేయాలనే నిబంధన ఉంది. నేను చేయగలనని మీకు సాయంత్రం 5 గంటల తర్వాత రుజువు చేస్తాను. 


మమత : నువ్వు చెయ్యలేవని నేను గ్యారంటీ ఇస్తాను.


సురేశ్ : నేను చేయగలను. ఒట్టు.


మమత : నువ్వు వెయ్యి కపాలభాతిలు చెయ్యడానికి ఆస్కారం లేదు. లేకపోతే నీకు అంత పెద్ద పొట్ట ఉండేది కాదు. సరిగ్గా శ్వాస తీసుకోవడం ఎలాగో నీకు తెలియదు. కేవలం నువ్వు నీ పొట్ట చేత డ్యాన్స్ చేయిస్తున్నావు. నేను కూడా కపాలభాతి చేస్తాను. 


సురేశ్ : ఔను మేడమ్, మీరు రోజూ 24 కిలోమీటర్లు నడుస్తారని నాకు తెలుసు. 


మమత : నేను ఎంత దూరం నడుస్తానో నువ్వు చూడనక్కర్లేదు.


ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 








Updated Date - 2022-05-31T19:05:40+05:30 IST